బండి సంజయ్.. పాదయాత్ర ఎందుకు చేస్తున్నావ్..? మంత్రి సూటి ప్రశ్న

by  |
బండి సంజయ్.. పాదయాత్ర ఎందుకు చేస్తున్నావ్..? మంత్రి సూటి ప్రశ్న
X

దిశ, కామారెడ్డి: తెలంగాణలో ఏం తక్కువైందని పాదయాత్ర చేస్తావ్? అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. గాంధారి మండల కేంద్రంలో రూ.9.20 కోట్లతో చేపట్టబోయే రహదారి వెడల్పు, సెంట్రల్ లైటింగ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ చీఫ్ బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలపై హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ రాకముందు, కేసీఆర్ వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉందో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారన్నారు. ‘బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలంగాణలో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఆయన పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు..? గత ఆరు నెలల క్రితం నుండి తెలంగాణలో రెండు వేల పింఛన్ ఇస్తున్నాము. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రెండువేల పింఛన్ ఇస్తున్నట్టు చూపిస్తే నేను రాజీనామా చేస్తా, లేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా అని మంత్రి సవాల్ విసిరారు.

‘ఎల్లారెడ్డిలో నేను బండి సంజయ్‌కి సవాల్ విసిరినా… ఆరు నెలలవుతున్నా చప్పుడు లేదు. ఇప్పుడు పాదయాత్ర చేస్తా అంటున్నారు. నువ్వు మొగోనివి అయితే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఆడబిడ్డకు లక్ష రూపాయల కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఏడాదికి రూ.10 వేల రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్ మీ రాష్ట్రాల్లో చూపించి పాదయాత్ర చేయాలి. వాళ్ళు మీ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రజలు నిలదీయాలి’ అని ప్రజలకు సూచించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. ‘నిన్న మొన్న పదవి వచ్చినోడు కేసీఆర్ నుంచి ఇక గుంజుకునుడే అని మాట్లాడుతుండు. కేసీఆర్ దగ్గరి నుంచి ఏం గుంజుకుంటావ్. ప్రజలు ఓట్లేస్తే, ప్రజలు మమకారం, మెప్పుతో వచ్చిన పదవులు మావి. వాటిని గుంజుకుంటావా.. నీతో అయ్యే పనేనా.. గతంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు డబ్బులిచ్చి గుంజుకోవడం అలవాటే కదా నీకు. ఓటుకు నోటు కనుక్కోవడం తెలుసు కదా నీకు. ఇప్పుడు ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది కదా. అందుకే గుంజుకునే ఆలోచన మళ్ళీ వస్తుంది’ అంటూ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.

‘ఏనుగు పోతుంటే కుక్కలు చాలా మొరుగుతాయని, కేసీఆర్ ఏనుగు లాంటి వారన్నారు. ఎన్ని కుక్కలు మోరిగినా ఏది కూడా ఆపేది లేదని స్పష్టం చేశారు. మా నాయకులు ఎమ్మెల్యే సురేందర్‌ను ఒకరు ఆగం చేస్తున్నాడు అని చెప్పారని ఇటీవల బీజేపీలో చేరిన ఏనుగు రవీందర్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఎమ్మెల్యే సురేందర్‌కు మేము ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. ఆగం చేస్తామంటే ఉరుకుంటామా అని తెలిపారు. ఇటువంటివి చాలా చూశామని పేర్కొన్నారు. ఎగేసుకుని ప్రత్యేక ఫ్లైట్ లో వెళ్లారు కదా. ఎవరి సమక్షంలో చేరారని ప్రశ్నించారు.

Next Story

Most Viewed