హుజూరాబాద్ ఎన్నికపై టీఆర్ఎస్ దాటవేసే ధోరణి?

by  |
EC, Huzurabad by-election
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలా? వద్దా? అనే అంశంపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని వెల్లడించాలని ఈసీ కోరింది. ఈ నెల30 గడువు విధించింది. గడువు ముగిసినా టీఆర్ఎస్ మాత్రం తన అభిప్రాయాన్ని ప్రకటించలేదని, కేంద్రానికి లేఖ రాయలేదని సమాచారం. అన్ని జాతీయ పార్టీలు ఎన్నికలు నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ప్రస్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో ఎన్నిక‌ల నిర్వహ‌ణ‌కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలాంటి చ‌ర్యలు చేప‌ట్టాలి..? అనే విష‌యంలో అన్ని పార్టీలు త‌మ అభిప్రాయాల‌ను తెలియ‌జేయాల‌ని ఈనెల 12న ఈసీ త‌న లేఖ‌ల్లో కోరింది. ఈనెల 30లోపు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పాలని పేర్కొన్నది. గతేడాది చివర, ఈ ఏడాది ఫిబ్రవరిలో జ‌రిగిన ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈసారి అన్ని జాగ్రత్తలతో ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు ఈసీ భావిస్తున్నది. అందులో భాగంగానే పార్టీల నుంచి అభిప్రాయాల సేక‌ర‌ణ చేప‌ట్టింది. గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు హరియాణా, రాజస్తాన్, కర్ణాటక, మేఘాలయ, ఏపీ, తమిళనాడులో పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. రాష్ట్రంలోనూ హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే సీఈసీ ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయాలను కోరగా అన్ని జాతీయపార్టీలు ఎన్నికలు నిర్వహించాలని లేఖల్లో అభిప్రాయం వెల్లడించినట్లు సమాచారం.

రాష్ట్రంలో మాజీ మంత్రి ఈటల రాజీనామాతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో టీఆర్ఎస్ తన అభిప్రాయాన్ని వెల్లడించలేదని పలువురు పేర్కొంటున్నారు. గతంలో రాష్ట్రంలో కరోనా తీవ్రత ఉందని ఎన్నికలు నిర్వహించొద్దని ఈసీని కోరింది. అయితే ఎన్నికలు నిర్వహించాలా? వద్దా? అని పార్టీల అభిప్రాయాన్ని కోరడంతో అన్ని పార్టీలు ఎన్నికలకే మొగ్గుచూపాయి. కానీ టీఆర్ఎస్ మాత్రం ఎలాంటి సూచన గానీ అభిప్రాయం గాని ప్రకటించలేదని ఆ పార్టీలోని నేతలు చర్చించుకుంటున్నారు. ప్రతిపక్షపార్టీల నేతలు మాత్రం టీఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతోనే అభిప్రాయం వెల్లడించలేదని ఆరోపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే రాజకీయ పార్టీల నుంచి సూచనలు స్వీకరించిన తర్వాత వాటిని పరిశీలించడానికి సమయం పడుతుందని, ఆ తర్వాతే ఉప ఎన్నికలపై సీఈసీ నిర్ణయం తీసుకుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో పాటే శాసన మండలిలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదీ ఏమైనప్పటికీ సెప్టెంబర్ మొదటివారంలో లేక రెండోవారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


Next Story

Most Viewed