కేంద్రంపై వైసీపీ దూకుడు.. టీఆర్ఎస్ సైలెంట్.. వ్యూహమేంటి..?

by  |
కేంద్రంపై వైసీపీ దూకుడు.. టీఆర్ఎస్ సైలెంట్.. వ్యూహమేంటి..?
X

“లోక్‌సభ, రాజ్యసభల్లో సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా కోసం కేంద్రాన్ని నిలదీయాలి. గట్టిగా కొట్లాడాలి. కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలి. కేంద్ర మంత్రుల్ని కలిసి వినతిపత్రాలను అందజేయాలి“. – జూలై 16న ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో సీఎం కేసీఆర్

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంటు సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు పోషించాల్సిన పాత్రపై ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా స్పష్టమైన విధానాన్నే ఆ పార్టీ ఎంపీల ముందు ఉంచారు. ఈ నెల 19 నుంచి మొదలైన పార్లమెంటు సమావేశాల్లో ఉభయ సభల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు మౌనంగానే ఉండిపోయారు. కొద్దిమంది సమావేశాలకు హాజరు కూడా కాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్సార్సీపీ ఎంపీలు మాత్రం ఉభయ సభల్లో వెల్‌లోకి దూసుకెళ్ళి మరీ కేంద్రాన్ని నిలదీస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు నాలుగు రోజుల పాటు సమావేశాలు కూడా సజావుగా జరగకుండా వారి డిమాండ్లను సభ ముందు ఉంచారు. ఆ దూకుడు టీఆర్ఎస్ ఎంపీల నుంచి ఎందుకు లేదన్నది ఇప్పుడు రెండు రాష్ట్రాల ఎంపీల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ మౌనం వెనక వ్యూహం ఏమై ఉంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీతో రాజీయా లేక తెరవెనక కుదిరిన పరస్పర అవగాహనా లేక ఎంపీలు చొరవ తీసుకోకపోవడమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో సందర్భం వచ్చినప్పుడల్లా కేంద్రంతో కొట్లాడాలని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పినా ఎంపీలు మాత్రం కనీసంగా కూడా ప్రశ్నించకపోవడంపై పార్లమెంటు లాబీల్లో చర్చలు జరుగుతున్నాయి. గత టర్ములో ఎయిమ్స్, హైకోర్టు విభజన లాంటి అనేక అంశాల్లో ప్లకార్డులు సైతం పట్టుకుని కేంద్రానికి నిరసన తెలియజేసిన ఉద్యమ స్ఫూర్తి ఈ సమావేశాల్లో కనిపించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పార్లమెంటరీ సమావేశంలో సీఎం రోడ్ మ్యాప్ ఇచ్చినా చివరకు దానికి భిన్నంగా పార్లమెంటులో ఎంపీల వైఖరి ఉండడంతో ఒక ప్లాన్ ప్రకారమే ఇది జరుగుతున్నదన్న అనుమానాలకు తావు ఇచ్చినట్లయింది.

కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుతున్నదని ముఖ్యమంత్రి బహిరంగంగానే ప్రకటించారు. రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు సైతం అటు కేఆర్ఎంబీకి ఇటు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు లేఖలు రాశారు. చివరకు ఈ వ్యవహారం గ్రీన్ ట్రిబ్యునల్‌కూ వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు అక్రమమంటూ రాష్ట్ర కేబినెట్ సమావేశం తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ఏపీ తలపెట్టిన అక్రమ ప్రాజెక్టుల విషయాన్ని పార్లమెంటు వేదికగా ప్రస్తావించిన టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు సైలెంట్‌గా ఉండిపోయారన్నది అంతుచిక్కడంలేదు. పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన సంకేతాలకు అనుగుణంగా మౌనంగా ఉన్నారా లేక మరేదైనా కారణమా అనే చర్చలే ఇప్పుడు ఢిల్లీలో హాట్ టాపిక్‌గా ఉన్నాయి.

వైఎస్సార్సీపీ ఎంపీలు లోక్‌సభ వేదికగా శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ కరెంటును ఉత్పత్తి చేస్తూనే ఉన్నదని, కేఆర్ఎంబీ చెప్పినా ఆపడంలేదని ప్రస్తావించారు. కేంద్ర మంత్రి సైతం చాలా బ్యాలెన్సుగా సమాధానం చెప్పారు. ఆ సందర్భాన్ని టీఆర్ఎస్ ఎంపీలు ఒక అవకాశంగా ఎంచుకుని ఏపీ వైఖరిని, నీటి చౌర్యాన్ని, అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయాన్ని అదే వేదికగా కేంద్రం దృష్టి, యావత్తు దేశం దృష్టికి తీసుకెళ్తారేమోనని చాలా మంది ఎంపీలు భావించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు సైతం ఒకవేళ తెలంగాణ అడ్డుకునే ప్రయత్నం చేస్తే దీటుగా ఎదుర్కోడానికి ఎలాంటి వ్యూహం అవలంబించాలో అంతర్గతంగా చర్చించుకుని సిద్ధంగా ఉన్నారు. కానీ టీఆర్ఎస్ ఎంపీలు మాత్రం ఏమీ పట్టనట్లుగా ఉండిపోవడం అనుమానాలకు దారి తీసింది. వైఎస్సార్సీపీ ఎంపీలకు టెన్షన్ తప్పింది.

Next Story

Most Viewed