కొత్త ఈవోనైనా.. సమస్యలు తీర్చేనా?

by  |
కొత్త ఈవోనైనా.. సమస్యలు తీర్చేనా?
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ర్టంలో కోవిడ్​ వైరస్​ను నిరోధించండలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా జవహర్​రెడ్డి సేవలు అమోఘం అనిపించుకున్నారు. అందుకేనేమో ప్రభుత్వం ఆయన్ని ఎన్నో సమస్యలకు నిలయమైన తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణాధికారిగా నియమించింది. శనివారం ఉదయం కాలినడకన ఆయన తిరుమల చేరుకుంటారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై జవహర్ రెడ్డి సమీక్షిస్తారు. ఈనేపథ్యంలో టీటీడీలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలు జవహర్​రెడ్డికి సవాలుగా మారనున్నాయి. ఉద్యోగుల సమస్యల నుంచి తిరుమలేశుడ్ని భక్తులకు మరింత చేరువ చేసేందుకు చేపట్టాల్సిన అంశాలు, దేవదేవుడి ఆభరణాల రక్షణ, నిధుల వినియోగంపై అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. వీటన్నింటికీ జవహర్​ రెడ్డి పరిష్కారం చూపగలరనే ఆకాంక్ష అన్ని వర్గాల్లో నెలకొంది. ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానంలో తిష్ట వేసిన సమస్యలను పరిశీలిస్తే..

దర్శనాల్లో పారదర్శకత ఆవశ్యం..

నారాయణుడికి సేవ చేయడమంటే ఆయన్ని తరించే భక్తులకు సేవ చేయడమేనన్నది తిరుగులేని అంశం. నిత్యం వేల మంది దర్శించుకునే భక్తులకు మెరుగైన వసతులు కల్పించడంలో ఇప్పటికి దేశంలోనే టీటీడీ మంచి పేరు తెచ్చుకుంది. కానీ దర్శనాల్లో పారదర్శకత లోపించింది. వీఐపీ దర్శనాల స్లాట్​సమయం పెరిగింది. సాధారణ భక్తుల దర్శన సమయం తగ్గింది. దీన్ని సరిచేయాల్సిన అవసరముంది. అలాగే చైర్మన్​, జేఈవో పరిధిలో నిత్యం ఎన్ని బ్రేక్​దర్శనాలు ఎవరెవరి సిఫారసులతో ఇస్తున్నారనేది బహిర్గతం చేయాలి. అలాగే సేవలు కూడా. దీనిపై భక్తుల్లో ఎన్నో అపోహలు, అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేయాల్సి ఉంది. స్వామి వారి దర్శనానికి ఎప్పటి నుంచో ఎక్స్​లేటర్​ సౌకర్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. రద్దీ సమయంలో పసిపిల్లలు, వృద్ధులే కాదు. మిగతా వయసులవారూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్సలేటర్​ ఏర్పాటు చేస్తే ప్రశాంతంగా ఏడుకొండల స్వామిని దర్శించుకుంటారు. కోవిడ్​ అన్​లాక్​తో భక్తుల రాక మరింత పెరిగే అవకాశముంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరింత కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంది.

నిధుల వినియోగంపై..

భక్తులు సమర్పించే కానుకలు, హుండీ ఆదాయాన్ని ఇప్పటిదాకా హిందూ ధర్మ రక్షణ పేరుతో దేశం నలుమూలల్లో గుళ్లు, కల్యాణ మండపాలు నిర్మిస్తున్నారు. మఠాలకు, పీఠాలకు నిధుల పందేరం కొనసాగుతోంది. విదేశాల్లో స్వామి వారి కల్యాణాలు నిర్వహిస్తున్నారు. వాటికెంత ఖర్చు పెడుతున్నారో తెలీదు. ఈ ఖర్చుపై అనేక వదంతులున్నాయి. అనేక ప్రాంతాల్లో ఆస్తులున్నా నిర్లక్ష్యం వల్ల జీర్ణోద్దారణకు చేరుకున్న ఆలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకొస్తున్నారు. ఇది సరి కాదని ఎందరో భక్తులు మొత్తుకుంటున్నారు. తాము ఇచ్చే కానుకలు, హుండీలో వేసే ముడుపులు విశాల జన బాహుళ్యానికి ఉపయోగపడాలని భావిస్తున్నారు. ఇప్పటిదాకా ఏలిన ప్రభుత్వాలు ప్రజలకు విద్య, వైద్య సదుపాయాలను దూరం చేశాయి. మార్కెట్ శక్తులకు వదిలేశాయి. నేడవి సాధారణ ప్రజలకు తలకు మించిన భారంగా మారాయి. ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక సమస్యలున్నా ఈ రెండు సదుపాయాలను ప్రజలకు అందించేందుకు నానాతంటాలు పడుతోంది. అందుకే ఈ రెండు రంగాలను మరింత విస్తరించడానికి భక్తుల కానుకలు వినియోగించాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం తిరుపతిలో నెలకొల్పిన ఆస్పత్రులు, విద్యాలయాలే గాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని విద్యా సంస్థలు, ఆస్పత్రులు నిర్మించాలని భక్తులు కోరుకుంటున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతో తమ బిడ్డ బాగా చదువుకున్నాడని, ఆస్పత్రిలో మంచి వైద్యం పొందగలిగామని భక్తులు భావిస్తారు. అలాంటి అవకాశాన్ని కేవలం తిరుపతి వాసులకే పరిమితం చేయకుండా రాష్ర్ట వ్యాప్తం చేయాలని ఆశిస్తున్నారు.

అపరిష్కృతంగా ఉద్యోగుల సమస్యలు..

గత ప్రభుత్వాలు అత్తెసరు వేతనాలు చెల్లిస్తూ వెట్టి చాకిరీ చేయించుకునే కాంట్రాక్ట్​అవుట్​సోర్సింగ్​ విధానాన్ని టీటీడీలో కూడా గత ఇరవై ఏళ్ల నుంచి అమలు చేస్తున్నారు. దీనికి ఫుల్​స్టాప్​పెడతామని ధర్మకర్తల మండలి చైర్మన్​వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టే నాడే హామీ ఇచ్చారు. ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదు. టీటీడీలో దాదాపు రెగ్యులర్​ ఉద్యోగుల కన్నా రెండింతలు ఎక్కువగా ఉన్నారు. సుమారు 14 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీళ్లకు పని బారెడు.. వేతనాలు మూరెడుగా ఉన్నాయి. టైమ్​స్కేలు హామీ అమలు కాలేదు. ఇటీవల కాంట్రాక్టు ఉద్యోగులందర్నీ ఆప్కాస్​లో విలీనం చేస్తామన్నారు. దానికి వాళ్లు అంగీకరించలేదు. దాదాపు రెండు నెలలపాటు ఆందోళనకు దిగారు. చివరకు ఓ కమిటీని వేశారు. రెగ్యులర్​ ఉద్యోగుల కన్నా రెండింతలు అదనంగా పనిచేస్తున్న వీళ్ల సమస్య పరిష్కరించాల్సి ఉంది. అలాగే రెగ్యులర్​ ఉద్యోగులు ఎప్పటి నుంచి ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు. అది ఇంతవరకు హామీ గడప దాటలేదు.

స్వామి వారి ఆభరణాల భద్రతపై..

శ్రీవారి ఆభరణాలు, వజ్రాలు, వైఢుర్యాలపై ఎప్పటి నుంచో ఎడతెగని వివాదాలున్నాయి. ఇక్కడ అర్చకుల్లో రెండు గ్రూపులున్నాయి. ఒకదానికి రమణ దీక్షితులు నాయకత్వం వహిస్తుంటే.. మరోదానికి డాలర్​శేషాద్రి నాయకునిగా కొనసాగుతున్నారు. వీళ్ల మధ్య విభేదాలు అటుంచితే స్వామి వారి కెంపు వజ్రం మాయమైందని గతంలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. నాటి ధర్మకర్తల మండలి చైర్మన్​ కరుణాకర్​రెడ్డి అసలెన్ని ఆభరణాలున్నాయో అన్నింటిని బహిర్గతం చేస్తామని ప్రకటించారు. ఇప్పటికీ అది అమలుకాలేదు. అసలు ఎన్ని అభరణాలున్నాయి.. ఏవి మిస్సయ్యాయనేది లెక్కలు తేల్చాల్సి ఉంది. ఆభరణాల భద్రతపై ఆంజనేయులు కమిటీ వేశారు. గతంలో వేసిన జగన్నాధ, వాధ్వా కమిటీలకు అతీగతీ లేదు. మొన్నటి ఎన్నికల సమయంలో ఎలాంటి పత్రం లేకుండా బ్యాంకుల నుంచి సుమారు 1400 కిలోల బంగారాన్ని బయటకు తీసుకొస్తుంటే చెన్నై పోలీసులకు పట్టుబడింది. ఇలా ఎంత బంగారం బయటకు పోయిందో లెక్క లేదు. ఇప్పటికైనా అసలు స్వామి వారి నగనట్రా ఏమిటనేది భక్తులకు వెల్లడించాల్సిన అవసరముంది.

ఇంకా..

కొండపై విచ్చల విడిగా మఠాలు ఏర్పాటు చేసుకోవడానికి స్థలాలు కేటాయిస్తున్నారు. ఇది అనేక వివాదాలను సృష్టిస్తోంది. స్వామి నిధులకు కన్నం వేయడానికే మఠాలు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. స్వామివారి గర్భగుడికి అత్యంత సమీపంలో బూంది పోటు ఉంది. దీంట్లో నిత్యం అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడే ప్రసాద వితరణ జరుగుతోంది. భక్తుల భద్రత దృష్ట్యా దీన్ని ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా మరోచోటకు తరలించాల్సిన అవసరముంది. అలాగే ప్రజల సొమ్ముతో నడిచే ప్రభుత్వాలు ఆర్టీఐ పరిధిలో ఉన్నాయి. అలాంటిది భక్తుల కానుకలతో నడిచే టీటీడీ కూడా ఆర్టీఐ పరిధిలో ఉండాలి. గతంలో ఎక్కడో కేరళలోని ఓ గుడికి సంబంధించి ఇచ్చిన న్యాయస్థానం తీర్పును అడ్డం పెట్టుకొని ఇప్పటిదాకా టీటీడీ ఆర్టీఐని నిరాకరిస్తూ వచ్చింది. నిధులు, సేవలు, పనుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలంటే టీటీడీని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలి.

Next Story

Most Viewed