రాత్రంతా భయం భయం.. బిక్కుబిక్కుమంటూ గడిపిన వైజాగ్

by  |
రాత్రంతా భయం భయం.. బిక్కుబిక్కుమంటూ గడిపిన వైజాగ్
X

ఎల్‌జీ పాలిమర్స్ కెమికల్ లీక్ భయం విశాఖ వాసులను వీడలేదు. ఒకవైపు సోషల్ మీడియాలో రాత్రంతా గ్యాస్ లీకవుతూనే ఉంది. దీంతో వైజాగ్ వాసుల్లో భయందోళనలు పెరిగిపోయాయి. మరోవైపు గ్యాస్ లీక్ కాకుండా చర్యలు చేపడుతూ ఎల్జీ పాలిమర్స్ సిబ్బందితో పాటు నిపుణులు కూడా గ్యాస్ లీక్ కట్టడికి చర్యలు చేపడుతూ ఉన్నారు.

ఈ క్రమంలో రాత్రి 10:30 సమయంలో ఒకసారి గ్యాస్ లీక్ అయినట్టు తెలుస్తోంది. మరోసారి అర్ధరాత్రి సమయంలో మళ్లీ పెద్ద ఎత్తున గ్యాస్ లీక్ అయింది. దీంతో మరోసారి ప్రజలు ఉరుకులు పరుగులు పెట్టారు. పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు చెందిన ప్రజలు నిన్నటికే ఖాళీ చేయగా.. ఆ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ప్రాణభయంతో పరుగులు తీశారు. మరోవైపు సోషల్ మీడియాలో గ్యాస్‌లీక్ అప్‌డేట్స్‌తో పాటు హెచ్చరికలు ఇబ్బడి ముబ్బడిగా రావడంతో ఎన్‌ఏడీ కొత్తరోడ్, బాజీ జంక్షన్, గోపాలపట్నం, సుజాతనగర్, పెందుర్తి, అడివివరం, పినగాడి, సింహాచలం, ప్రహ్లాదపురం, వేపగుంట ప్రాంతాలకు చెందిన వేలాదిమంది ప్రాణాలు అరచేత పట్టుకుని అర్ధరాత్రి వేళ రోడ్లపైకి చేరుకున్నారు.

రాత్రంతా సురక్షిత ప్రాంతాల్లోని బంధువుల వద్దకు వెళ్లి తలదాచుకునే ప్రయత్నాలు చేశారు. ఇంకొందరు వాహనదారులు వైజాగ్‌లోని బీచ్ రోడ్‌కి చేరుకుని ఇసుక తిన్నెల్లో దుప్పటి వేసుకుని నిద్రపోయారు. గ్యాస్‌లీక్‌కు సంబంధించిన విశేషాలతో కేజీహెచ్‌తో పాటు ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి నిద్రకరవైంది. ఏం జరుగుతుందోనన్న ఆందోళన వారిలో నెలకొంది. దీనికి తోడు ఘటన సంభవించిన సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో 44 మంది పసిపిల్లల్ని అంబులెన్స్‌ల ద్వారా కేజీహెచ్‌కు తరలించారు. వారంతా చికిత్స పొందుతూ తల్లిదండ్రుల కోసం రోదిస్తూ కూర్చున్నారు.

తల తిరగడం, అపస్మారక స్థితికి వెళ్లడం వంటి సమస్యలకు తోడు తల్లిదండ్రులు కనిపించకపోవడం కూడా వారిని కలచివేసింది. దీంతో వారి రోదనలు మిన్నంటాయి. ఆస్పత్రి సిబ్బంది ఎంత సముదాయించినా ఫలితం లేకపోవడం విషాదం అలముకుంది. ఈ పిల్లలంతా 12 ఏళ్ల లోపు వారు కావడం విశేషం. మరోవైపు గ్యాస్‌లీక్ ఘటనలో బాధితులు ఇంకా కోలుకోలేదు. దీంతో తమ వారు ఎక్కడున్నారు? ఏ స్థితిలో ఉన్నారు? వంటి వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో తెలియడం లేదు. బంధువులు మాత్రం తమ వారి కోసం ఆరాతీస్తున్నారు.

Tags: vizag, gas leak, twice leak, venkatapuram, lg polymers



Next Story