2019 సివిల్స్ ఫలితాలు విడుదల

by  |
2019 సివిల్స్ ఫలితాలు విడుదల
X

న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో హర్యానా సోనిపట్‌కు చెందిన ప్రదీప్ సింగ్ టాప్ ర్యాంక్ సాధించారు. రెండో స్థానంలో జతిన్ కిశోర్ నిలవగా, మహిళా టాపర్‌గా మూడో ర్యాంకులో ప్రతిభ వర్మ నిలిచారు. యూపీఎస్‌సీ గతేడాది సెప్టెంబర్‌లో రాతపరీక్షలు నిర్వహించగా, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు పర్సనాలిటీ ఇంటర్వ్యూలు తీసుకుంది. ఈ పరీక్షల్లో మొత్తం 829 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. కాగా, 11 మంది ఫలితాలను యూపీఎస్‌సీ ఇంకా ప్రకటించలేదు. తొలిసారిగా ఈ ఫలితాల మదింపులో ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేశారు. కాగా, జనరల్ కేటగిరీ నుంచి అత్యధికంగా 304 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఈడబ్ల్యూఎస్ నుంచి 78 మంది, ఓబీసీ నుంచి 251 మంది, ఎస్‌సీ నుంచి 129 మంది, ఎస్‌టీ నుంచి 67 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ప్రస్తుతమున్న ఖాళీలను ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. మొత్తం సివిల్ సర్వీసుల్లో ప్రస్తుతం 927 ఖాళీలున్నాయి. అయితే, 829 మందిని వివిధ పోస్టులకు సిఫారసు చేశారు. ఇందులో 180 మంది అభ్యర్థులు ఐఏఎస్‌లుగా, 150 మంది ఐపీఎస్‌లుగా, 24 మంది ఐఎఫ్ఎస్‌లుగా నియామకం కానున్నారు. ఆన్‌లైన్‌లో ఫలితాలు ప్రకటించిన పిదప 15 రోజుల్లో అధికారిక వెబ్‌సైట్‌లో మార్కులు అందుబాటులో ఉంచనున్నట్టు కమిషన్ ఇదివరకు ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సారి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ 2020 మే 31న జరగాల్సి ఉండగా కరోనా కారణంగా అక్టోబర్ 4కు వాయిదా వేశారు.

సెల్ఫ్ స్టడీతో ర్యాంక్ కొట్టాను: ప్రదీప్ సింగ్

సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2019 టాప్ ర్యాంకర్ ప్రదీప్ సింగ్ సెల్ఫ్ స్టడీతోనే టాపర్‌గా నిలిచినట్టు వెల్లడించారు. హర్యానా సొనిపట్ జిల్లా తెవరి గ్రామస్తుడైన ప్రదీప్ సింగ్ తొలుత స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కోసం కోచింగ్ తీసుకున్నారు. ఐదేళ్ల క్రితమే ఢిల్లీలో ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌ ఉద్యోగాన్ని సాధించారు. కానీ, సర్పంచ్‌లుగా కొనసాగిన తాత, తండ్రి ప్రోత్సాహించడంతో సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. తాను నాలుగుసార్లు సివిల్స్‌ పరీక్షలు రాసినట్టు ప్రదీప్ సింగ్ తెలిపారు. గతేడాది తాను 260వ ర్యాంక్ సాధించారని, దీంతో ఫరీదాబాద్‌లో ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్‌(ఐఆర్ఎస్)గా అపాయింట్ చేశారని వివరించారు. ప్రస్తుతం ఐఆర్ఎస్ ట్రైనింగ్‌లో ఉన్న ప్రదీప్ సింగ్ సివిల్స్‌లో టాపర్‌గా నిలిచారు.

Next Story

Most Viewed