6వ దశ లోక్‌సభ ఎన్నికల బరిలో మొత్తం అభ్యర్థులు ఎంతమందంటే..

by Harish |
6వ దశ లోక్‌సభ ఎన్నికల బరిలో మొత్తం అభ్యర్థులు ఎంతమందంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆరోదశ లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల (యూటీలు) నుంచి మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని భారత ఎన్నికల సంఘం(ఈసీ) శనివారం తెలిపింది. వీరిలో జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ పార్లమెంటరీ నియోజకవర్గంలో వాయిదా వేసిన ఎన్నికలకు పోటీ పడుతున్న 20 మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. ఆరో దశలో మొత్తం 58(వాయిదా పడిన జమ్మూకశ్మీర్ ఒక స్థానంతో కలిపి) పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మే25న పోలింగ్ జరగనుంది.

ఈ దశలో పోటీకి 1,978 నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలన అనంతరం 900 నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు ఈసీ తెలిపింది. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 470 నామినేషన్లు వచ్చాయి. ఆ తర్వాత, హర్యానాలోని 10 నియోజకవర్గాల్లో 370 నామినేషన్లు వచ్చాయి. అలాగే, జార్ఖండ్‌లోని రాంచీ పార్లమెంటరీ సీటుకు అత్యధికంగా 70 నామినేషన్లు, నార్త్‌ ఈస్ట్ ఢిల్లీ స్థానం నుంచి 69 నామినేషన్లు దాఖలైనట్లు ఈసీ పేర్కొంది.

ఆరో దశకు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల సగటు సంఖ్య 15 గా ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. బీహార్, హర్యానా, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, జమ్ముకశ్మీర్, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 58 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. మొత్తం 58 స్థానాల్లో ఉత్తరప్రదేశ్‌ నుంచి 14, హర్యానా నుంచి 10, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌ నుంచి 8, ఢిల్లీ నుంచి 7, ఒడిశా నుంచి 6, జార్ఖండ్‌ నుంచి 4, జమ్ము కశ్మీర్‌ నుంచి ఒకటి ఉన్నాయి.



Next Story

Most Viewed