నేడు ఈడీ ముందుకు టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు

by  |
TRS MP Nama Nageswara Rao enquiry Before ED today
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీంతో ఇవాళ నామా ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. మధుకాన్ స్కామ్‌పై నామాను ఈడీ విచారించనుంది. ఝార్ఖండ్‌లో మధుకాన్ కంపెనీ చేపట్టిన రాంచీ నేషనల్ హైవే ప్రాజెక్టు కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వ్యాపారులకు మళ్లించినట్లు నామాపై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో సీబీఐ కేసు ఆధారంగా ఈడీ అధికారులు విచారణ చేపడుతున్నారు.

ఇటీవల ఎంపీ నామా, మధుకాన్ డైరెక్టర్ల ఇళ్లల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. నగదు, దస్త్రాలు, హార్డ్ డిస్క్‌లు ఈడీ స్వాధీనం చేసుకుంది. మధుకాన్ కంపెనీలో రూ.264 కోట్లు అవకతవకలు జరిగాయని ,బ్యాంకులను రూ.1064 కోట్లకు మోసం చేసినట్లు అభియోగాలు నమోదు చేసింది. విచారణకు హాజరుకావాల్సిందిగా నామాతో పాటు కంపెనీ డైరెక్టర్లకు సమన్లు జారీ చేసింది.

అయితే తాను ఏ సంస్థలోనూ డైరెక్టర్‌గా లేనని, ED విచారణకు పూర్తిగా సహకరిస్తానని నామా చెబుతున్నారు. 40 ఏళ్ల క్రితమే మధుకాన్ సంస్థను స్థాపించానని, తాను సంస్థ డైరెక్టర్‌గా లేకపోయినా ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. రాంచీ నేషనల్ హైవే ప్రాజెక్టులో నిధులు మళ్లించడానికి అసలు అవకాశం లేదన్నారు. తమ సంస్థ ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టిందని, దేనిలోనూ అవకతవకలు జరగలేదని నామా చెప్పారు.

Next Story