ఏపీతో మాకు సత్సంబంధాలే ఉన్నాయి: రామ్ మాథవ్

by  |
ఏపీతో మాకు సత్సంబంధాలే ఉన్నాయి: రామ్ మాథవ్
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ వాటికి సీఎం జగన్‌ను జవాబుదారీ చేయాల్సిన అవసరం లేదని… టీటీడీ వివాదంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీలోని పార్టీ కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కలకలం రేపేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పిన ఆయన, రాష్ట్రాభివృద్ధి దిశగా జగన్ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తోందని కితాబిచ్చారు. ఏపీకి, కేంద్రానికి మధ్య సత్సంబంధాలు నడుస్తున్నాయని తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో కూడా వైఎస్సార్సీపీ ఎంపీలు బీజేపీ, ఎన్డీయేకి మద్దతుగా నిలుస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అలాగే కేంద్రం పథకాలకు కూడా సహకరిస్తున్నారని తెలిపారు. అందుకే కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలనే కాకుండా, అంతకుమించి కొత్తగా ఏర్పడిన ఏపీకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నట్టు స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించారని తెలిపారు. అంతే కాకుండా 15వ ఆర్థిక సంఘం కూడా కొత్త రాష్ట్రంగా ఏర్పడిన ఏపీకి ఎంత ఎక్కువ ఇవ్వగలుగుతామో అంతమేరకు ఇచ్చేందుకు సకారాత్మకంగా ఆలోచన చేసిందని ఆయన వెల్లడించారు. టీటీడీ, సింహాచలం వివాదాలను దృష్టిలో పెట్టుకుని అక్కడక్కడ కొన్ని వివాదాలున్నప్పటికీ వాటికి ముఖ్యమంత్రిని జవాబుదారీ చేయాల్సిన పని లేదని ఆయన తేల్చిచెప్పారు.

Next Story

Most Viewed