యాక్టివిస్ట్ అంజలికి అమెరికా ప్రతిష్టాత్మక అవార్డ్

by  |
యాక్టివిస్ట్ అంజలికి అమెరికా ప్రతిష్టాత్మక అవార్డ్
X

దిశ, ఫీచర్స్ : అంతర్జాతీయ అవినీతి నిరోధక చాంపియన్స్‌ అవార్డుకు భారత మహిళ, ఉద్యమకారిణి, సామాజికవేత్త అంజలి భరద్వాజ్‌ ఎంపికయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని గుర్తించి, ప్రోత్సహించేందుకు బైడెన్‌ ప్రభుత్వం కొత్తగా ఈ అవార్డును ప్రవేశపెట్టగా, ఇందు కోసం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12 మందిని ఎంపిక చేశారు. వీరిలో భారత్‌కు చెందిన అంజలి భరద్వాజ్‌ ఒకరిగా నిలిచారు.

భారత్‌లో సమాచార హక్కు ఉద్యమంపై గత రెండు దశాబ్దాలుగా పోరాడుతున్న అంజలి.. ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు, ప్రజలను అందులో భాగస్వాములను చేసేందుకు ‘సతర్క్‌ నాగరిక్‌ సంఘటన్‌ (NNS)’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ మేరకు అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిని బహిర్గతం చేస్తున్న వ్యక్తులకు రక్షణ కల్పిస్తున్నారు. అవినీతి నిరోధక న్యాయవాదిగా, విజిల్‌ బ్లోయర్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ ఏర్పాటుకు ఆమె కృషి చేయడంతో పాటు ‘నేషనల్‌ క్యాంపెయిన్‌ ఫర్‌ పీపుల్స్‌ రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌’కు (ఎన్‌సీపీఆర్‌ఐ) కన్వీనర్‌గా ఉన్నారు. కాగా ‘ఎన్‌సీపీఆర్‌ఐ’ పోరాటం ఫలితంగానే అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్‌ ఏర్పాటైంది. అలాగే ప్రజావేగు రక్షణ చట్టం రూపుదిద్దుకుంది. కాగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో వ్యవస్థల్ని దారిలో పెట్టడానికి, అవినీతి వ్యతిరేక పోరాటంలో వ్యక్తిగతంగా భాగస్వాములవుతూ అలుపెరగని కృషి చేసిన వారికి తగిన గుర్తింపు ఇవ్వడానికే ఈ అవార్డును ప్రవేశపెట్టినట్టు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి టోని బ్లింకెన్‌ చెప్పారు

ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లేడీ శ్రీ రామ్ కాలేజీ నుండి బీఏ చేసిన అంజలి.. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సీ డిగ్రీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు.


Next Story