టీఎస్ డిస్కంల బకాయిలు రూ.5,840 కోట్లు

by  |
టీఎస్ డిస్కంల బకాయిలు రూ.5,840 కోట్లు
X

తెలంగాణలో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు), పవర్ ప్రొడ్యూసింగ్ కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఉత్తర (టీఎస్ఎన్పీడీసీఎల్), దక్షిణ(టీఎస్ఎస్పీడీసీఎల్) డిస్కంలతోపాటు ట్రాన్స్‌కోకు సంబంధించిన పవర్ కో ఆర్డినేషన్ కమిటీ (టీఎస్‌పీసీసీ)లు తాము కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించి 2019 నవంబర్ చివరిదాకా పలు విద్యుదుత్పత్తి కేంద్రాలకు రూ.5,840 కోట్లు బకాయిపడ్డాయి. ఈ పెండింగ్ బకాయిలు 2018 డిసెంబర్ నాటికి రూ.3,560 కోట్లు ఉండగా ఇప్పటివరకు రూ.2వేల కోట్లు పెరిగి రూ. 5,840 కోట్లకు చేరాయి. ఇక రాష్ట్రంలోని డిస్కంల పరిస్థితే ఈ విధంగా ఉంటే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న డిస్కంల బకాయిలు 2018 డిసెంబర్ నుంచి 2019 నవంబర్ వరకు 50వేల కోట్ల నుంచి రూ. 80 వేల కోట్లకు చేరాయని స్వయంగా కేంద్ర విద్యుత్ శాఖ గణాంకాలే చెబుతున్నాయి.

తెలంగాణ డిస్కంల పరిస్థితి ఇలా తయారు కావడానికి అన్ని రంగాలకు 24గంటల విద్యుత్ ఇవ్వడం, వ్యవసాయానికి ఉచితంగా 24గంటలు సరఫరా చేయడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. రాష్ట్రంలో విద్యుత్ సామర్థ్యం ప్రస్తుత వాడకంలో 35 శాతానికి మించి లేకున్నా గొప్పలకు పోయి వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తుండటంతో ట్రాన్స్‌కో, రాష్ట్ర డిస్కంలు ఈ విద్యుత్‌ను బయటి నుంచి కొని సరఫరా చేయాల్సి వస్తోంది. ఇలా పంపిణీ చేసిన విద్యుత్‌లో వ్యవసాయానికిచ్చిన విద్యుత్ కస్టమర్ దగ్గర బిల్లింగ్ అవదు. ఇక గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు పంపిణీ చేసే విద్యుత్‌లోనూ డిస్కంలకు పూర్తిస్థాయి ఖర్చులు తిరిగి రావట్లేదు. తెలంగాణ ఉత్తర డిస్కం టీఎన్పీడీసీఎల్‌లో ఒక యూనిట్ విద్యుత్ కొనడానికి అయ్యే ఖర్చుకు ఆదాయానికి తేడా 38 పైసలుండగా, దక్షిణ డిస్కం టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో ఆదాయం, ఖర్చు మధ్య వ్యత్యాసం 16 పైసల దాకా ఉంది.

రాష్ట్రంలో కొన్నికోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగమవుతుండటంతో డిస్కంల నష్టాలు ఎన్ని వందల కోట్లలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఈ నష్టాలకు తోడు ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్‌కు ఇచ్చే సబ్సిడీ సొమ్ము డిస్కంలకు సకాలంలో చెల్లించదు. ఈలోగా మళ్లీ పంపిణీకి అవసరమయ్యే విద్యుత్ కొనడానికి అప్పుల మీద అప్పులు చేసి డిస్కంలు వాటి వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ వ్యవధిని బట్టి విద్యుతుత్పత్తి కేంద్రాలకు బకాయిలు పెట్టడం సహజమేనని అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు, వ్యవసాయానికి ఎంత విద్యుత్ వాడితే అంత నష్టాలు, అప్పులు పెరిగిపోయి డిస్కంలు సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం లేకపోలేదని వారు పేర్కొంటున్నారు.

కేంద్రం సంస్కరణలెన్నున్నా ఫలితం శూన్యం
రాష్ట్రాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ఆర్థిక పరిస్థితి మెరుగు పర్చడానికి కేంద్రంలో 2014లో మోడీ ప్రభుత్వం వచ్చాక ఉదయ్ స్కీంను తీసుకువచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం డిస్కంల అప్పులకు బదులుగా బాండ్లను జారీ చేసింది. ఈ పథకంపై తెలంగాణ రాష్ట్రం కాస్త ఆలస్యంగా స్పందించినప్పటికీ చివరకు చేరక తప్పలేదు. 2019లో మళ్లీ రెండోసారి మోడీ ప్రభుత్వం వచ్చాక డిస్కంల బకాయిల వల్ల మొత్తం పవర్ సెక్టారే కుప్పకూలే పరిస్థితి వస్తోందని భావించి లెటర్ ఆఫ్ క్రెడిట్ స్కీంను అమలులోకి తెచ్చింది. దీనిలో డిస్కంలు తమకు అవసరం అయ్యే విద్యుత్ విలువకు సమానంగా ముందుగానే బ్యాంకుల ద్వారా లెటర్ ఆఫ్ క్రెడిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇన్ని చేసినా డిస్కంలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు పెట్టే బకాయిలు తగ్గకపోగా పెరుగుతూనే వస్తున్నాయి.

కొత్తగా అటల్ స్కీం
డిస్కంలకు వచ్చే నగదును మెరుగు పరచడానికి కేంద్రం తాజాగా బడ్జెట్‌లో విద్యుత్ వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఇవ్వాలని ప్రతిపాదించింది. తాము వాడే విద్యుత్‌ను మొబైల్ రీచార్జి‌లా ముందుగానే డబ్బులిచ్చి కొనుక్కోవడం అటల్ స్కీం ముఖ్య ఉద్దేశం. అయితే ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లకు ఒక్కోదానికి రూ.7 వేల దాకా ఖర్చు అవుతుండడంతో సామాన్యులు ఎంతవరకు వీటిని తీసుకోవడానికి ముందుకొస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి తోడు విద్యుత్‌కు ఇచ్చే ఎలాంటి సబ్సిడీ అయినా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే ప్రభుత్వాలు జమ చేయాలనే పథకంపైనా సమాలోచనలు చేస్తోంది. ఇలా ముందు బిల్లులు వసూలు చేసి తర్వాత సబ్సిడీ వేయడం విద్యుత్ విషయంలో అయ్యేపని కాదని పలువురు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.



Next Story

Most Viewed