ఆశ్చర్యం.. అధికార పార్టీకీ అభ్యర్థి కరువయ్యాడు..?

by  |
ఆశ్చర్యం.. అధికార పార్టీకీ అభ్యర్థి కరువయ్యాడు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఈ ఎన్నికలంటేనే గులాబీ శ్రేణులు వెనకంజ వేస్తున్నారు. రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ మొదలు కాగా, వరంగల్​–నల్గొండ–ఖమ్మం స్థానానికి పల్లా రాజేశ్వర్​రెడ్డి బరిలో దింపి బీఫాం కూడా అప్పగించింది. హైదరాబాద్​–రంగారెడ్డి–మహబూబ్​నగర్​ స్థానంపై మాత్రం ఎటూ తేల్చడం లేదు. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు నేతలు కూడా దొరకడం లేదు. ఇప్పటి వరకు టికెట్ల కోసం పైరవీలు చేసిన గులాబీ నేతలు ఈ స్థానానికి మాత్రం పిలిచినా ముందుకు రావడం లేదు. మరోవైపు పార్టీ కూడా అలాగే వ్యవహరిస్తోంది.

ఇన్​చార్జి ఉన్నారా..?

ప్రతి ఎన్నికను టీఆర్​ఎస్​ పార్టీ సవాల్​గానే తీసుకుని ఆయా ఎన్నికల్లో ఒక్కొక్కరికి ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. కానీ ఈ మండలి ఎన్నికల్లో మాత్రం అధిష్ఠానం అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తోంది. వరంగల్​ స్థానానికి పల్లా రాజేశ్వర్​రెడ్డి పోటీ చేస్తుండటంతో సీఎం కేసీఆర్​ ఈ మూడు ఉమ్మడి జిల్లాల మంత్రులకు ఆదేశాలిచ్చి, ఈ నెల 7 న సమావేశమై మంత్రులపై బాధ్యతలు పెట్టారు. దీంతో వరంగల్​, నల్గొండ, ఖమ్మం జిల్లాల మంత్రులు మండలి ప్రచారంలో దిగారు.

కానీ, హైదరాబాద్​ స్థానానికి మాత్రం ఇంకా ప్లాన్​ చేయలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ ముందుకు రాలేదని ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల కిందట వరకు మాజీ మేయర్​ బొంతు రామ్మోహన్, టీఎస్​ఏడబ్ల్యూడీసీ చైర్మన్​ ​ నాగేందర్​గౌడ్​, పీఎల్​ శ్రీనివాస్​, శుభప్రసాద్ పటేల్​తో పాటు దేవీ ప్రసాద్​ కూడా పోటీకి ఆసక్తి చూపించినా తీరా సమయంలో వెనకడుగు వేస్తున్నారు. దీంతో అధికార పార్టీ డైలామాలో పడింది.

గెలుపు లేకపోవడంతోనే…

హైదరాబాద్​–రంగారెడ్డి–మహబూబ్​నగర్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్​ఎస్​కు వరుస పరాజయాలు మిగిలాయి. 2007లో టీఆర్​ఎస్​ యెన్నం శ్రీనివాస్​రెడ్డిని పోటీకి దింపగా ఓటమి పాలైంది. 2009లో ఇలాంటి పరిస్థితులే కనిపించడంతో అభ్యర్థిని వద్దనుకుంది. 2015లో ఎంతో కొంత నమ్మకంతో టీఎన్జీఓ యూనియన్​ అధ్యక్షుడుగా ఉన్న దేవీ ప్రసాద్​ను బరిలోకి దింపింది. ఉద్యోగానికి రాజీనామా చేయించి పోటీకి దింపింది. ఆయన కూడా ఓటమి పాలయ్యాడు. ఇలా ఈ స్థానంలో టీఆర్​ఎస్​ బోల్తా పడుతూనే ఉంది.

ఇప్పుడెలా..?

ప్రస్తుతం ఈ స్థానంలో పోటీకి దూరంగా ఉండేందుకే టీఆర్​ఎస్​ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరంగల్​ స్థానానికి పల్లా రాజేశ్వర్​రెడ్డికి బుధవారం బీఫాం కూడా అందించారు. హైదరాబాద్​ స్థానంపై మాత్రం ఇంకా నిర్ణయం ప్రకటించడం లేదు. ప్రస్తుతం మండలి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. పట్టభద్రుల ఓటరు నమోదు సందర్భంగా టీఆర్​ఎస్​ చాలా హడావుడి చేసింది. గెలుపు మాదేననే రీతిలో ప్రచారం చేసింది. ఆరు జిల్లాల మంత్రులను ఎన్నికకు సిద్ధం చేసినా వాస్తవ పరిస్థితులు గుర్తించి సైలెంట్​ అయింది.

మరోవైపు బీజేపీ, కాంగ్రెస్​ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ తరుపున సిట్టింగ్​ ఎమ్మెల్సీ రామచంద్రారావు, కాంగ్రెస్​ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి పోటీ చేస్తున్నారు. కానీ టీఆర్​ఎస్​ మాత్రం ఎవరినీ ప్రకటించలేదు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయడం లేదు. ఈసారి కూడా మళ్లీ ప్రొఫెసర్​ నాగేశ్వర్​కు మద్దతునివ్వాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గెలిచే పరిస్థితులు లేవని, పోటీ చేసి పరువు తీసుకోవడం కంటే తటస్థంగా ఉండి మద్దతు ఇవ్వడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు వినికిడి.

Next Story