టూరిజం గతేం కాను!

by  |
Taj Mahal
X

దిశ, వెబ్‌డెస్క్: ఇదెప్పుడైనా ఊహించామా..! నూటా ముప్పై కోట్ల జనాభా ఉన్న దేశంలో ప్రజలందరూ గడప దాటి బయటకు రాకుండా తలుపులు వేసుకుంటారనీ, వీధిలోకొస్తే చావు భయం వెంటాడుతుందనీ! మొత్తం ప్రపంచాన్నే వైరస్ వలతో చుట్టేసిన కోవిడ్-19 మహమ్మారి ఇప్పుడొక పెద్ద రాకాసిలా నోరు తెరుచుకుని కూర్చుంది. అన్ని రకాల పరిశ్రమలను, రంగాలను కదలనీయకుండా ఆపేసింది. గత రెండు వారాలకు పైగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో దేశంలో పర్యాటక, అతిథ్య రంగాలు ఎన్నడూ లేనంతగా నష్టపోయాయి.

మునుపెన్నడూ లేనంత స్థాయిలో దేశీయ పర్యాటక, అతిథ్య రంగాలు కుదేలయ్యాయని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చెబుతోంది. ఇటీవల టూరిజం శాఖావారు వెల్లడించిన లెక్కల ప్రకారం…జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో విదేశీ పర్యాటకులు 67 శాతం తగ్గారని, దేశీయంగా మన ప్రజల ప్రయాణాలు కూడా 40 శాతానికి పైగా క్షీణించాయని ప్రకటించింది.

దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం హుటాహుటిన లాక్‌డౌన్ ప్రకటించడంతో..హాస్పిటాలిటీ రంగం సుమారు 20 శాతం తగ్గుతుందని, 2020 ఏడాదిలోనే రోజుకు 20 శాతం వరకూ నష్టపోయే ప్రమాదం ఉందని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ తెలిపారు. 2018లో ట్రావెల్, టూరిజం రంగం దాదాపు 2.68 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తూ దేశ స్థూల జాతీయోత్పత్తిలో 9.2 శాతం వాటా దక్కించుకుందని ఆయన అన్నారు. ఇతర మార్గాల ద్వారా ఆదాయం లేని టూరిజం కంపెనీలు కోవిడ్-19 సంక్షోభం కింద కనీసం 6 నెలల వరకూ పన్నులు, ఈఎమ్ఐ, ఉద్యోగుల జీతాల వంటి విషయాల్లో ఊరట కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

ఇటీవల జరిగిన చర్చలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్..ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ కంపెనీలకు రుణాల చెల్లింపుల అంశంలో 6 నెలల మారటోరియం వ్యవధిని ఇవ్వాలని, అంతేకాకుండా సంవత్సరం పాటు జీఎస్టీ మినహాయింపు ప్రకటించి ఆదుకోవాలని కేంద్రంతో మొరపెట్టుకుంది.

పర్యాటక రంగంపై ప్రభావం కారణంగా ఇందులోని పరిశ్రమలు సుమారు రూ. 5 లక్షల కోట్ల నష్టాన్ని చూడాల్సి వస్తుందని, 4 నుంచి 5 కోట్ల ఉద్యోగాల కోత ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రంగంలో ప్రధానమైన ట్రావెల్ ఏజెన్సీలకు మాత్రమే రూ. 1.58 లక్షల కోట్లు నష్టం వాటిల్లే అవకాశముందని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. బ్రాండెడ్ హోటళ్లకు రూ. 1.10 లక్షల కోట్లు, ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీలు రూ. 4,312 కోట్లు, టూర్ ఆపరేటర్లు రూ. 25,000 కోట్లు, అడ్వెంచర్ టూర్ ఆపరేటర్లు రూ. 19,000 కోట్లు, క్రూయిజ్ టూరిజం సుమారు రూ. 420 కోట్లు నష్టపోయే ప్రమాదముందని సమాచారం.

అయితే, ఈ రంగానికి తోడ్పాటు అందించేందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ సులభమైన రుణాలు, రుణాల చెల్లింపులను వాయిదా వేయడం వంటి అంశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. గత నెల మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ ప్యానెల్‌కు రవాణా, పర్యాటక రంగంపై నష్టాల అంచనాలను రూ. 5 లక్షల కోట్ల వరకూ ఉండొచ్చని తెలిపింది.

సాధారణంగా మన దేశంలో అక్టోబర్ నుంచి మార్చి మధ్య పర్యాటకులు అధికంగా వస్తూ ఉంటారు. దేశీయంగా కూడా వేసవి సెలవుల కోసమని, ఆధ్యాత్మిక పర్యటనల కోసమని వెళ్లే వ్యక్తులు అధికంగా ఉంటారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కరోనా కారణంగా రానున్న 12 నుంచి 18 నెలల పాటు పర్యాటక రంగానికి నష్టాలు తప్పవని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.

గతేడాది మొత్తం 1.10 కోట్ల మంది విదేశీ పర్యాటకులు ఇండియాకు వచ్చారు. అయితే, ఈ సంఖ్య అంతకుముందు ఏడాదిలో 1.5 కోట్లు ఉండగా, 2017లో 1.04 కోట్లు అని తెలుస్తోంది. ప్రయాణ ఆంక్షలు, కరోనా మహమ్మారి వ్యాప్తి భయంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో 10 లక్షల మంది మాత్రమే పర్యటించారు. ఇది 2019, ఫిబ్రవరి కంటే 6.6 శాతం తగ్గిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Tags: Coronavirus outbreak, Tourism, Coronavirus, tourism sector



Next Story

Most Viewed