హలాల్ విక్రయించనందుకే రెస్టారెంట్ మూత.. భారతీయ యజమాని సంచలన ఆరోపణలు

by Kema Shiva Kumar |

లండన్‌లోని ప్రముఖ భారతీయ రెస్టారెంట్ ’రంగ్‌రేజ్’ హలాల్ మాంసం విక్రయించనందుకే మూతపడిందని దాని యజమాని సంచలన ఆరోపణలు చేశారు.

హలాల్ విక్రయించనందుకే రెస్టారెంట్ మూత.. భారతీయ యజమాని సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: హలాల్ (Halal) వివాదం భారత్‌లో రాజకీయంగా, ఆర్థికంగా అత్యంత హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లండన్‌లో జరిగిన ఘటన ఏకంగా ఓ రెస్టారెంట్‌నే మూతపడేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. లండన్‌లోని ‘రంగ్‌రేజ్’ (Rangrez) అనే ప్రముఖ భారతీయ రెస్టారెంట్‌ను మూసివేస్తున్నట్లు దాని యజమాని హర్మన్ సింగ్ కపూర్ (Harman Singh Kapoor) ప్రకటించారు. 16 ఏళ్లుగా విజయవంతంగా నడుస్తున్న ఈ రెస్టారెంట్‌ను మూసివేయడానికి గల కారణాలను ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

తాను రెస్టారెంట్ ప్రారంభించిన మొదటి రోజు నుంచే ‘హలాల్’ మాంసాన్ని విక్రయించకూడదని నిర్ణయించుకున్నానని హర్మన్ సింగ్ కపూర్ తెలిపారు. అయితే, తన రెస్టారెంట్‌పై ఓ వర్గం దాడులే ప్రధాన కారణమని పేర్కొన్నారు. హలాల్ మాంసం వడ్డించకపోవడంతో కొందరు వ్యక్తులు పనిగట్టుకుని తన రెస్టారెంట్‌పై వందలాది నెగటివ్, నకిలీ రివ్యూలు ఇచ్చారని, దీంతో వ్యాపారం దెబ్బతిందని ఆయన ఆరోపించారు. ఖలిస్థాన్ (Khalistan) ఉద్యమాన్ని విమర్శిస్తూ గతంలో తాను చేసిన వీడియోల వల్ల కూడా తన కుటుంబంపై, రెస్టారెంట్‌పై దాడులు జరిగాయని ఆయన తెలిపారు. పెరిగిపోతున్న ఖర్చులు, భద్రత లేకపోవడం, లండన్ (London) పోలీసుల నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో తాను రెస్టారెంట్‌ను మూసివేయాలని నిర్ణయించుకున్నట్లుగా హర్మన్ సింగ్ కపూర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే వ్యాపారం కోల్పోయినా పర్వాలేదని, తీవ్రవాదానికి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇకపై పూర్తిస్థాయిలో సామాజిక పోరాటాలపై దృష్టి సారిస్తానని హర్మన్ సింగ్ కపూర్ చెప్పడం విశేషం.

Next Story