మేడారం జాతరకు ఇది చాలా అవసరం.. అయినా పట్టించుకోవడంలేదు

by  |
Road-1
X

దిశ, భూపాలపల్లి: మరో రెండు నెలలు అయితే మేడారం జాతర ప్రారంభం కానున్నది. కానీ, జాతరకు వెళ్లే రహదారికి మరమ్మతు పనులు చేపట్టడం ప్రభుత్వం మరిచిపోయింది. భూపాల్ పల్లి జిల్లా కేంద్రం నుండి ఆజంనగర్ గ్రామం మీదుగా మేడారం జాతరకు వేలాది వాహనాలు, ఎడ్లబండ్లు వెళ్తుంటాయి. మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జాతరకు వేలాది వాహనాలు నెల రోజుల పాటు ప్రయాణం చేస్తూ ఉంటాయి. కమలాపూర్ క్రాస్ రోడ్ నుండి ఆజం నగర్ రోడ్డు సుమారు 15 కిలోమీటర్ల వరకు ఈ దారి ప్రస్తుతం అధ్వాన పరిస్థితిలో ఉంది. ఈ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిపోయింది. ఈ 15 కిలోమీటర్ల వరకు ఉన్న ఈ దారి గుండా ప్రయాణం చేయాలంటే గంటకు పైగా సమయం వెచ్చించాల్సి వస్తోంది. ఈ రహదారిని నిర్మించి పది సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ, మరమ్మతు పనులకు నిధులు వెచ్చించాల్సిన విషయాన్ని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు మర్చిపోయారు.

మహారాష్ట్ర, కరీంనగర్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలు కాటారం మండలంలోని చింతకాని గ్రామం నుంచి వస్తుంటాయి. దీంతో వాహనాల రాకపోకలు సులభతరంగా ఉంటుందని అధికారులు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. మేడారం వెళ్లే ఈ రెండు రహదారుల్లో సైతం ఇదే విధంగా పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ నిధులు మంజూరు చేయడం లేదు. ప్రతి ఏటా మేడారం జాతరకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నప్పటికీ వరంగల్ జిల్లాలోని తాడ్వాయి ప్రాంతం పరివాహక ప్రాంతంలోనే నిధులు ఖర్చుచేస్తున్నారు. మేడారం జాతరకు వెళ్లే రహదారుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ప్రయాణికులకు ప్రయాణం ఇబ్బందిగా మారింది.

road-2

అంతేగాక కమలాపూర్ క్రాస్ నుండి ఆజమ్ నగర్ వెళ్లే రహదారి వెంట ఇరువైపులా పిచ్చి మొక్కలు పొదలుగా పెరగడంతో వాహనచోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని సమయాల్లో పొదల నుండి అడవి జంతువులు వాహనాలకు ఎదురై వాహనచోదకులు ప్రమాదాల బారిన పడవలసి వస్తోంది. ఎలుగుబంట్లు, అడవి పందులు ద్విచక్ర వాహనదారులను ఇబ్బంది పెట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. రహదారికి ఇరువైపులా ఉన్న పొరలను శుభ్రం చేయాల్సిన సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ఫిబ్రవరిలో జరగనున్న మేడారం జాతరలో భాగంగా ఈ రెండు రహదారులకు నిధులు వెచ్చించి మరమ్మతులు చేపట్టాలని ఈ ప్రాంతవాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.



Next Story