రాహుల్ గాంధీ కాదు..రాంగ్ గాంధీ

by Disha Web Desk 15 |
రాహుల్ గాంధీ కాదు..రాంగ్ గాంధీ
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు రాష్ట్రంలో అమలైనట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్మల్ ఎన్నికల సభలో ప్రకటించడాన్ని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తప్పుబట్టారు. సిద్దిపేటలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి అయితే.. రాహుల్ గాంధీ రాంగ్ గాంధీ అయ్యారని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలల్లో గృహ జ్యోతి పథకం పాక్షికంగా అమలైందని, మిగిలిన 5 గ్యారెంటీలు అమలు కాలేదన్నారు. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఐదు గ్యారెంటీలను అమలు చేసినట్లు, రాహుల్ గాంధీ 6 గ్యారెంటీలు అమలు చేసినట్లు తెలంగాణ ప్రజలను తప్పదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

వందరోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఓట్లు దండుకున్న కాంగ్రెస్ నాయకులు హామీల అమలులో విఫలమైనందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమలు కానీ హామీలను అమలైనట్లు ప్రకటించిన రాహుల్ గాంధీ మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలన్నారు. మహిళలకు రూ.2500, పెన్షన్ రూ. 4వేలకు పెంపు, రైతు భరోసా, చేయూత, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు ఇలా ఆరుగ్యారెంటీల అమలు పై కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని హరీష్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆరు గ్యారెంటీల అమలుపై బషీర్ బాగు ప్రెస్ క్లబ్ లేదా టీవీ ఛానల్ లైవ్ షోలో బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదరికం నిర్మూలిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో పేదరికానికి కారణం గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీనే అన్నారు. బీజేపీ నల్లధనం వెనక్కి తీసుకొచ్చి బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని ప్రజలను కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రాజనర్సు, సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed