రోడ్డెక్కనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

by  |
రోడ్డెక్కనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నేడు ‘భారత్ బంద్’ జరగనుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ రైతుల డిమాండ్లకు పూర్తిస్థాయి మద్దతు పలకడమే కాకుండా బందులోనూ ప్రత్యక్షంగా పాల్గొంటోంది. పార్టీ శ్రేణులే కాకుండా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఆందోళనలో పాలు పంచుకోనున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొంటారో పార్టీ తరఫున ఇప్పటికే షెడ్యూలును ఖరారు చేశారు. సీఎం కేసీఆర్ సైతం స్వయంగా ఫోన్ చేసి పలువురితో మాట్లాడారు. ఆయన ఎక్కడ పాల్గొంటారనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. కాంగ్రెస్, వామపక్షాలు, రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు కూడా బంద్‌లో భాగస్వాములవుతున్నాయి. దేశవ్యాప్తంగా 15కు పైగా రాజకీయ పార్టీలు ‘భారత్ బంద్’లో పాల్గొంటున్నాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన, శిరోమణి అకాలీదళ్, ఆర్జేడీ, మజ్లిస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ తదితర పార్టీలు రైతులకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆయా రాష్ట్రాలలో ఆ పార్టీల అధినేతలు ప్రత్యక్షంగా ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు.

తీర్మానం చేస్తారా.?

తెలంగాణలోనూ అఖిల భారత కిసాన్ సభ, రైతు స్వరాజ్య వేదిక, రైతాంగ పోరాట సమన్వయ సమితి, రైతు కూలీ సంఘం ఆందోళనలో పాల్గొంటున్నాయి. కాంగ్రెస్ అనుబంధ విభాగం కిసాన్ సేవాదళ్ కూడా బందులో పాల్గొంటోంది. వ్యవసాయ చట్టాలను బేషరతుగా ఉపసంహరించుకోవాల్సిందేనని ఈ పార్టీలు, సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సవరణలు సరిపోదని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు చట్టాలను అమలుచేయబోమంటూ అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ఆమోదించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నందున అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా తీర్మానాన్ని ఆమోదించాలని, అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైతులకు అన్యాయం చేస్తున్న ఈ చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు పోరాటాన్ని కొనసాగించాల్సిందిగా సీఎం కేసీఆర్ రైతు సంఘాలకు విజ్ఞప్తి చేసినందున ఈ తరహా తీర్మానాన్ని ఆమోదిస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఎవరెవరు ఎక్కడెక్కడ..

కేటీఆర్: ఫారూక్‌నగర్ మండలం బూగ్రుల గేట్ దగ్గర, షాద్‌నగర్ సమీపంలోని బెంగళూరు హైవే మీద, ఉదయం 10 గంటలకు
కవిత : కామారెడ్డి శివారులోని టేక్రియాల్ సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిమీద; ఉదయం 8.00 గంటలకు
ప్రశాంత్ రెడ్డి: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ క్రాస్ రోడ్డు దగ్గర; ఉదయం 9.00 గంటలకు
మల్లు భట్టి విక్రమార్క : షామీర్‌పేట్ సమీపంలోని హైవే మీద; ఉదయం 9.00 గంటలకు
రేవంత్ రెడ్డి : షాద్ నగర్ మార్కెట్ కమిటీ గేటు దగ్గర; ఉదయం 10.00 గంటలకు
వామపక్షాలు : నగరంలోని కోఠి గాంధీ జ్ఞాన్‌మందిర్‌ నుండి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ వరకు ర్యాలీ; ఉదయం 11.00 గంటలకు
మధ్యాహ్నం ఆర్టీసీ క్రాస్ రోడ్డులో బహిరంగ సభ


Next Story

Most Viewed