విమానమెక్కకుండా 203 దేశాలు చుట్టేశాడు.. ఎవరతను?

by  |
విమానమెక్కకుండా 203 దేశాలు చుట్టేశాడు.. ఎవరతను?
X

దిశ, వెబ్‌డెస్క్:
ప్రపంచంలో 200కు పైగా దేశాలుండగా.. ఐక్యరాజ్య సమితిలో 193 సభ్య దేశాలున్నాయి. విమానం ఎక్కకుండా ఈ దేశాలన్నీ తిరగడం సాధ్యమేనా ? అంటే, అవుననే అంటున్నాడు ఓ డెన్మార్క్‌కు చెందిన పెడెర్సన్. ఆరున్నర సంవత్సరాల నుంచి నాన్‌స్టాప్‌గా ప్రయాణిస్తున్న ఆ ట్రావెలర్ కాళ్లకు.. కరోనా బ్రేకులు వేసింది. మరో 9 దేశాల్లో అడుగుపెడితే.. తన లక్ష్యం పూర్తవుతుందని అనుకుంటున్న వేళ… కరోనా ప్రభావంతో హాంకాంగ్‌లో తాత్కాలింగా ఉండిపోయాడు. కరోనా కోరల నుంచి ప్రపంచమంతా బయటపడితే గానీ.. పెడెర్సన్ బయట దేశాల్లో అడుగుపెట్టేలా లేదు. పెడెర్సన్ జర్నీలోకి మనమూ ఓసారి వెళ్లొద్దామా! పెడెర్సన్ 2013, ఆక్టోబర్ 10న తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.

ఓ ఆర్టికల్ చదివిన తర్వాత..

పెడెర్సన్ వాళ్ల నాన్న పంపించిన ఓ ఆర్టికల్ చదివిన తర్వాత తనకు ప్రపంచయాత్ర చేయాలనే ఆలోచన వచ్చింది. అయితే ఆ యాత్రలో ఎక్కడా విమానం ఎక్కకూడదన్న నియమం పెట్టుకున్నాడు. పది నెలలు పక్కాగా ప్లానింగ్ చేసుకుని తన జర్నీ మొదలుపెట్టాడు. అలా మొదటగా యూరప్, ఆ తర్వాత నార్త్ అమెరికా చుట్టేశాడు. అటు నుంచి సౌత్ అమెరికా, కరీబియన్, ఆఫ్రికా, ద మెడిటేరియన్, మిడిల్ ఈస్ట్, ఈస్టర్న్ యూరప్, ఆసియా ఇలా తన ప్రయాణాన్ని సాగించాడు. , ప్లానింగ్ సరిగా లేకపోతే అన్ని దేశాలను చుట్టి రావడానికి 20 సంవత్సరాలు పట్టొచ్చని చెబుతున్నాడు. ఈ జర్నీలో తన కొన్ని నియమాలు కూడా పెట్టుకున్నాడు. ప్రతి దేశంలో కనీసంగా 24 గంటలు ఉండాలి. అంతేకాదు ఎంతకష్టం వచ్చినా లక్ష్యం పూర్తి కాకుండా ఇంటికి వెళ్లకూడదు. ప్రతి దేశంలో ఉన్న రెడ్‌క్రాస్ (ప్రాంతాన్ని బట్టి పేరులో కాస్త మార్పు ఉండొచ్చు) ను సందర్శించాలి. ఇప్పటి వరకు పెడెర్సన్ 189 దేశాల్లోని రెడ్‌క్రాస్‌లను విజిట్ చేశాడు. ఇంతవరకు ఇలా ఎవరూ రెడ్ క్రాస్ సొసైటీలను సందర్శించి ఉండరని పెడెర్సన్ అంటున్నాడు. ప్రయాణంలో ట్యాక్సీ, బస్, షేరింగ్ రైడ్స్, ట్రక్స్, ఫెర్రీస్, కంటైనర్ షిప్స్ ఇలా ఏవైనా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు ప్రతి రోజు 20 యూఎస్ డాలర్లు మాత్రమే ఖర్చు చేయాలి. రెడ్‌క్రాస్ సొసైటీ‌లో వలంటీర్‌గా పనిచేసే పెడెర్సన్ ప్రస్తుతం హాంకాంగ్ రెడ్ క్రాస్‌లో స్థానిక ప్రజలకు మోటివేషనల్ స్పీచ్‌లు ఇస్తున్నాడు.

ఆ దేశాల్లో చాలా కష్టం..

యెమెన్, ఇరాక్, సిరియా, సౌదీ అరేబియా, ఇరాన్, నౌరు, అంగోలా వంటి దేశాల్లో పర్యటించాలంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇరాన్ వీసా రావాలంటే కనీసం మూడు వారాల సమయం పడుతుంది. సిరియా వీసాకైతే.. మూడు నెలలు పడుతుంది. రెడ్‌క్రాస్‌లో వలంటీర్ కావడంతో.. వాళ్ల ద్వారా పెడెర్సన్ చాలా త్వరగా వీసా అప్రూవల్ తెచ్చుకున్నాడు. అంతేకాదు విమానమెక్కకుండా డెమాస్కస్, జోర్డాన్, ఆకాబా, లెబనాన్, ఈజిప్ట్ దేశాల్లో తిరగాలంటే కష్టమే. అయితే పెడెర్సన్ షిప్పుల్లో పని చేయడంతో.. వారి సహకారంతో కంటెయినర్లలో కూడా ఈజీగా ప్రయాణం చేశాడు. కొన్నిదేశాల్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. చాలా సమస్యలు వచ్చినప్పుడు ఎంతోమంది స్నేహితులు సాయం చేశారని పెడెర్సన్ అంటున్నాడు.

పర్సనల్ లైఫ్ :

పెడెర్సన్ వాళ్ల అమ్మ ట్రావెల్ గైడ్. ఆమెకు చాలా భాషల్లో పట్టుందని పెడెర్సన్ చెబుతున్నాడు. నాన్న టెక్స్‌టైల్ ఇండస్ట్రీలో పని చేస్తాడు. ఇక పెడెర్సన్ విషయానికి వస్తే.. డానిష్ ఆర్మీ తరపున రాయల్ లైఫ్‌గార్డ్‌గా సేవలందించాడు. షిప్పింగ్, లాజిస్టిక్స్ ఇండస్ట్రీలలో 12 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు. ఆ ఉద్యోగ నిర్వహణలో లిబియా, బంగ్లాదేశ్, కజకిస్తాన్, అజర్ బైజాన్, గ్రీన్‌లాండ్, ఫ్లోరిడా దేశాల్లో పర్యటించాడు.గ్లోబ్‌ను ఏడుసార్లు చుట్టేశాడు.పెడెర్సన్ ఈ ఆరున్నర సంవత్సరాల జర్నీలో మొత్తంగా 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాడు. అంటే భూమిని ఏడు సార్లు చుట్టేశాడన్నమాట.

హాంకాంగ్ తర్వాత …

హాంకాంగ్ తర్వాత … పాలౌ, వనౌతు, టోంగా, సమోవా, తువాలు, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, చుట్టేసి… ఫేర్ వెల్ పార్టీకి.. ‘మాల్దివ్స్’ ను ఎంచుకున్నాడు. అంతేకాదు మాల్దివుల్లో తన ఫియాన్సీతో పాటు గ్లోబ్ ట్రోటర్స్‌తో పార్టీ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు. ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టేసిన యంగెస్ట్ పర్సన్ లెక్సి ఆల్ ఫోర్డ్, ప్రపంచ దేశాలను రెండుసార్లు తిరిగి వచ్చిన గున్నార్ గర్పోర్స్ ఆ జాబితాలో ఉన్నారు. గ్లోబ్ ట్రోటర్స్ అంటే.. ప్రపంచాన్ని చుట్టేసివాళ్లని అర్థం. అంతేకాదు కరోనా నుంచి బయటపడ్డాక న్యూజిలాండ్‌లో తన ఫియాన్సిని పెళ్లి చేసుకోబోతున్నాడు పెడెర్సన్.

Tags: Corona virus, lockdown, pedersen,visit, traveller, 203 contries, Hong Kong, Covid-19


Next Story

Most Viewed