‘మేము ఉద్యోగాలిచ్చాం.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’

by  |
TRS MP K.Keshava Rao
X

దిశ, బేగంపేట: టీఆర్ఎస్ హయాంలో లక్ష 36 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. ఇవ్వలేదని ప్రతిపక్షాలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు సవాల్ విసిరారు. బేగంపేట‌లోని జురాస్టియన్ ఫంక్షన్ హాల్‌లో టీఆర్ఎస్ సనత్‌నగర్ నియోజకవర్గ సర్వసభ్య సమావేశాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కే.కేశవరావు మాట్లాడుతూ.. ఏయే శాఖలో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేసిందో ప్రభుత్వం లెక్కలతో సహా తెలిపిందని, అనుమానులు ఉంటే సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వ లెక్కలు తప్పని రుజువు చేస్తే ఈ వేదికపై ఉన్న వారందరూ రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. టీఆర్ఎస్ బలపరిచిన హైదరాబాద్ స్థానం ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి ఎమ్మెల్సీగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ప్రతిపక్షాలు అనవసరంగా ఉద్యోగాల భర్తీ, పీఆర్సీ, ప్రమోషన్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జీ, మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు మన దేశ గౌరవాన్ని ప్రపంచదేశాలకు చాటి చెప్పారని తెలిపారు. ఆయన కూతురు సురభి వాణీదేవిని అత్యధిక మెజారిటీ‌తో గెలిపించాని కోరారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 30 ఏండ్ల నుంచి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇచ్చింది తెలంగాణా ప్రభుత్వమే అని తెలిపారు. దేశ చరిత్రలోనే మొదటి ఒక లక్ష 30 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసింది టీఆర్ఎస్సేనని తెలిపారు. ఐదేండ్ల పాటు ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ నాయకుడు రామచంద్రరావు ఎన్నడూ శాసన మండలిలో ఉద్యోగాల గురించి ప్రశ్నించలేదని విమర్శించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్ధి సురభి వాణీదేవి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, తలసాని సాయి కిరణ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story