గ్రేటర్ కుర్చీ@ ఆ ముగ్గురు మగువల పోటాపోటీ..

by  |
గ్రేటర్ కుర్చీ@ ఆ ముగ్గురు మగువల పోటాపోటీ..
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ మేయర్ సీటు ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. మేయర్ చైర్ పై కూర్చొని అధ్యక్షా అనిపించుకోవడానికి తీవ్ర పోటీ పడుతున్నారు. మేయర్ పీఠం కోసం ఓవైపు ప్రస్తుత ప్రజాప్రతినిధులు, మరో వైపు మాజీ ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగుతున్నారు. రిజర్వేషన్ జనరల్ మహిళ కావడంతో చాలా మంది మేయర్ పీఠంపై ఆశలు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నగర మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి బీజేపీలోకి చేరుతున్నారు. టీఆర్ఎస్ నుంచి ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ పద్మారావు కుటుంబం నుంచి ఒకరు రంగంలోకి దిగుతున్నారు. అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి రెడ్డి, ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి మేయర్ పదవే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఎంఐఎం నుంచి అనాదిగా మేయర్ ఎవరనే సంకేతాలు వెలువడవు. ఎంపీ అసదుద్దీన్ అనుకున్న వారికే మేయర్ పదవి దక్కుతుందనేది బహిరంగ రహస్యం.

పోటాపోటీ..

మేయర్ పదవిని దక్కించుకోవడమే ప్రధాన లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నుంచి బండ కార్తీక రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఆమె కాంగ్రెస్ నుంచి వెళ్లి కాషాయం కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఖరారైంది. తార్నాక డివిజన్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సైతం తన కూతురు లేదా కోడలిని బౌద్ధనగర్ లేదా తార్నాక డివిజన్ నుంచి రంగంలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం ఉన్నది. ఈ క్రమంలోనే బేగంపేట డివిజన్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా తన కుటుంబం నుంచి ఒకరిని రంగంలోకి దింపే యోచనలో ఉన్నట్టు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు, ప్రస్తుత అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి రెడ్డి పేరు సైతం తెరపైకి వచ్చింది. వారికి స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పూర్తి మద్దతునిస్తున్నారని చర్చకు తెరలేచింది.

టీఆర్ఎస్‌లో త్రిముఖ పోటీ..

అధికార పార్టీలోనే ఇతర పార్టీలకన్నా ఎక్కువ మంది మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నారు. ఒకరికి మించి మరొకరు పోటీ పడుతున్నారు. ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవిని మేయర్ పదవి కోసమే చర్లపల్లి డివిజన్ నుంచి బరిలో నిలుపుతున్నారనేది ఆ పార్టీ వర్గాలే వెల్లడిస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ పద్మారావు కుటుంబ సభ్యులు సైతం మేయర్ పదవిని ఆశిస్తూ ఎన్నికల రంగంలోకి దిగుతున్నట్టు ప్రచారం ఉన్నది. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డికి గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా మైనంపల్లి హన్మంతరావుకు ఇచ్చారు. అయితే అప్పటికే కనకారెడ్డి కోడలు విజయశాంతిరెడ్డిని కార్పొరేటర్ గా గెలిపించుకున్న కనకారెడ్డి టికెట్ రాకున్నా.. పార్టీ మారకుండా టీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అసెంబ్లీ టికెట్ ఆపినందున ఈసారి మేయర్ పదవి జనరల్ మహిళగా ఉండటంతో ఆమె పేరు సైతం తెరపైకి వచ్చింది. దీంతో ఈ ముగ్గురు మేయర్ కోసం పోటీ పడటం ఖాయంగా కనిపిస్తున్నది.



Next Story