వంటలక్క దసరా డబుల్ ధమాకా

85

దిశ, వెబ్‌డెస్క్ :

కార్తీకదీపం సీరియల్ హవా గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బడా స్టార్ బ్లాక్‌బస్టర్ సినిమా టెలీకాస్ట్ అవుతున్నా సరే.. ‘కార్తీకదీపం’ సీరియల్‌ చూసిన తర్వాతే చానల్ మారుతుంది. కాదని ఎవరన్నా చానల్ మార్చారో.. ఇక ఇల్లు రణరంగమే. ఒక్కమాటలో చెప్పాలంటే.. కార్తీక దీపం సీరియల్ ప్రసారమయ్యే సమయంలో ఐపీఎల్ టెలికాస్ట్ అవుతుండటంతో.. ఏకంగా మ్యాచ్‌ల టైమింగ్స్ మార్చాలంటూ అభిమానులు కోరుకున్నారంటే.. ఆ సీరియల్ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. సినిమాలకు, క్రికెట్‌కు మించిన ఆదరణతో దూసుకుపోతున్న ఈ సీరియల్‌లో ‘వంటలక్క’ పాత్రే ప్రత్యేక ఆకర్షణ. తెలుగు బుల్లితెరపై ఇంతగా ప్రేక్షకాభిమానం పొందుతున్న ఈ సీరియల్ ప్రధాన పాత్రధారి ప్రేమి విశ్వనాథ్ ఇంతవరకు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. కానీ తొలిసారిగా ప్రముఖ యాంకర్ సుమ.. వంటలక్కను తెరపైకి తీసుకొచ్చింది. అంతేకాదు వంటలక్క తన అభిమానులకు దసరా కానుకగా డబుల్ ధమాకా ఇవ్వనుంది. మరో షోలో కూడా దీప తన విశ్వరూపాన్ని చూపించబోతుంది.

కేరళలో పుట్టిపెరిగిన ప్రేమి విశ్వనాథ్‌.. తెలుగు వారి గుండెల్లో వంటలక్కగా చెరగని స్థానాన్ని దక్కించుకుంది. ఇక దసరా పండుగ సందర్భంగా ఆమె తొలిసారిగా తెలుగు అభిమానులతో తన మనసులోని భావాలను పంచుకోనుంది. ప్రేమి, సుమలు బుల్లితెరపై సందడి చేయనున్నారు. సుమ అంటేనే.. పంచ్‌లకు ప్రసిద్ధి. ఆమె సెన్సాఫ్ హ్యుమర్ ముందు పెద్ద పెద్ద స్టార్లే.. తమను వదిలిపెట్టమని అంటుంటారు. అలాంటి సుమకే.. ప్రేమి పంచులు వేసింది. తొలిసారిగా తన వాయిస్‌ను తెలుగు వారికి వినిపించింది. ‘తెలుగు వారింట్లో నీ వల్ల గొడవలు అవుతున్నాయి.. భార్యలేమో కార్తీకదీపం అంటున్నారు.. భర్తలేమో ఐపీఎల్ అంటున్నారు’ అని సుమ ప్రశ్నించింది. భార్య మాటలే వినాలని ప్రేమి విశ్వనాథ్ ఆన్సర్ ఇచ్చి నవ్వులు పూయించింది. ‘అవును.. ఇంత వరకు ఎందుకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు’ అని సుమ అడిగితే.. ‘సరైన వేదిక, సరైన యాంకర్ దొరకలేదు’ అంటూనే మనం మలయాళీలం కదా అంటూ సుమక్కకు పంచ్ వేసింది ప్రేమి. ప్రోమోలోనే దీప ఇన్ని పంచులు వేస్తే… మరి ఫుల్ ఇంటర్వ్యూలో మరెన్ని పంచులు వేసిందో వేచి చూడాలి.

అయితే ఈ దసరా సందర్భంగా.. ‘స్టార్ మా’లో ‘జాతరో జాతర’ అనే స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తుండగా.. అందులో వంటలక్క కాళిక అవతారంలో నాట్యమాడుతూ.. శివాలెత్తిపోతోంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను దీప.. తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఈ ప్రోమో బిగ్ బాస్ కంటెస్టెంట్ శివజ్యోతి వాయిస్ ఓవర్‌తో ప్రారంభం అవుతుంది. ‘జాతర అయ్యేంత వరకూ మాతోనే ఉంటానని నాకు మాటివ్వు’ అని శివజ్యోతి అమ్మవారి అవతారంలో ఉన్న వంటలక్క దగ్గర మాట తీసుకుంటుంది. ఇక చివర్లో ‘ఈ విజయదశమి పండుగ రోజు నేను మీ ఇంటికి వస్తున్నాను’ అంటూ ప్రేమి చెప్పడంతో.. అభిమానులు సంతోషిస్తున్నారు.

వంటలక్కకు సంబంధించిన ఈ రెండు కార్యక్రమాల ప్రోమోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.