కవిత ఫ్లెక్సీలు చింపేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు.. అరెస్ట్

by  |
Shanker-Naik-at-Police-Stat
X

దిశ ప్రతినిధి, వరంగల్: సద్దుల బతుకమ్మ వేడుకల సాక్షిగా మానుకోటలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్సెస్ ఎంపీ కవితల మధ్య రాజకీయ వర్గ పోరు కొనసాగుతోంది. ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునేందుకు ఒకరు.. నిలువరించేందుకు మరొకరు అన్నట్లుగా ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల మధ్య హై వోల్టాజీ పాలిటిక్స్ రన్ అవుతున్నాయి. ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ల మధ్య నెలకొన్న రాజకీయ ఆధిపత్య పోరు… గురువారం సద్దుల బతుకమ్మ సంబరాలను పురస్కరించుకుని పట్టణంలో ఎంపీ కవిత వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను శంకర్ నాయక్ అనుచరులు చించి వేశారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగింది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. శంకర్ నాయక్, ఆయన అనుచరులు వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ కవిత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు వెంటనే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ వెంటనే డీజీపీతో కూడా మాట్లాడి అనంతరం ఆమె.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులు కావాలనే తమ ఫ్లెక్సీలు తొలిగించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు చెందిన నలుగురు అనుచరులను మానుకోట పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ వెంకట రత్నం అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ అర్థరాత్రి రెండు గంటలకు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన అనుచరులను విడిచి పెట్టాలని సీఐని కోరారు. అందుకు సీఐ నిరాకరించడం గమనార్హం. చేదు అనుభవంతో ఎమ్మెల్యే ఇంటికి తిరుగు ముఖం పట్టారు. ఎమ్మెల్యే, ఎంపీల మధ్య నెలకొన్న రాజకీయ వివాదం ఎలా ముగుస్తుందనేదానిపైనే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది.

గతంలోనూ వార్..
మహబూబాబాద్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ లో గత కొద్ది సంవత్సరాల నుంచి ఫ్లెక్సీల వార్ కొనసాగుతోంది. ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్గీయుల మధ్య సైలెంట్ పోరు కొనసాగుతోంది. 2014 మహబూబాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా పోటీ చేయగా శంకర్ నాయక్ గెలుపొందారు. తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మాలోత్ కవిత అధికార టీఆర్ఎస్ లో చేరింది. 2018 ఎన్నికల్లో కవిత మానుకోట అసెంబ్లీ టిక్కెట్ ఆశించగా కేసీఆర్ సిట్టింగ్ లకే మళ్ళీ అవకాశం ఇవ్వడంతో శంకర్ నాయక్ బరిలో నిలిచారు. మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి కవిత బరిలో నిలిచి గెలిచారు. వచ్చే ఎన్నికల్లో కవిత ఎమ్మెల్యే టికెట్ ఇక్కడి నుంచే ఆశిస్తున్నట్లుగా, శంకర్ నాయక్ మీద తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ మేరకు కవితకే మానుకోట అసెంబ్లీ టికెట్ వస్తుందన్న చర్చ పార్టీలో కొంతమంది చర్చించుకుంటున్నారు. ఈ పరిణామాల మధ్య తరుచూ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తాజాగా ఫ్లెక్సీల వివాదం తెరపైకి వచ్చింది.

అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా: ఎమ్మెల్యే శంకర్ నాయక్
ఈ ఫ్లెక్సీల వివాదం నాకు తెలియదు. పార్టీ కోసం జెండాలు మోసిన కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయంపై, పోలీసులు వ్యవహారించిన తీరుపై పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను.


Next Story

Most Viewed