పార్టీ ప్రతిష్ట గంగలోకి.. లైంగిక వేధింపుల కేసులో టీఆర్ఎస్ నేతలు అరెస్ట్

by  |
trs leader
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: టీఆర్ఎస్ నేతల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. అధికారం తమదే అంటూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. అసలే వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ తన మాటలు, చేష్టలతో ఇప్పటికే వివాదాస్పదుడిగా నిలిచాడు. ఇప్పుడు అదే నియోజకవర్గంలోని టీఆర్ఎస్ యూత్ లీడర్ వివాహితను లైంగికంగా వేధింపులకు గురిచేసి ఏకంగా అరెస్టయ్యాడు. వివాహితను లైంగికంగా వేధింపులకు గురిచేసిన కేసులో వైరా నియోజకవర్గ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు చల్లా సతీష్‌ను వైరా పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి మధిర కోర్టులో రిమాండ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన సతీష్ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అదే గ్రామంలోని తమ బంధువు అయిన ఒక వివాహితను ప్రేమపేరుతో కొంతకాలంగా వేధిస్తున్నాడు. సతీష్‌కు వివాహం అయినా ఆ వివాహితను ప్రేమ పేరుతో వేధిస్తూ కొన్నినెలల కిందట నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

కాగా, రెబ్బవరం గ్రామానికి చెందిన ఓ పోలీస్ కానిస్టేబులుతో 2016లో వైరాకు చెందిన తన మేనకోడలుకు వివాహమైంది. ఆ తర్వాత కొన్నేళ్ల నుంచి సతీష్ ఆమెను ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమె కొద్దిరోజుల కిందట వైరాలోని తన పుట్టింటికి వచ్చింది. అయినప్పటికీ ఈనెల 6న వైరాలోని ఆమె ఇంటికొచ్చి ప్రేమ పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పురుగులమందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు హడావుడి చేశాడు. వేధింపులు భరించలేని ఆ వివాహిత వైరా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు సతీష్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. సతీష్‌కు సహకరించిన వారిపై కూడా పోలీసులు కేసులు నమోదుచేశారు.

మసకబారుతున్న పార్టీ ప్రతిష్ట..

ఇప్పటికే వైరా నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ వర్గాలుగా విడిపోయింది. దానికి తోడు ఎమ్మెల్యే పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జనాల్లో, పార్టీ పెద్దల దృష్టిలో చులకనయ్యారు. అదీకాక తమ వర్గం వారికే పనులు చేయిస్తున్నారని వేరే వర్గం ఆరోపణలు సైతం చేస్తోంది. దీనికి తోడు పార్టీ శ్రేణులపై ఎమ్మెల్యే కొడుకు సైతం పెత్తనం చెలాయించడాన్ని ఇటీవల కొందరు తప్పు పట్టిన విషయం తెలిసిందే. వీటన్నింటికి తోడు ఇప్పుడు యువజన విభాగం అధ్యక్షుడు ఏకంగా లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ చర్యలన్నింటి వల్ల నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ట పూర్తిగా మసకబారిందని పార్టీశ్రేణులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా ఈ నియోజకవర్గంపై పెద్దలు దృష్టి సారిస్తే తప్ప బాగుపడేలా లేదని కొందరు చెవులు కొరుక్కుంటుండడం గమనార్హం.


Next Story

Most Viewed