కౌశిక్ రెడ్డి రహస్య సమావేశం.. సీరియస్‌గా తీసుకున్న అధిష్టానం

by  |
cm-kcr-and-kaushik-reddy1
X

దిశ ప్రతినిది, కరీంనగర్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి సొంత పార్టీ వారి నుండే ఇబ్బందులు మొదలవుతున్నాయి. హుజురాబాద్, చొప్పదండి నియోజకవర్గాలకు చెందిన లోకల్ బాడీస్ డెలిగేట్స్ పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మేరకు సమీకరణాలు జరుపుతున్న విషయం తెలుసుకున్న అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు కూడా తీసుకున్నట్టుగా సమాచారం అందడంతో వారు పోటీ చేయకుండా ఉండేందుకు అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపై జిల్లా మంత్రి గంగుల కమలాకర్ కూడా జోక్యం చేసుకుని స్థానిక సంస్థల ప్రతినిధులు తమ ఆలోచనలను విరమించుకోవాలని సూచించినట్టు సమాచారం. అయినా వినేది లేదంటే పార్టీని వీడి నామినేషన్లు వేసుకోవాలని.. లేకపోతే క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

కౌశిక్ రెడ్డికి ఫస్ట్ టాస్క్..

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన పాడి కౌశిక్ రెడ్డికి అధిష్టానం ఫస్ట్ టాస్క్ అప్పగించినట్టు తెలిసింది. ఆయన శుక్రవారం 11 గంటలకు శంకరపట్నం మండలంలోని ఓ రహస్య ప్రాంతంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఈ సమావేశంలో నామినేషన్ వేసేవారిని పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన వారిని ఒప్పించనున్నట్టు సమాచారం. ఈ మేరకు హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులను సమావేశం ఏర్పాటు చేసిన చోటకు రావాలని కోరుతూ ఫోన్లు వెళ్లాయి. ఈ రోజు సాయంత్రానికల్లా ఈ ఆపరేషన్ ను పూర్తి చేయాలని కౌశిక్ రెడ్డి భావిస్తున్నారు.

చొప్పదండిలో..

ఇకపోతే చొప్పదండి నియోజకవర్గంలోనూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు పావులు కదుపుతున్న నాయకులు తమవంతు ప్రయత్నాల్లో మునిగిపోయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రెండు రోజుల క్రితం నియోజకవర్గంలోని స్థానిక నేతలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ప్రముఖులు ఎవరూ రాకపోవడంతో చర్చ జరగకుండానే వదిలేసినట్టు తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో ఈ నియోజకవర్గానికి చెందిన ఓ నేత ఇంట్లో ఫంక్షన్ ఉన్నందున అక్కడ సదరు నాయకుడు తన భవిష్యత్ కార్యాచరణను గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.



Next Story