దుబ్బాక ఎన్నికల బరిలో నిరుద్యోగులు

by  |
దుబ్బాక ఎన్నికల బరిలో నిరుద్యోగులు
X

దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక ఉప ఎన్నికల బరిలో నిరుద్యోగులు నిల్చుంటున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైనా ఆశించిన స్థాయిలో ఉద్యోగులు రాలేదని టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరుద్యోగ యువకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తొలిరోజు మొత్తం ఆరు నామినేషన్లు దాఖలు కాగా, అందులో ఐదుగురు యువకులవే ఉన్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు సాధనకు భారీగా బరిలో నిల్చున్న రైతులనే ఇక్కడ స్ఫూర్తిగా తీసుకొని యువత పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగ యువత నుంచి మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. దీన్ని ఆసరాగా చేసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎదురుతిరిగేందుకు నిరుద్యోగ యువత సన్నద్ధమైంది. రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఇంటికో ఉద్యోగమన్న కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిండు శాసనసభలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని రెండో సారి అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్నా ఇంకా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయకపోవడం, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ ప్రక్రియ చేపట్టకపోవడంపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. సుమారు 1200 మంది విద్యార్థుల బలిదానాల మీద ఏర్పాటైన తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమ గోడును పలుమార్లు వివిధ రూపాల్లో విన్నవించినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని వారు వాపోతున్నారు. అయితే ప్రస్తుతం దుబ్బాక ఎన్నికల ద్వారా తమ నిరసన గళాన్ని వినిపించేందుకు భారీ ఎత్తున నామినేషన్ దాఖలు చేయాలని యువత భావిస్తున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల ప్రక్రియ మొదలైన మొదటి రోజు మొత్తం ఆరుగురు నామినేషన్లు దాఖలు చేస్తే అందులో ఐదుగురు నిరుద్యోగ యువకులు ఉన్నారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఎక్కువ మంది సీఎం కేసీఆర్ సెంటిమెంట్ జిల్లా అయిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. ఈ నెల 16వరకు నామినేషన్లను దాఖలు చేయడానికి అవకాశం ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత నుండి భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది.

నిజామాబాబాద్ ఎన్నికలే స్ఫూర్తి..?

పసుపు బోర్డు ఏర్పాటుపై పాలకుల ధోరణిని నిరసిస్తూ పార్లమెంట్ ఎన్నిక సమయంలో నిజామాబాద్ ఎంపీ స్థానానికి 170 మందికి పైగా రైతులు నామినేషన్లు దఖాలు చేశారు. ఫలితంగా వారి డిమాండ్ ఎంతోకొంత నెరవేర్చుకోగలిగారు. ఈ నేపథ్యంలో వారినే స్ఫూర్తిగా తీసుకొని దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీకి నిరుద్యోగ యువత సై అంటున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ అధికార పార్టీకి పెద్ద సవాల్‌గా మారుతున్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం దృష్టి దుబ్బాకపైనే ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ నియోజకవర్గ రాజకీయం రసవత్తరకంగా మారుతోంది.

భారీగా నామినేషన్ వేయాలి

రాష్ట్రంలో అన్ని శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పోస్టును కూడా భర్తీ చేయడం లేదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో మొదటి రోజు ఐదుగురు నిరుద్యోగులు నామినేషన్ దాఖలు చేయడం సంతోషంగా ఉంది. ఇంకా పెద్ద ఎత్తున నిరుద్యోగులు ముందుకొచ్చి భారీగా నామినేషన్లు వేయాల. ప్రభుత్వానికి మా నిరసన ఏంటో తెలియజేస్తాం.

– మనోజ్, నిరుద్యోగి, సిద్దిపేట జిల్లా

దుబ్బాక ఉప పోరుకు ఆరు నామినేషన్లు

దిశ, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికలకు శుక్రవారం ఆరు నామినేషన్ సెట్లు దాఖలు అయినట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. బుర్ర రవితేజ, రేవు చిన్న దన్ రాజ్, సిలివెరు శ్రీకాంత్, మోతే నరేష్, మీసాల రాజ సాగర్, కోట శ్యామ్ కుమార్‌లు స్వతంత్ర అభ్యర్థులుగా ఒక్కొక్క నామినేషన్ సెట్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో అతి కీలకమైన ఘట్టమైన నామినేషన్ ప్రక్రియ మొదటి రోజు ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. ఆరుగురు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా ఎలాంటి హడావుడి లేకుండా సాదాసీదాగా వచ్చి నామినేషన్ సెట్స్ దాఖలు చేశారు.

Next Story

Most Viewed