అటవీ ఉద్యోగిని చెట్టుకు కట్టేసిన ఆదివాసీ మహిళలు

by  |
అటవీ ఉద్యోగిని చెట్టుకు కట్టేసిన ఆదివాసీ మహిళలు
X

దిశ, భద్రాచలం : తాము సాగు చేసుకున్న భూములను దున్నించి స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన అటవీ సిబ్బంది పై పోడు రైతులు దాడి చేశారు. ఈఘటప భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలంలో చోటు చేసుకుంది. చింతగుప్పలో పోడు రైతులకు కోపం వచ్చింది. తమ పోడు భూముల జోలికి రావొద్దని అధికారులను ఎంత ప్రాధేయపడినా వారు అవేవి పట్టించుకోకుండా , పత్తి సాగుచేసిన భూములను దున్నించి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళారు.

దీంతో ఆగ్రహానికి గురైన గిరిజన మహిళలు, అటవీ సిబ్బంది హుస్సేన్, రాజేశ్, విజయ్‌లపై తిరగబడ్డారు. కోపంతో రగిలిపోతూ ఓ సిబ్బందిని లాక్కుంటూ వెళ్ళి త్రాడుతో చెట్టుకు కట్టేశారు. ఈ ఘటన అధికార యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. రెండు రోజుల క్రితం ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఈ ప్రాంతానికి వచ్చి పోడు సాగుచేస్తున్న గిరిజనులతో మాట్లాడి వారికి మనోధైర్యం కలిగించారు. పోడు భూముల రైతుల జోలికి తొందరపడి పోవద్దని అటవీ అధికారులకు హెచ్చరించారు. అయినా ఎమ్మెల్యే వచ్చి వెళ్ళిన మూడవరోజు ఈ సంఘటన జరగడం గమనార్హం. చింతగుప్ప సర్పంచ్ వెళ్ళి గిరిజనులతో మాట్లాడి అటవీ ఉద్యోగులను అక్కడి నుంచి పంపించినట్లు తెలిసింది. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం

Next Story