రేపు దేశవ్యాప్త డ్రై రన్

by  |
రేపు దేశవ్యాప్త డ్రై రన్
X

న్యూఢిల్లీ : రేపు దేశవ్యాప్తంగా డ్రై రన్ నిర్వహించడానికి కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు సంసిద్ధమయ్యాయి. వ్యాక్సినేషన్ ప్రణాళిక, క్షేత్రస్థాయిలో దాని అమలుకు సవాళ్లు, అవాంతరాలు గుర్తించి అధిగమించే లక్ష్యంతో ఈ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. టీకా స్టోరేజీ మొదలు, టీకా వేయడం, కొవిన్ అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేయడం, పరిశీలించడం, టీకా వేసే కేంద్రంలో కరోనా నిబంధనల అమలు, ఇతర అన్ని అంశాలను పరిశీలిస్తారు. డ్రై రన్ నిర్వహణకు సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఎన్నికల తరహాలోనే డ్రై రన్ సాగుతుందని, టీకా పొందే హెల్త్ వర్కర్ల జాబితాను కొవిన్ ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేసి డమ్మీ వ్యాక్సిన్‌తో ట్రయల్ నిర్వహిస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. గతనెల 28, 29న నాలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, అసోం, పంజాబ్‌లలో విజయవంతంగా డ్రై రన్ నిర్వహించారు. తాజాగా, అన్ని రాష్ట్రాల్లో ఈ ట్రయల్ నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్ర రాజధాని నగరాల్లో కనీసం మూడు చోట్ల ఈ ట్రయల్ రన్ సాగనుంది. ఇతర నగరాల్లోనూ నిర్వహించనున్నారు. డ్రై రన్ నిర్వహించడానికి మూడు గదులను ఏర్పాటు చేయనున్నారు. హెల్త్ కేర్ వర్కర్లు టీకా కోసం ఎదురు చూసే గది, టీకా వేసుకునే గది, టీకా వేసుకున్నాక కొద్దికాలం పరిశీలించడానికి మరో గదిని ప్రభుత్వాలు ఏర్పాటు చేయనున్నాయి. మహారాష్ట్రలో పూణె, నాగపూర్, జాల్నా, నందర్బర్‌, జార్ఖండ్‌లో రాంచీ, తూర్పు సింగభం, ఛత్రా, పలాము, పాకుర్, కర్ణాటకలో బెంగళూరు అర్బన్, బెలగావి, కాలబురాగి, మైసూరు, శివమొగ్గ, తమిళనాడులో చెన్నై, నిలగిరీస్, తిరునెల్వేలి, తిరువల్లూర్, కోయంబత్తూర్‌‌లలో డ్రై రన్ నిర్వహించనున్నాయి.

Next Story

Most Viewed