డేంజర్ బెల్స్.. బ్లాక్ ఫంగస్ సోకి ఇద్దరు మృతి

by  |
డేంజర్ బెల్స్.. బ్లాక్ ఫంగస్ సోకి ఇద్దరు మృతి
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : కరోనాతో అల్లాడుతున్న ఉమ్మడి పాలమూరు జిల్లాపై బ్లాక్ ఫంగస్ కోరలు చాస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని మృతుల కుటుంబీకులే స్వయంగా ప్రకటించారు. కానీ, అధికారులు మాత్రం వివరాలను నమోదు చేయలేదు.

పది రోజుల కిందే తొలి మరణం..

మహబూబ్ నగర్ జిల్లాలో బ్లాక్ వైరస్ సోకి పదిరోజుల కిందటే ఓ వ్యక్తి మరణించాడు. భూత్పూర్ మండలానికి చెందిన వ్యక్తికి మొదట్లో కరోనా పాజిటివ్ రాగా అతడిని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వారం రోజుల పాటు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందాక అతనికి బ్లాక్ ఫంగస్ సోకిందని, వెంటనే హైదరాబాద్ తీసుకువెళ్లి వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలిపారు. వెంటనే వారు రోగిని హైదరాబాద్‌కు తీసుకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించే లోపే మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్ సోకి ముఖము, కండ్లు పూర్తిగా నల్లగా తయారై మెదడుకు చేరుకోవడంతో మరణించినట్లు తెలిసింది.

రెండవ కేసు మక్తల్‌లో..

బ్లాక్ ఫంగస్‌తో శనివారం రాత్రి నారాయణపేట జిల్లా మక్తల్‌కు చెందిన వ్యక్తి మరణించాడు. కరోనా పాజిటివ్ సోకిందని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ ఉందని హైదరాబాద్ తీసుకెళ్ళమని వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులు అతడిని నగరానికి తీసుకెళ్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి వైద్య సేవలు అందిస్తుండగా శనివారం రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. మృతుని కళ్లు బ్లాక్ ఫంగస్‌తో బాగా దెబ్బతిని మెదడుకు చేరుకోవడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

వివరాలు సేకరించని అధికారులు..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతిరోజూ కరోనాతో మృతి చెందుతున్న వారి వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో బ్లాక్ ఫంగస్ సోకి ఇద్దరు వ్యక్తులు మృతి చెందినప్పటికీ ఆ వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. హైదరాబాదులో మృతి చెందడం వల్ల వివరాలను నమోదు చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సన్నద్ధం కానీ అధికారులు :

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అధికారులు, వైద్య శాఖ సిబ్బంది మొత్తం తమ దృష్టిని పూర్తిగా కరోనా వైపు సారిస్తున్నారు. బ్లాక్ ఫంగస్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న దాని నుండి ప్రజల్ని కాపాడుకునే విషయంలో ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఆ వైరస్ బారిన పడిన వారిని నేరుగా హైదరాబాద్‌కు పంపడం మినహా ఇక్కడ వైద్య సేవలు అందించే పరిస్థితులు లేవు. ఆయా జిల్లాల అధికారులు, సిబ్బంది పరిస్థితులు విషమించక ముందే తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.


Next Story

Most Viewed