కొనసాగుతున్న వొడాఫోన్ ఐడియా నష్టాలు

by  |
కొనసాగుతున్న వొడాఫోన్ ఐడియా నష్టాలు
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా నష్టాలు రూ. 7,218.2 కోట్ల నష్టాలను వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 50,291.9 కోట్ల నష్టాలను నమోదు చేసింది. అప్పులు, ఈక్విటీ షేర్ల ద్వారా రూ. 25 వేల కోట్ల నిధుల సమీకరణకు వొడాఫోన్ ఐడియా కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.

సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం స్వల్పంగా తగ్గి రూ. 10,791 కోట్లకు పడిపోయింది. అలాగే, వినియోగదారు సగటు ఆదాయం(ఆర్పు) రూ. 119కు మెరుగుపడిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఎబిటాకు ముందు కంపెనీ ఆదాయం 5.9 శాతం పెరిగి రూ. 1,630 కోట్లకు చేరుకున్నాయి. ఎబిటా మార్జిన్ 14.4 శాతానికి మెరుగుపడిందని కంపెనీ తెలిపింది. జులై-సెప్టెంబర్‌లో వొడాఫోన్ ఐడియా చందాదారుల సంఖ్య తొలి త్రైమాసికంలో ఉన్న 27.9 కోట్ల నుంచి 27.1 కోట్లకు తగ్గింది. వొడాఫోన్ ఐడియా బోర్డు 25 వేల కోట్ల నిధుల సమీకరణకు ఆమోదం తెలిపినప్పటికీ.. సంస్థ రెండేళ్లకు మాత్రమే ఈ నిధులు సరిపోతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

‘సంస్థ కొవిడ్-19 సంబంధిత సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, రెండో త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా మెరుగవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో తగిన వ్యూహాలతో సరైన ప్రణాళికలను అమలు పరుస్తాము. ఇప్పటికే వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టామని’ వొడాఫోన్ ఐడియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రవీందర్ టక్కర్ చెప్పారు. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో గురువారం వొడాఫోన్ ఐడియా షేర్లు 3.46 శాతం తగ్గి రూ. 8.38 వద్ద ముగిశాయు.


Next Story

Most Viewed