మేడ్చల్ లో దారుణం.. ధాన్యం కొనుగోళ్లపై ప్రశ్నించినందుకు ఎంపీటీసీ శోభపై దాడి..

by Disha Web Desk 11 |
మేడ్చల్ లో దారుణం.. ధాన్యం కొనుగోళ్లపై ప్రశ్నించినందుకు ఎంపీటీసీ శోభపై దాడి..
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధుల మధ్య పొలిటికల్ హీట్ పెరిగింది. జిల్లా కలెక్టరేట్ లో రాష్ట్ర మంత్రి, కలెక్టర్ సాక్షిగా తోటి మహిళా ప్రజాప్రతినిధిని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఈడ్చుకెళ్లిన తీరు విస్మయానికి గురి చేసింది. బీజేపీ మహిళ ప్రజాప్రతినిధిపై బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు దాడికి యత్నించినా డ్యూటీలో ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం ఆందోళనకరంగా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. శనివారం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సన్నహాక సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ అమోయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, అభిషేక్ ఆగస్త్య ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘట్ కేసర్ మండల అంకూషా పూర్ గ్రామ ఎంపీటీసీ శోభ, ఘట్ కేసర్ మండల ఎంపీపీ ఏనుగు నర్సింహారెడ్డిలు మాట్లాడుతూ.. ఓ వైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలలలో రైతులు ఇబ్బందులు పడుతుంటే ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. ధాన్యం కొనుగోళ్లపై ఎంపీటీసీ, ఎంపీపీ మంత్రితో తీవ్ర వాగ్విదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే ఎంపీటీసీ శోభ కాన్పరెన్స్ హాల్ లో పొడియం ముందు బైఠాయించారు. ధాన్యం కొనుగోళ్లను సక్రమంగా చేపట్టాలని డిమాండ్ చేశారు.


ఈ చర్య మంత్రి మల్లారెడ్డికి ఇబ్బందికరంగా మారడంతో బీఆర్ఎస్ మహిళ ప్రజాప్రతినిధులను శోభను బయటకు పంపేయాలని ఉసిగొల్పారు. దీంతో జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య, శామీర్ పేట జడ్పీటీసీ అనిత, కీసర, శామీర్ పేట ఎంపీపీలు ఇందిరా, ఎల్లుబాయిలతో పాటు మరికొంత మంది మహిళా ప్రజాప్రతినిధులు శోభను మూకుమ్మడిగా చుట్టిముట్టి దాడి చేసేంత పనిచేశారు. ఆమెను కాన్ఫరెన్స్ హాల్ లో నుంచి బయటకు ఈడ్చుకుంటూ సమావేశ మందిరం నుంచి బయటకు నెట్టేసీ గేటు పెట్టారు. అదేవిధంగా ఆందోళన చేస్తున్న ఘట్ కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డిని జడ్పీ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డిలు కాన్ఫరెన్స్ హాల్ నుంచి బలవంతంగా బటయకు లాక్కెళ్లారు. దీంతో కాసేపు సమావేశ మందిరంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ వ్యతిరేకంగా బీజేపీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా ఇంత పెద్ద సమావేశం జరుగుతున్నా డ్యూటీలో మహిళ కానిస్టేబుళ్లు లేరు. మహిళ కానిస్టేబుళ్లు లేకపోవడంతో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను నివారించలేక పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాల్సి వచ్చింది. తోటి మహిళ ప్రజాప్రతినిధులను కనికరం లేకుండా ఎంపీటీసీని ఈడ్చుకెళ్లిన తీరును చూసి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ముక్కున వేలేసుకున్నారు. సమావేశం నుంచి బయటకు పంపిన తర్వాత ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, ఎంపీటీసీ శోభతో పాటు మరికొంత మంది బీజేపీ ప్రజా ప్రతినిధులు నాయకులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు.

తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే: ఎంపీపీ

మంత్రి తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు సమావేశం నుంచి మమ్మల్ని బలవంతంగా బయటకు పంపించేశారని ఘట్ కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కోనుగోళ్ల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సంబరాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించినందుకు సమావేశం నుంచి బలవంతంగా బయటకు పంపడం ఎంత వరకు కరెక్ట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులకు రైతులు ఓటేసే పరిస్థితి లేదన్నారు.

మేడ్చల్ లో మంత్రి రూ. వందలాది కోట్లు ఖర్చు చేసినా.. ఒక్కో ఓటుకు రూ.10 వేలు పంచినా గెలిచే పరిస్థితి లేదన్నారు. ఆరుగాలం పండించిన పంటను కొనుగోలు చేసి రైతుకు మేలు చేయాలని అడిగినందుకు బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధుల చేత బీజేపీ పార్టీకి చెందిన ఎంపీటీసీపై దాడి చేయడం ఎంత వరకు కరెక్ట్ అని అన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని, ప్రజాక్షేత్రంలో మంత్రి ఆగడాలను ఎండగడుతామని సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు.


Next Story

Most Viewed