తెలంగాణలో ‘పవర్’ ఫెయిల్?

by  |
తెలంగాణలో ‘పవర్’ ఫెయిల్?
X

దిశ, న్యూస్ బ్యూరో : దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. వివిధ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి కొనుగోలు చేసిన కరెంటు పైసలు కూడా సంస్థకు తిరిగి రావడం లేదు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రెవెన్యూ కన్నా సుమారు రూ.1000 కోట్లు ఎక్కువగా విద్యుత్ కొనుగోలుకే ఖర్చయింది. ఇక డిస్ట్రిబ్యూషన్‌కు అయిన మిగతా ఖర్చంతా సంస్థ నష్టాల రూపంలో కోల్పోయింది. అంటే, విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కోసమే ఏర్పడిన సంస్థ అదే డిస్ట్రిబ్యూషన్ ఖర్చును భరిస్తూ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ పంపిణీ చేస్తోందని స్పష్టమవుతోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో సంస్థకు రూ.23,899 కోట్లు ఆదాయం రాగా, విద్యుత్ కొనుగోలుకు రూ. 24,837 కోట్లు ఖర్చవడం గమనార్హం. ఇది కాక ఉద్యోగులు, నిర్వహణ వ్యయం, అప్పులకు చెల్లించాల్సిన వడ్డీ అన్నీ కలిపితే నికరంగా సంస్థ ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే సంస్థ రూ.5,279 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. అంతకముందు ఆర్థిక సంవత్సరం 2017-18లో రూ.4472 కోట్లు సంస్థకు నష్టం వచ్చింది. ఈ వివరాలను సంస్థ ఇటీవల విడుదల చేసిన 2018-19 సంవత్సర వార్షిక నివేదికలో తెలిపింది.

ఏటేటా పెరుగుతూ

సంస్థ ఆదాయ, ఖర్చుల పరిస్థితి ఇలా ఉంటే, ఇక అప్పుల పరిస్థితి రాను రాను మరింత భయానకంగా తయారవుతోంది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అప్పులు పెరుగుతూ పోతున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎస్పీడీసీఎల్ అప్పులు రూ.7,290 కోట్లుండగా, ఏడాది తిరిగే సరికి అవి రూ.2500 కోట్లు పెరిగి ఏకంగా రూ.10,094 కోట్లకు చేరుకున్నాయి. ప్రతి సంవత్సరం పంపిణీ కోసం సంస్థ కొనుగోలు చేసిన విద్యుత్ ఖర్చులే రాకపోవడం, దీనికి తోడు తప్పనిసరి భరించాల్సిన నిర్వహణ ఖర్చులతో కలిపి వేల కోట్ల రూపాయలలో నష్టం వస్తుండడంతో వాటిని పూడ్చుకోవడానికి సంస్థ భారీగా అప్పులు చేయాల్సి వస్తోంది. దీంతో సంస్థ దీర్ఘకాలిక రుణాలు గుట్టగుట్టలుగా పెరిగిపోతున్నాయి. భారీగా పెరుగుతున్న ఈ అప్పుల భారం కారణంగా 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ రూ.1296 కోట్లు వడ్డీలు చెల్లించగా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.948 కోట్లు వడ్డీ చెల్లించింది.

గృహ వినియోగదారులే లక్ష్యం

వార్షిక నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ డిస్కం పరిధిలో ఉన్న లో టెన్షన్ (ఎల్‌టీ) వినియోగదారుల సంఖ్య 82,44,739 ఉంది. వీరి నుంచి సగటున యూనిట్ విద్యుత్‌కు రూ. 3.75 సంస్థకు వసూలవుతోంది. ఎల్‌టీ క్యాటగిరీలో 61,58,298 గృహ వినియోగదారులున్నారు. వీరి నుంచి యూనిట్ విద్యుత్ కు రూ. 4.67 వసూలవుతోంది. హైటెన్షన్ (హెచ్‌టీ) క్యాటగిరీలో అన్నీ కలిపి 9,259 కనెక్షన్లే ఉన్నాయి. వీరి నుంచి యూనిట్‌కు సగటున రూ.7.81 సంస్థకు వసూలవుతోంది. దీంతో రాష్ట్రంలో ఒకవేళ విద్యుత్ చార్జీలు పెంచాల్సి వస్తే యూనిట్ విద్యుత్‌కు రూ.4.67 చెల్లిస్తున్న గృహ వినియోగదారులే టార్గెట్ అవుతారని వేరే చెప్పనవసరం లేదు.



Next Story

Most Viewed