వరి వేసుకోండి.. వద్దంటే ఉద్యమాలు చేస్తాం :ఎంపీ ఉత్తమ్

by  |
Utham kumar
X

దిశ, నల్లగొండ: ఖరీఫ్​ సీజన్​ రైతులు వరివేసుకోవాలని, వద్దంటే తాము ఉద్యమాలు చేయడానికైనా సిద్ధమని నల్లగొండ ఎంపీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు నల్లమోతు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్లగొండ ఎస్సీల్బీసీలోని బత్తాయి మార్కెట్ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. ధాన్యం విక్రయించడానికి రైతులు 16 రోజుల క్రితం ధాన్యం తీసుకొచ్చినా ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం చేసే వారిలో అత్యధికంగా వరి రైతులు ఉన్నారని, ధాన్యం కొనుగోలు చేయడంలో సీఎం కేసీఆర్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు.

కొనుగోళ్ల పై కేంద్రం స్పష్టమైన నోటిఫికేషన్ ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రాజెక్టులపై, కమిషన్లపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు. రైతులు తీసుకొచ్చిన ప్రతి గింజను క్వింటాలుకు రూ.1960 మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తాము ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడతామని ఎవరూ అధైర్యపడొద్దని భరోసానిచ్చారు. పంటబీమా పథకం దేశ వ్యాప్తంగా ఉందని, కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే లేదని విమర్శించారు. రుణమాఫీ, క్రాఫ్ ఇన్సూరెన్స్ అమలే చేయడంలేదని, రెండు లక్షల కోట్ల బడ్జెట్ ను ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెట్టడం సరికాదని అన్నారు.

Next Story

Most Viewed