పొగాకు బేరం.. రూ.72 కోట్లకు మాజీ ఎమ్మెల్యే మోసం

by  |
Tobacco deal ex-MLA scam
X

దిశ, వెబ్‌డెస్క్ : పొగాకు వ్యాపారం చేస్తున్నానని ఓ మాజీ ఎమ్మెల్యే ఎస్‌బీఐకి కోట్ల రూపాయలను ఎగనామం పెట్టాడు. అప్పు చెల్లించాలని చెప్పులు అరిగేలా తిరిగినా పట్టించుకోకపోవడంతో సీబీఐని ఆశ్రయించారు బ్యాంకు అధికారులు. దీంతో మాజీ ఎమ్మెల్యేతోపాటు 8 మందిపై సీపీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇంతకూ ఏం జరిగిందంటే..

గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకటరావు గుంటూరు ఎస్‌బీఐ స్పెషలైజ్డ్‌ కమర్షియల్‌ బ్రాంచిలో పొగాకు వ్యాపారం కోసం ఎథ్నిక్‌ ఆగ్రోస్‌ లిమిటెడ్‌ పేరిట రూ.72.17 కోట్ల రుణం తీసుకున్నాడు. దానికి గ్యారెంటీగా చరాస్తులు, స్థిరాస్తులను బ్యాంకుకు చూపించారు. అయితే బ్యాంకు అధికారుల ఎంక్వేరీలో ఆ ఆస్తులకు రుణగ్రహిత చూపించిన ధర లేదని, వాటిల్లో కొని ఆస్తులు అప్పటికే కుదవపెట్టినట్లు గుర్తించారు. దీనిపై తాడిశెట్టి వెంకటరావును ప్రశ్నించినా, లీగల్ నోటీసులు అందించినా స్పందించలేదు. దీంతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను మోసగించారని ఆ బ్యాంక్ డీజీఎం జీవీ శాస్త్రి సీపీఐ అధికారులను ఆశ్రయించాడు.

ఎస్‌బీఐ డీజీఎం ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకటరావు, ఆయన సోదరుడు, మాజీ డిప్యూటీ మేయర్‌ తాడిశెట్టి మురళీమోహన్‌, వారు ప్రమోటర్లుగా ఉన్న ఎథ్నిక్‌ ఆగ్రోస్‌ లిమిటెడ్‌ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. వారితోపాటు కొందరు బ్యాంకు ఉద్యోగులను నిందితులుగా పేర్కొంది. ఐపీసీ 120బీ రెడ్‌విత్‌ 420, 467, 468, 471, అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్‌విత్‌ 13(1)(ఏ) సెక్షన్ల కింద కేసు పెట్టింది.

నేరపూరిత కుట్ర, ఫోర్జరీ, మోసం, నేరపూరిత దుష్ప్రవర్తన కింద అభియోగాలను మోపింది.
తప్పుడు స్టాక్‌ స్టేట్‌మెంట్లు సమర్పించి క్యాష్‌క్రెడిట్‌ ఖాతానుంచి డబ్బులు తీసుకున్నారని, డైరెక్టర్‌ ఖాతాల్లోకి భారీగా నిధులు మళ్లించారని.. నకిలీ ఖాతాలు, ఎంట్రీలు, ఆర్థిక లావాదేవీల స్టేట్‌మెంట్ల ద్వారా మోసానికి తెరలేపారని, ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో ఇది బయటపడిందని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ వివరించింది.

Next Story