టీఎన్జీఓ హౌసింగ్ సొసైటీ@ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం

by  |
టీఎన్జీఓ హౌసింగ్ సొసైటీ@ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం
X

దిశ‌, ఖమ్మం టౌన్: ఖ‌మ్మం జిల్లాకు చెందిన తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారులు (టీఎన్జీఓ) ఉద్యోగుల నివాస స్థ‌లాల కోసం హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు. సొసైటీ మాటున కొంత మంది పెద్ద‌లు సొసైటీలో సభ్యుల‌కు తెలియ‌కుండా కోట్ల రూపాయ‌లు దండుకున్నారు. ప్ర‌భుత్వం సొసైటీకి ఇచ్చిన భూమితో పాటు ప‌క్క‌నున్న క్వారీ స్థ‌లాన్ని సైతం చ‌దును చేసి గుట్టు చ‌ప్పుడు కాకుండా ఆక్ర‌మించి ప్లాట్లు చేసి అమ్ముకున్నారు. దీంతో సొసైటీ పెద్ద‌లు కోట్ల‌లో కూడ‌బెట్ట‌కుని ఉద్యోగ విధుల‌ను సైతం ప‌క్క‌న పెట్టి అందిన‌కాడికి దండుకున్నారు. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజ‌కీయ నాయ‌కులు కూడా వీరి సంపాద‌న కింద దిగ‌దుడుపేన‌ని సొసైటీలోని స‌భ్యులే చెబుతున్నారు. ఉద్యోగుల బాగుగోలు ప‌ట్టించుకున్న ఆనాటి ప్ర‌భుత్వం టీఎన్జీఓ హౌజింగ్ సొసైటీ ఉద్యోగులకు ఒక గూడు ఉండాల‌నే స‌దుదుద్దేశంతో వీరు కోరిన వెంట‌నే జీవో జారీ చేసింది. సొసైటీ అడిగింతే త‌డువుగా అనుమ‌తులు మంజూరు చేసింది. దీన్ని ఆస‌రాగా చేసుకుని ఉద్యోగుల‌కు దక్కా‌ల్సిన ఫ‌లాల‌ను ప‌క్కదారి ప‌ట్టించి బొక్కేశారు. నిబంధ‌న‌ల‌కు తూట్లు పొడిచారు. అధికారుల‌కు, త‌మ అనుచ‌రుల‌కు, త‌మ అడుగుల‌కు మ‌డుగుల ఒ‌త్తే వారికి జిల్లాలో ప‌నిచేసే ఉద్యోగుల‌కు ద‌క్కాల్సిన ఫ‌లాల‌ను రాష్ట్ర వ్యాప్తంగా ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు త‌మ సొసైటీకి సంబంధం లేని వ్య‌క్తుల‌కు ధారా‌ద‌త్తం చేశారు. 2005లో ఆనాటి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్ర‌భుత్వం ఉద్యోగుల ప్ర‌యోజ‌నం కోసం జీవో నెం.144 విడుద‌ల చేసింది. అప్ప‌టిక‌ప్పుడే ఖ‌మ్మం రూర‌ల్ మండ‌లంలోని క‌రుణ‌గిరి ప్రాంతంలో ఏదులాపురం, దాన‌వాయిగూడెం పంచాయ‌తీల ప‌రిధిలోని 103 ఎక‌రాల 26 కుంట‌ల ప్ర‌భుత్వ భూమిని నామిన‌ల్ రేటుకు టీఎన్జీవో హౌజింగ్ సొసైటీ పేరుతో కేటాయించింది.

ఏదులాపురం పంచాయ‌తీలోని స‌ర్వే నెం. 99,100, 105/1,105/2, 106/2/1, 106/2/3, 106/3, 107/3/3 నెంబ‌ర్లలో 54 ఎక‌రాల 15 కుంట‌ల భూమిని, దాన‌వాయిగూడెం పంచాయ‌తీ ప‌రిధిలోని 63/2/3, 64/1, 65/2, ‌66/2, 67, 86 నెంబ‌ర్ల‌లో 49 ఎక‌రాల 11 కుంట‌ల భూమిని సొసైటీకి కేటాయించింది. ఆనాడు 1686 మంది స‌భ్యుల‌తో సొసైటీ ఏర్పాటు జ‌రిగింది. సొసైటీ బైలాలో స‌భ్యుల‌కు మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించాల‌నే నిబంధ‌న ఉంది. సొసైటీ నిబంధ‌న‌ల ప్రకారం ఖ‌మ్మం రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలో క‌నీసం ఐదేళ్లు ప‌ని చేసి ఉండాలి. వారికి మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించాలి. ఇక్కడా నాయ‌కులు త‌మ ప్లాన్ బీ ని అమ‌లు చేశారు. ఎలాంటి నిబంధ‌న‌లు ప‌ట్టించుకోకుండా త‌లా పాపం తిలా పిడికెడు మాదిరిగా పంచుకుని తిన్నారు. ఇంత జ‌రుగుతున్నా అధికారులు వీరిపై చ‌ర్య‌లు ఎందుకు తీసుకోవాడం లేద‌నే ప్రశ్నకు స‌మాధానంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు అడ్డొచ్చినట్టు సమాచారం.

నిబంధ‌న‌లు తుంగ‌లో తొక్కేశారు..

సొసైటీ ఏర్పాటు జ‌రిగి ప్రభుత్వం ఎప్పుడైతే 103 ఎక‌రాల 26 కుంట‌ల స్థ‌లాన్ని కేలాయించిందో నాయ‌కులు ఆశ పుట్టింది. వెంట‌నే వారి లాభాపేక్ష గుర్తుకువ‌చ్చింది. అనుకున్న‌దే త‌డ‌వుగా 1686 మంది ఉన్న సొసైటీని మ‌రో 1400 వంద‌ల మందిన చేర్చుకుని ఒక్కో స‌భ్యుడి 300 గ‌జాలు ద‌క్కాల్సి ఉండ‌గా కేవ‌లం 175 గ‌జాలు ఇచ్చారు. నిబంధ‌న‌లు విరుద్ధంగా వీరిది కాని భూమిని సైతం ప‌క్కనున్న క్వారీ స్థలాన్ని సుమారు 30 ఎక‌రాలు ఆక్రమించుకుని గుట్టు చ‌ప్పుడు కాకుండా చ‌దును చేసి ప్లాట్లుగా విభ‌జించి అమ్ముకున్నారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను తుచా త‌ప్ప‌కుండా పాటించాల్సిన అధికాలే ఇలాంటి నీచానికి పాల్పడ్డారంటే సామాన్య ప్ర‌జ‌లు ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఆనాడు అక్ర‌మంగా ఆక్ర‌మించిన 6 ఎర‌కాల భూమి తిరిగి స్వాధీనం చేసుకోవాల‌ని ఆనాటి క‌లెక్ట‌ర్ లోకేశ్ కుమార్ ఖ‌మ్మం రూర‌ల్ త‌హ‌సీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. కాని ఇప్ప‌టి ఏ అధికారి కూడా ఆ భూమి గురించి ప‌ట్టించుక‌న్న పాపాన పోలేదు. ఎందుకంటే వారంతా ఒకే వ‌ర్గానికి చెందిన‌వారు కాబ‌ట్టి అలా జ‌రిగింద‌ని సామాన్య ప్ర‌జ‌లు అంటున్నారు. సామాన్యుడు గ‌జం స్థ‌టాన్ని ఆక్ర‌మిస్తే రెవెన్యూ అధికారుల‌కు డ్యూటీలు గుర్తుకు వ‌స్తాయి అలాంటిది ఇంత పెద్ద మొత్తంగా ప్ర‌భుత్వ భూమి క‌బ్జాకు గురైతే వారికి ఎందుకు క‌నిపించ‌డం లేద‌నేది ఇక్క‌డ అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌.

తిలాపాపం.. త‌లాపిడికెడు..

టీఎన్జీవో సొసైటీలో జరిగిన అక్ర‌మాల్లో నాయ‌కులు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో సొసైటీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాయ‌కుడు, ఆయ‌న‌తో పాటు ఆయ‌న అనుచ‌రులు ప్ర‌స్తుతం సొసైటీ బాధ్య‌త‌లు చూస్తున్న వ్య‌క్తి, ఉద్యోగ విర‌మ‌ణ చేసిన మ‌రో వ్య‌క్తి ఈ వ్య‌వ‌హారంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సొసైటీ తీవ్రంగా అన్యాయం చేసిన‌ట్లుగా ఆరోపిస్తున్నారు. సొసైటీలో జ‌రిగిన అన్యాయ‌ల‌పై ఓ ఉద్యోగి స్టాంప్ అండ్ రిజిస్ట్రేష‌న్ కమిష‌న్‌కు 2016లో ఫిర్యాదు చేశాడు.

విజిలెన్స్ విచార‌ణ‌..

ఖ‌మ్మం టీఎన్జీవోకు ఆనాటి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్ర‌భుత్వం స‌దుదుద్దేశంతో నామిన‌ల్ రేటుకు కేటాయించింది. కాని కొంత మంది అక్ర‌మార్కులు త‌మ లాభం కోసం సొపైటీలో స‌భ్యులు కాని వారికి అన‌ర్హుల‌కు ఇళ్ల స్థ‌లాలు దొంగ చాటుగా కేటాయించారు. దీంతో కొపోద్రీకులైన కొంద‌రు స‌భ్యులు విజిలెన్స్ అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. స్ప‌దించిన విజిలెన్స్ అధికారులు సొసైటీలో జ‌రిగిన అవ‌క‌త‌క‌వ‌ల‌పై పూర్తి స్థాయి విచార‌ణ చేసి అక్ర‌మాలు జ‌రిగిన మాట వాస్త‌వ‌మ‌ని సొసైటీ అధ్య‌క్షులు, కార్య‌ద‌ర్శిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌‌భుత్వానికి నివేదిక స‌మ‌ర్పించారు. ఇదే నివేదిక‌ను ప్ర‌భుత్వ చీఫ్ సెక్ర‌ట‌రీ, ల్యాండ్ అడ్మినిస్టేష‌న్ చీప్ క‌మిష‌న‌ర్ (సీసీఎల్ ఏ), పంచాయ‌తీ క‌మిష‌న‌ర్, వ‌రంగ‌ల్ రీజియ‌న్ విజిలెన్స్ అధికారి, ల్యాండ్ ఇన్స్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్‌, జిల్లా స‌హ‌కార అధికారుల‌కు పంపారు. అయినా వారి మీద పెద్ద చ‌ర్య‌లు తీసుకోక పోవ‌డం విచార‌క‌రం.

అక్రమార్కుల‌పై చ‌ర్యల‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌లే అడ్డా..

టీఎన్జీఓ హౌజింగ్ సొసైటీలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి అక్ర‌మాలు చోటు చేసుకుంటుంటే జిల్లా అధికార యంత్రాంగం ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప్ర‌తి ఒక్క‌రికీ త‌లెత్తున్న ప్రశ్న.. దీనికి అధికార వ‌ర్గాల్లో వ‌స్తున్న‌స‌మాధానం అతి త్వ‌ర‌లోనే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల రానున్న నేప‌థ్యంలో ఇప్పుడు అక్ర‌మార్కుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటే లేనిపోని ప్ర‌చారం జ‌రిగి ప‌ట్ట‌భ‌ద్రులకు, ఒక వ‌ర్గం ఉద్యోగుల‌కు త‌ప్పుడు స‌మాచారం వెళుతుంద‌ని, అధికార పార్టీకి వ్య‌తిరేక ఓటింగ్ ప‌డే అవ‌కాశం ఉంద‌ని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్నిక‌ల అనంత‌రం వీరిపై గ‌ట్టి చ‌ర్యలు తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, అధికార వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే వీరి చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో ప్ర‌భుత్వం మెత‌క వైఖ‌రి అవ‌లంభిస్తే ఇప్ప‌టికే డ‌బ్బుల‌తోపాటు ప్లాట్లు రాకుండా పోగొట్ట‌కున్న ఉద్యోగులు మాత్రం ప్ర‌భుత్వం గుర్రుగానే ఉన్న‌ట్టు స‌మాచారం. ఈ విధంగా కాక‌పోయి మ‌రో ర‌కంగానైనా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అధికాపార్టీకి వ్యతిరేక ఓటు ప‌డుతుంద‌ని ఉద్యోగులు అభిప్రాయ ప‌డుతున్నారు.


Next Story

Most Viewed