Covid 19: బలాదూర్ బాబులు బహుపరాక్.. బయటకు వస్తే…

by  |
Covid 19: బలాదూర్ బాబులు బహుపరాక్.. బయటకు వస్తే…
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ప్రాణాలతో చెలగాటమాడుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌లో బలాదూర్ గా తిరుగుతున్న వారిపై కన్నెర్ర చేయనున్నారు కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు. అవసరం లేకున్నా రోడ్లపై తిరుగుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక నుండి అత్యవసర పనులు మినహా పనిపాట లేకుండా రోడ్లపై తిరిగే వారిని క్వారంటైన్‌కు తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని కరీంనగర్ సీపీ విబి కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు. లాక్‌డౌన్ సమయంలో తనిఖీల్లో అకారణంగా తిరుగుతూ కుంటిసాకులకు చెప్పి తప్పించుకునే వారిపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్టు కేసు నమోదు చేసి, వాహనాన్ని కూడా సీజ్ చేయడంతో పాటు క్వారంటైన్ కు తరలించేందుకు రంగం సిద్దం చేశామని సీపీ వెల్లడించారు. క్వారంటైన్ సెంటర్లకు తరలించి వారికి కొవిడ్ టెస్ట్ చేయించి పాజిటివ్ అని తేలితే నెగిటివ్ వచ్చే వరకూ అక్కడే ఉంచుతామని సీపీ తెలిపారు.

ఆ తరువాత డాక్టర్లు, సైకలాజిస్టులతో కౌన్సిలింగ్ నిర్వహించి ఇంటికి పంపించనున్నామని అయితే వారి వాహనం మాత్రం కోర్టులోనే డిపాజిట్ చేస్తాని సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు కేసులు, బైకుల సీజింగ్ తోనే సరిపెడుతున్నారని భావించి బయట తిరిగేవారు ఇక నుండి కొవిడ్ క్వారంటైన్ సెంటర్లలో కాలం వెల్లదీసే బంపర్ బొనాంజాను కరీంనగర్ సీపీ ప్రకటించారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కరీంనగర్ పోలీసులు మరో ఆఫర్ కూడా ఇచ్చిన విషయం బలదూర్ బాబులు గమనించాల్సిన అవసరం ఉంది. క్వారంటైన్ సెంటర్లకు తరలించిన ఆకతాయిలకు నెగిటివ్ అని నిర్దారణ అయ్యే వరకూ అక్కడే కాలం వెల్లదీయాల్సి ఉంటుంది. కాబట్టి రోడ్డపై ఇష్టం వచ్చినట్టు తిరగడం మానితే బెటరేమో మరి.


Next Story

Most Viewed