వికారాబాద్ ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో చోటు..?

by  |
anand-vikarabad-mla
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తెలంగాణ మంత్రి వర్గంలో ఇద్దరికి చోటు దక్కగా అందులో ఒకరిని తొలగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదేవిధంగా ఇదే ఉమ్మడి జిల్లా నుంచి మరోకరికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్, కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తీర్ణం జరిగితే తమకు అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్‌కు అర్జీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇదే జిల్లా నుంచి సబితా ఇంద్రారెడ్డి ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తుండగా.. కేబినెట్‌లో చోటు కల్పించాలని అర్జీ పెట్టుకున్న నేతలకు అవకాశం లేదని స్పష్టమవుతోంది. కానీ, వికారాబాద్ జిల్లా నుంచి ఒకరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

కారణం అన్ని రంగాల్లో వెనుకబడిన వికారాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని టీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుంచి ఒకరికి మంత్రి వర్గంలో అవకాశం కల్పించేదనే అపవాదు కూడా ఉంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తాండూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన మహేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అయితే, ఈ సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలైన మహేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ పదివితోనే సరిపెట్టారు. తిరిగి మహేందర్ రెడ్డికి మంత్రి పదవి అప్పగించే అవకాశం లేదని స్పష్టమైంది.మహేందర్ రెడ్డి కుటుంబం నుంచి తమ్ముడు కొడంగల్ ఎమ్మెల్యే, భార్య జిల్లా పరిషత్ చైర్ పర్సన్, అన్న కొడుకు షాబాద్ మండలం జడ్పీటీసీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇవన్నీ చూసుకుంటే మహేందర్ రెడ్డికి మరోసారి కేబినెట్‌లో చోటు దక్కే చాన్స్ లేదని ప్రచారం సాగుతోంది.

వికారాబాద్ ఎమ్మెల్యేకే అవకాశం..?

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భాగమైన వికారాబాద్ ప్రాంతం నుంచి తప్పకుండా ఒకరికి మంత్రి వర్గంలో అవకాశం దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణ జరిగితే సబితా ఇంద్రారెడ్డి అలాగే కొనసాగనుంది. కానీ, మల్లారెడ్డిని మంత్రివర్గం నుంచి తొలిగిస్తే వికారాబాద్ జిల్లాలోని ఒక ఎమ్మెల్యేకు అవకాశం ఉండనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వికారాబాద్ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రులు చంద్రశేఖర్, ప్రసాద్‌‌లకు ఎస్సీ సామాజీక వర్గం నుంచి అవకాశం కల్పించారు. ఇప్పుడు ఒకవేళ అవకాశం కల్పిస్తే వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మొదటిసారి గెలిచిన వ్యక్తులే కావడంతో సామాజిక సమీకరణలతో మంత్రి పదవికి ఎంపిక చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆనంద్ అత్యంత సన్నిహితుడు కావడంతో మంత్రి పదవి దక్కే చాన్స్ లేకపోలేదు. ఆనంద్‌కు ప్రజా సమస్యలపై అవగాహన, వృత్తి రీత్యా వైద్యుడు కావడంతో పాటు ఎస్సీ సామాజిక వర్గం అంశాలు కలిసిరానున్నాయి.

వచ్చే వారంలో స్పష్టత..

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇద్దరిలో ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంది. వచ్చే వారంలోనే ముహూర్తం ఫిక్సయిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లాలోని ఏ ఎమ్మెల్యేకు ప్రాధాన్యత పెరుగుతుందో వారికే మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కుతుందని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వారి వారి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.

Next Story