మే‘ఘన’..కీర్తి ‘ఆమె’ సొంతం..

by  |
మే‘ఘన’..కీర్తి ‘ఆమె’ సొంతం..
X

దిశ, కరీంనగర్:

  • సచ్చియన్ మోహబ్బతాన్ వే..
    ఓ మాహి కితే హోర్ నైయో మిల్నా.. (పంజాబీ)
  • పళ్లివాళ్ల భద్రావటకం కయ్యిలెన్టుం తంపురట్టి
    నల్లచ్చంటే తిరుముమ్పి చెన్నూకాలి కాళీ
    తుడంగి… (మళయాళం)
  • సత్యం శివం సుందరం..సత్యం శివం సుందరం…
    (హిందీ)
  • మూచే కా తుల మారుదం పోల మామా వ మార్ బోడు పాంజీక్కో కొంజం సాంజిక్కో
    (తమిళ్)
  • రత్న గర్భ గణపతిమ్.. (సంస్కృతం)
  • ఎందరో మహానుభావులు (తెలుగు)

పైన పేర్కొన్న పాటలు మచ్చుకు మాత్రమే. పట్టుమని 19 ఏళ్లున్న ఆ యువతి 6 భాషల్లో అటువంటి పాటలు మరెన్నో అనర్గళంగా పాటలు పాడి అలరిస్తున్నారు. సాహితీ ప్రపంచంలోనే కాదు యుద్ధ కళలోనూ ఆరితేరారు. పుష్కర కాలంగా శిక్షణ పొందుతున్నా వాటిపై పూర్తి స్థాయి పట్టు సాధించాలన్న తపనతో నిత్య విద్యార్థినిగా మారిపోయారు. సుశిక్షుతురాలిని కావాలంటే నిత్య‌సాధన అవసరమే కదా అంటున్నారు సుకృతి మేఘమాల. సంగీతం, గాత్రం, కవిత్వం, జానపదం, కరాటే, యోగా, స్విమ్మింగ్ వీటన్నింటిని మించి అకాడమీ చదువు అన్నింటా తన ప్రతిభ చూపుతున్నారు. కరీంనగర్ భగత్ నగర్‌కు చెందిన శ్రీవత్స సంపత్ కుమార్, నిర్మాలాదేవీల తనయ సుకృతి మేఘమాల. ఆరు భాషల్లో అవలీలగా పాటలు పాడటం ఆమెకు
వెన్నతో పెట్టిన విద్య.

తల్లి ప్రోత్సాహం..

శాస్త్రీయ కళలను అలవర్చుకోవాలన్నది తల్లి నిర్మలాదేవి సంకల్పం. ఆ మేరకు కరీంనగర్‌కు చెందిన కె.బి.శర్మ వద్ద మేఘన ఓనమాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత నరహరి వద్ద కొంతకాలం ట్రైన్ అయ్యారు. సండ్ర సురేష్ వద్ద కూడా కొంతకాలం ట్రైన్ అయిన మేఘమాల కర్నాటక సంగీతంలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ద్వితీయ స్థానంలో నిలిచారు. అనంతపూర్‌కు చెందిన సంగీత విద్వాంసులు సతీష్ వద్ద స్కైప్‌లో కొంతకాలం విద్యనభ్యసించి ఇప్పుడు హైదరాబాద్‌కు చెందిన మేడూరి చంద్రిక వద్ద స్కైప్ ద్వారానే డిప్లోమా కోర్సు చేస్తున్నారు. డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్న మేఘమాల 98 శాతం మెరిట్‌తో అకాడమిక్ విద్యలోనూ రాణిస్తున్నారు. శాస్త్రీయ కళపై ఉన్న మక్కువతో వాటిని నేర్చుకుంటూనే పలు ప్రదర్శనలు కూడా ఇచ్చిన మేఘమాల జానపదంలోనూ తన గాత్రాన్ని వినిపించారు. ‘ఒక్కసారి నిన్ను చూసి వందయేళ్లు బతకనా ఓ బావ నీ తోడు నాకే ఉంటే’ అనే పాటను జానపదబాణీలో పాడి అలరించారు. ఫేమస్ సింగర్ మంగ్లీతో కలిసి పాటలు పాడారు. 10 అల్బమ్స్‌లోనూ
పాటలు పాడిన మేఘన త్యాగరాజ పంచరత్న కీర్తనలు అలవోకగా ఆలపిస్తారు.

400కు పైగా ప్రదర్శనలు..

చిరుప్రాయం నుంచే కళల్లో శిక్షణ పొందుతున్న మేఘన గత ఆరేళ్లుగా దక్షిణ కాశీగా భాసిల్లుతున్న వేములవాడ రాజన్న ఆలయంలో నిర్వహించే త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. దశాబ్ద కాలంగా కరీంనగర్‌లో జరిగే సహస్ర గళార్చనలో తన గాత్రంతో అలరిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ ప్రదర్శనలు ఇచ్చిన మేఘన బాసర సరస్వతి దేవి, యాదాద్రి లక్షీ నరసింహస్వామి, భద్రాచలం సీతా రామ చంద్రస్వామి, కాశీ, ధర్మపురి, కొండగట్టు, షిరిడీ ఆలయాలతో పాటు వివిధ చోట్ల 400కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. కరీంనగర్‌లో నిర్వహించిన రైతు సమన్వయ సమితుల ఆవిర్భావ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పాట పాడారు. శృంగేరి పీఠాధిపతి జగద్గురువు విధుశేఖర భారతి స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి, నేపథ్య గాయని సుశీల, సామవేదం షణ్ముఖ శర్మ, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, పురాణం మహేశ్వరశర్మ, త్రిదండి చిన్న జీయర్ స్వామి, త్రిదండి రామానుజ రామచంద్ర జీయర్ స్వామి, సద్గురు శివానంద మూర్తి, టీటీడీ ఆస్థాన గాయకులు శ్రీమతి శోభారాజు, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌యోగి, రాందేవ్ జీ బాబా, స్వామి సురేశ్వరానంద, గురు భవాని లక్ష్మీనారాయణ వంటి వారితో పాటు సినీ రచయిత భారవి, దర్శకుడు కుడికొండ యాదగిరిల ప్రశంసలు అందుకున్నారు. మంత్రి గంగుల, ఎంపీ బండి సంజయ్‌తో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మెప్పు కూడా పొందారు. కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్, భారత్ వరల్డ్ రికార్డ్, ట్రెడిషనల్ బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, బాలరత్న అవార్డులు కూడా అందుకున్నారు. విభిన్నమైన కళలపై పట్టు సాధించడం మేఘనకు మాత్రమే చెల్లింది. చిరుప్రాయంలోనే తండ్రి సంపత్ కుమార్ వద్ద యుద్ధ కళ కరాటే కూడా నేర్చుకున్నారు. యోగా, స్విమ్మింగ్‌‌ల్లో కూడా ఆరితేరారు. కరాటే, యోగా, స్విమ్మింగ్‌లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో కూడా పాల్గొని తన ప్రతిభను ప్రదర్శించారు.

ఐఏఎస్ నా లక్ష్యం..

కళలపై పట్టు సాధిస్తూనే ఐఏఎస్ కావాలని ఉంది. శాస్త్రీయ, జానపదాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చినప్పటికీ టీటీడీలో ఇచ్చిన చేసిన ప్రోగ్రాం మధురానుభూతిని పంచింది. మహానుభావుల ముందు నాలోని కళను ప్రదర్శించే అవకాశం చిన్న వయసులోనే రావడం ఆనందంగా ఉంది. ఇంకా కళలపై ప్రావిణ్యం సాధించాల్సి ఉంది. రెగ్యూలర్ ఎడ్యుకేషన్‌తో పాటు కళలపై కూడా మరింత పట్టు సాధించే దిశగా ముందుకు సాగుతా.

– సుకృతి మేఘమాల

Tags: versatile expert, meghana, want to become, IAS, Arts, yoga, fights, congratulated by many people



Next Story