భేష్ తెలంగాణ పోలీస్.. పక్కా స్కెచ్‌తో దొంగలకు చెక్

by  |
భేష్ తెలంగాణ పోలీస్.. పక్కా స్కెచ్‌తో దొంగలకు చెక్
X

దిశ, క్రైమ్ బ్యూరో: కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరు నగరాన్ని అడ్డాగా చేసుకుని తమిళనాడు రాష్ట్రంలోని ముత్తూట్‌లో దోపిడీకి పాల్పడిన అంతరాష్ట్ర ముఠాను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర పోలీసులకు తమిళనాడు పోలీసులు సమాచారం ఇవ్వడంతో హైదరాబాద్ నగర పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని విభాగాల పోలీసులు పోలీసులతో గాలింపు చర్యలు చేపట్టారు. దోపిడీ దారుల వద్ద ఆయుధాలు ఉన్నాయని తెలుసుకున్న పోలీసులు సాయుధ బలగాలను రంగంలోకి దించారు. రాయికల్ వద్ద గాలిస్తున్న పోలీసులకు కన్పించిన అనుమానితులను అత్యంత చాకచక్యంగా పట్టుకుని తమదైన శైలీలో విచారించి దోపిడీ ముఠా గుట్టును రట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. నిందితుల నుంచి దాదాపు 25 కేజీల బంగారం, 7 పిస్టల్స్, 10 మాగ్జైన్లు, 97 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు కృష్ణగిరి జిల్లా ఎస్పీ బండి గంగాధర్ తో కలిసి సైబరాబాద్ సీపీ సజ్జనార్ శనివారం వివరాలను వెల్లడించారు.

లుథియానాలో ఫెయిల్ కావడంతో..

మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రూప్ సింగ్, అమిత్ శుక్లా అలియాస్ వివేక్ శుక్లా స్నేహితులు. వీరిద్దరు కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేసి దొంగతనం, దోపిడీలు చేయాలని భావించారు. అనుకున్నట్టుగానే మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ మిత్రులతో కలిసి ఓ ముఠాగా ఏర్పాటు అయ్యారు. 2020 అక్టోబర్ లో పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో ముత్తూట్ ఫైనాన్స్‌ను దోపిడీకి యత్నించారు. ఆ సమయంలో స్థానిక ప్రజలు తిరగబడటంతో ఆ ప్లాన్ ఫెయిలయ్యింది. ఈ సందర్భంగా సుజీత్ సింగ్, సౌరబ్, రోషన్ సింగ్‌లు దొరకగా, వివేక్ శుక్లా, శంకర్ సింగ్‌లు పరారీలో ఉన్నారు. దీంతో మొదటి ప్లాన్ ఫెయిల్ అయ్యేసరికి.. కచ్చితంగా రెండో దోపిడీని సక్సెస్ చేయాలని భావించారు. దీంతో బెంగుళూరులో ఓ గదిని అద్దెకు తీసుకుని బెంగుళూరు, తమిళనాడు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలను పరిశీలించారు. అయితే, తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలో రెండు వైపులా రోడ్డు ఉండటం, తప్పించుకోవడానికి వీలుగా ఉన్న హోసూర్ ముత్తూట్ ఫైనాన్స్ ను దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగా శుక్రవారం ఉదయం 9.15 గంటలకు ముత్తూట్ లోకి ప్రవేశించి ఆయుధాలు చూపించి బెదిరించారు. ఉద్యోగులు అందర్నీ ఒకవైపు ఉంచి, మొత్తం 25 కేజీల బంగారాన్ని ఓ బ్యాగులో సర్థుకుని వేసుకుని బైక్‌లపై పరారయ్యారు.

అటు నుంచి బెంగుళూరు, తమిళనాడు బోర్డర్ వద్ద రెడీగా ఉన్న కంటెయినర్ వద్దకు టూవీలర్లపై వచ్చిన దుండగులు బంగారాన్ని మొత్తాన్ని కంటెయినర్‌లో ఏ మాత్రం కన్పించకుండా, గుర్తించకుండా ఉండేలా దాచిపెట్టారు. బెంగుళూరు, అనంతపురం మీదుగా రాయికల్, తొండుపల్లి టోల్ ప్లాజా నుంచి ఈ ముఠా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి చేరింది. తమిళనాడు డీజీపీ నుంచి అప్పటికే సమాచారం అందుకున్న తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి నగరంలోని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ ఆదేశాలతో నగరంలోని మూడు కమిషనరేట్‌కు చెందిన దాదాపు వందకు పైగా అన్ని విభాగాలకు చెందిన పోలీసులు శుక్రవారం రాత్రి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మేడ్చల్ సమీపంలోని తొండుపల్లి టోల్ ప్లాజ్ వద్ద కంటెయినర్‌ను గుర్తించారు. ఈ సందర్భంగా మొత్తం 9 మంది నిందితులలో 7 గురిని అరెస్టు చేయడంతో పాటు 25 కేజీల బంగారం, 7 పిస్టల్స్, 10 మాగ్జైన్లు, 97 బుల్లెట్లు, లారీ కంటెయినర్, సుమో, 13 సెల్ ఫోన్లతో పాటు రూ.93 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ సీపీ సజ్జనార్, కృష్ణగిరి ఎస్పీ బండి యాదగిరి అభినందించారు.


Next Story

Most Viewed