ప్రవాసీయుల సంక్షేమం కోసమే పార్టీ స్థాపన

by  |
NRI
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రవాసీయుల సంక్షేమాన్ని ఏ పార్టీ పట్టించుకున్న పాపాన పోలేదని, అందుకే వారి సమస్యలు పరిష్కరించాలనే కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించినట్లు తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నంగి దేవేందర్ రెడ్డి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్​క్లబ్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్నాళ్లు తను కొనసాగిన బీజేపీ స్పోక్స్​పర్సన్​పదవికి రాజీనామా చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. దేశంలో అంతర్గతంగా సుమారు 40 కోట్ల మంది కార్మికులున్నట్లు కేంద్రం చెబుతోందన్నారు. 2011 జనాభా గణన ఆధారంగా అంతర్జాతీయంగా 3 కోట్ల పైచిలుకు కార్మికులున్నట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. అయితే 75 ఏండ్ల స్వతంత్ర్య దేశంలో ప్రవాసీయుల కోసం ఇప్పటి వరకు ఏ పార్టీ పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రవాసీ జాతీయ వేదికను ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు.

రాజకీయ పార్టీని స్థాపించి ప్రవాసీయుల సమస్యలపై పోరాడి పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్, ఎంపవర్​మెంట్​కాన్సెప్ట్ తో పనిచేస్తాని స్పష్టం చేశారు. విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులు సైతం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటివరకు ఎన్ఆర్ఐల కోసం ఒక గ్రీవెన్స్​ సెల్​కూడా లేకపోవడం బాధాకరమని అన్నారు. వలస కార్మికులంటే ఇప్పటి ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని, దీనిని మారుస్తామని పేర్కొన్నారు.

నేడు దేశంలో రాజకీయమంటే సామాన్యులు వచ్చే పరిస్థితి లేకుండా కాస్ట్​లీ చేసేశారని వాపోయాడు. వందల కోట్లుంటే కానీ రాజకీయాల్లోకి రాకూడదనే మెసేజ్‌ను ప్రజల్లోకి ఇప్పుడున్న పార్టీలు పంపిస్తున్నాయన్నారు. అన్ని నిధులు ఖర్చు చేయకుండనే పార్టీ ఏర్పాటు చేసి ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొస్తామని దేవేందర్ రెడ్డి అన్నారు. ప్రపంచం మొత్తం టెక్నాలజీలో దూసుకుపోతుంటే ఆన్‌లైన్ ఓటింగ్​విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకురాకపోవడం సరికాదని ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. మైగ్రెంట్స్​ఓటు వేసేందుకు రావాలాంటే ఖర్చుతో కూడుకున్న పని అని, ప్రభుత్వాలు వారికి ఆన్లైన్ ఓటింగ్‌కు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్​చేశారు.

Immigrants

ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర​అధ్యక్షుడు పరికిపండ్ల స్వదేశ్ మాట్లాడుతూ.. 2019 నుంచి గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ట్రేడ్ యూనియన్‌ను ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నామన్నారు. అందుకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, కార్మిక సంఘాలతో సమావేశాలు నిర్వహించి రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకోసం 24 గల్ఫ్​ జేఏసీ అసోసియేషన్లను ఏకం చేస్తామన్నారు. నేషనల్ లెవల్ నెట్​వర్క్, మైగ్రెంట్స్​ఫెడరేషన్ ను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. కరోనా వల్ల కార్మికుల పై ప్రభుత్వ ఆలోచన విధానం ఎలా ఉందనేది తమకు అర్థమైందన్నారు. అందుకే పార్టీ పెట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్​ ఫోరమ్​ అధ్యక్షుడు మంద భీంరెడ్డి మాట్లాడుతూ.. తను కాంగ్రెస్​పార్టీ జాయింట్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. ప్రవాసీయులు ఇతర దేశాల్లో వెళ్లి పనిచేయడం ద్వారా ప్రభుత్వాలకు ఎంతో ఆదాయం సమకూరుతోందని, అయినా కార్మికులపై చిన్నచూపు చూడటం తగదని మండిపడ్డారు. వారికి కనీసం భద్రత కూడా కల్పంచడంలేదన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​జీరో ఇన్వెస్ట్ మెంట్‌తో పార్టీ ఏర్పాటు చేశారని, అలాగే డబ్బు లేకుండా రాజకీయం చేయడం ఎలా అనేది తాము చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడున్న పార్టీలన్నీ కార్పొరేట్ విధానాన్ని ఫాలో అవుతున్నాయని చురకలంటించారు. ఓటర్లకు స్మార్ట్ ఫోన్లే ఆయుధాలు కావాలని కోరారు.

అనంతరం డాక్టర్ అస్మా ఖాన్ ​మాట్లాడుతూ.. విదేశాల్లో ఉన్న కార్మికులు తిరిగి ఇండియాకు వస్తామో లేదో అని తెలియక సతమతమవుతున్నారని తెలిపారు. కొవిడ్ వల్ల ఎందరో ఉద్యోగాలు కోల్పోయారన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్నవారిలో ఉన్నతంగా బతుకుతున్న భారతీయులు కేవలం 10 శాతం మందే ఉన్నారని, 70 శాతానికి పైగా కార్మికులున్నట్లు చెప్పారు. వారికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్​ చేశారు.


Next Story

Most Viewed