జోరుగా టీఆర్ఎస్ నాయకుల దందా.. అడ్డాగా మారిన కార్యాలయం..

by  |
జోరుగా టీఆర్ఎస్ నాయకుల దందా.. అడ్డాగా మారిన కార్యాలయం..
X

దిశ, మణుగూరు : మండలంలోని ఆ ఇద్దరు టీఆర్ఎస్ నేతల అరాచకాలు, సెటిల్మెంట్లు, దందాలు శృతిమించి పోతున్నాయని మండల ప్రజలు, పలువురు మేధావులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీలో ఆ ఇద్దరు కీలకమైన వ్యక్తులుగా ఉండి అందినకాడికి దోచుకొని మండలాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం అడ్డగా చేసుకొని సెటిల్మెంట్లు చేస్తూ కోట్లు గటిస్తున్నారని కొంతమంది కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు.

మండలం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో అమాయకమైన గిరిజనులను అడ్డం పెట్టుకొని తులమో, పలమో, వారికి ఇచ్చుకుంటూ భూదందాలు, సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. గిరిజనులను బినామిలుగా చేసుకొని భూములపై కోట్లరూపాయలు సంపాదించారనే వార్త గట్టిగానే వినపడుతోంది. మండలంలో కొంతమంది అధికారులను తమ ఆధీనంలోకి తెచ్చుకొని భూదందాలకు, సెటిల్మెంట్లకు తెరలేపారు. అధికారులు వీరి మాటవింటేనే మండలంలో ఉద్యోగం చేస్తారు. లేదంటే ట్రాన్స్ఫర్లు చేపిస్తామని బెదిరింపులకు దిగుతున్నారు.

స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పనిలో ఉంటే వీరిద్దరు అరాచకాలు మాత్రం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయని ఆయన సన్నిహితులు అంటున్నారు. ప్రతి దాంట్లో ఎమ్మెల్యే పేరు చెప్పుకుని దందాలకు తెరలేపుతున్నారని మండలవ్యాప్తంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు సంపాదనే ధ్యేయంగా పార్టీలో ఉంటున్నారని కొందరి వాదన. స్థానిక ఎమ్మెల్యే ఆ ఇద్దరు వ్యక్తులను ఎందుకు పార్టీలో ఉంచుతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీరు చేసే దందా ఎమ్మెల్యేకు తెలిసే జరుగుతుందా, లేక తెలియక జరుగుతుందా అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే వీరిద్దరు చేసే పనులను తెలుసుకోని, వెంటనే పార్టీ దూరం పెట్టకపోతే పార్టీ పరువుతో పాటు ఎమ్మెల్యే రాజకీయ జీవితానికి కూడా చెక్ పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషణలు భావిస్తున్నారు.



Next Story