జలం.. కలుషితాల ‘కలకలం’

by  |
జలం.. కలుషితాల ‘కలకలం’
X

దిశ, వెబ్‌డెస్క్ : మూసీ నదిపై వందేళ్ల కిందట నిర్మించిన ఉస్మాన్‌సాగర్ డ్యామ్‌లో నీటినాణ్యత చాలా సంవత్సరాలుగా క్షీణిస్తూ ఉంది. పరిశ్రమల వ్యర్థాలతోపాటు నివాసాల నుంచి విడుదలవుతున్న వ్యర్థజలాలతో ఈ రిజర్వాయర్ నీరు కలుషితమైంది. అధిక సంఖ్యలో జనాభాకు తాగునీరందిస్తున్నా మూసీనదిలో కలుస్తున్న పరిశ్రమల రసాయనాలు, జీవసంబంధ కలుషితాల కారణంగా ఈ రిజర్వాయర్‌పై తీవ్ర ప్రభావం పడింది.
వాటర్ క్వాలిటీ ఇండెక్స్(డబ్లూక్యూఐ) ఇటీవలి పరిశోధన ప్రకారం.. ఉస్మాన్ సాగర్‌లో నీటికాలుష్యం 52.84గా నమోదై ‘హీన’ స్థితికి దగ్గరలో నిలిచింది. డబ్ల్యూక్యూఐ లెక్కల ప్రకారం ఈ లెక్కలు 50 నుంచి 70 వరకు నమోదైతే మధ్యస్థంగా ఉన్నట్టు కాగా.. కేవలం రెండు పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెంట్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్(ఐజేఆర్‌టీఈ) ఈ రిజర్వాయర్ నీటిపై మరో నివేదికను వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం 16 నీటి నాణ్యతాప్రమాణాల్లో పీహెచ్ లెవెల్‌కు చెందిన ఒకే ఒక్క పరీక్షలో మాత్రమే నెగ్గింది. ఈ నీరు మానవవ్యర్థాలతో కలుషితమైనదనేందుకు సంకేతంగా కోలిఫాం బ్యాక్టీరియా ఉన్నట్టు తేలింది. ఇంకా చెప్పాలంటే 2011 నుంచి తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్పీఎస్‌బీ) చేపట్టిన నీటి విశ్లేషణలో 2011, 2017లో మాత్రమే ఆక్సిజన్ (డీవో) పరీక్షను నెగ్గింది. జలచరాల మనుగడకు నీటిలో ఆక్సిజన్ ఉండటం అత్యవసరమని తెలిసిందే.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఉస్మాన్‌సాగర్‌ను ఇప్పటికే ‘బీ’ కేటగిరీలో పెట్టింది. అంటే ఈ నీటిని స్నానానికి ఉపయోగించుకోవచ్చని, శుద్ధిచేస్తే తప్ప తాగేందుకు పనికిరాదని తేల్చింది. ఈ రిజర్వాయర్‌లోని నీటిని శుద్ధి చేస్తే 99 శాతం సురక్షితమని, లేకుంటే జీవరసాయన కలుషితాలు అధికంగా ఉంటాయని హెచ్ఎండబ్లూఎస్ & ఎస్‌బీ అధికారి కూడా వెల్లడించడం విశేషం. పూర్తిగా సంప్రదాయపద్ధతుల్లో కలుషితాలను తొలగించి శుద్ధిచేసిన తర్వాతనే నల్లాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు.



Next Story