బట్టలతో పరువు.. ఎన్నాళ్లీ బరువు..?

by  |
బట్టలతో పరువు.. ఎన్నాళ్లీ బరువు..?
X

దిశ, ఫీచర్స్: అమ్మాయిలు ఇలాంటి దుస్తులే ధరించాలని ఎవరు డిసైడ్ చేశారు? పబ్లిక్‌లో తిరిగేటప్పుడు ఇలాగే ఉండాలని నిర్ణయించింది ఎవరు? మహిళల వస్త్రధారణను కులం, మతం డిసైడ్ చేస్తుందా? చీర మీద బ్లౌజ్ ధరించకపోతే సాంప్రదాయ తప్పిదమా? మహిళా నాయకురాలు పార్లమెంట్‌ సమావేశాలకు అటెండ్ కావాలంటే డ్రెస్ కోడ్ ఫాలో కావాలా? ప్రధానమంత్రి ముందు కూర్చోవాలంటే దేశానికి నచ్చినవిధంగా డ్రెస్ చేసుకోవాలా? బీచ్‌లో వాలీబాల్ ఆడేటప్పుడు షార్ట్ కాదు బికినీ వేసుకోవాలంటారు.. అదే టెన్నిస్ ఆడేటప్పుడు షార్ట్ ధరిస్తే అదేం పోయేకాలం అని మాట్లాడతారు. గర్భిణులు ప్యాంట్- షర్ట్ వేయొద్దని కామెంట్ చేస్తారు. అదే కంఫర్ట్‌ క్లాత్స్ ధరిస్తే.. ఏంటి బెలూన్‌లా ఉబ్బిపోయావ్.. డ్రెస్ సెన్స్ లేదా అంటారు. మరి ఇంతకీ ఇన్ని రకాలుగా మాట్లాడేవారికి సెన్స్ ఉందా?

భర్త అంత్యక్రియల్లో మందిరా బేడీ డ్రెసింగ్‌పై ట్రోల్స్

భర్త మరణించి పుట్టెడు దు:ఖంలో మందిరా బేడీ ఉంటే.. భవిష్యత్తును ఒంటరిగా ఎలా ఎదుర్కొంటుందో ఆలోచించకుండా కామెంట్స్‌ మొదలుపెట్టారు కొందరు వ్యక్తులు. సాంప్రదాయాలను కూడా పట్టించుకోకుండా భర్త మీద ప్రేమతో చితికి నిప్పు పెట్టేందుకు సిద్ధమైన తన ఉన్నత ఆలోచన గురించి పట్టించుకోకుండా.. ఆ డ్రెస్ సెన్స్ ఏందంటూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. భర్త అంత్యక్రియల్లో ప్యాంట్ షర్ట్ వేసుకుని తిరగడమేంటని ఇష్టారీతిన అసభ్యంగా మాట్లాడారు. అంత్యక్రియల సమయంలో మహిళలు జీన్స్, టీ షర్టు ధరించకూడదని ఏ ధర్మశాస్త్రం చెప్పింది? దాన్ని అగౌరవంగా ఎందుకు భావించాలి? భర్త చనిపోతే బొట్టు తీసేసి, గాజులు పగలగొట్టుకుని, తెల్లచీర చుట్టుకుని ఏడుస్తూ కూర్చోవాలా? ధైర్యంగా ముందుకు సాగకూడదా? ఇలా చేయకూడదని ఏ పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి?

షార్ట్ వేసుకున్న నీనా గుప్తాపై విమర్శలు

నీనా గుప్తా సక్సెస్‌ఫుల్ యాక్టర్.. అంతకు మించి ది బెస్ట్ సింగిల్ పేరెంట్. లైఫ్‌లో పడరాని పాట్లు పడుతూ ఒంటరిగా బిడ్డను పెంచిన శక్తివంతమైన మహిళ. ఈ మధ్య తన ఆత్మకథ ‘సచ్ కహూ తో’ ద్వారా రచయితగా మారింది. అందులో సింగిల్ పేరెంట్ కష్టాలను వివరిస్తూ.. అమ్మాయి ఎంత పవర్‌ఫుల్‌గా ఉండాలో సజెషన్స్‌తో పాటు ఎలా ఉండకూడదనే వార్నింగ్ కూడా ఇచ్చింది. అలాంటి ఇన్‌స్పిరేషనల్ లేడీ ఏ డ్రెస్ వేసుకుంటే ఎందుకు? ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు అయ్యో ఎంత కష్టపడుతున్నావని ఓదార్చని సమాజం.. ఆమె డ్రెసింగ్ సెన్స్ గురించి ఎందుకు ప్రశ్నించాలి. 60 ఏళ్ల వయసులో ఉన్న మహిళ షార్ట్ వేసుకోకూడదనే నిబంధన ఎక్కడైనా ఉందా? అందుకే నీనా గుప్తా ‘నేను కేవలం ముగ్గురు నలుగురికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇలాంటి వారిని పట్టించుకుని టైమ్ వేస్ట్ చేసుకోను’ అని హేటర్స్‌కు సమాధానమిచ్చింది.

ప్రియాంక చోప్రా ఏ డ్రెస్ వేసుకున్నా తప్పే

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఎలాంటి డ్రెస్ వేసుకున్నా తప్పే అంటారు. సోషల్ సర్వీస్ చేస్తే ప్రపంచవేదికపై ఇండియన్స్ పేరు నిలబెడుతోందని పొగిడిన వారే.. అదే ప్రపంచంతో తాను అప్‌డేట్ అయితే మాత్రం తప్పుపడతారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసినప్పుడు సాంప్రదాయ చీరలో వెళ్లాలని రాజ్యాంగంలో రాసుందా? మోకాళ్ల వరకు డ్రెస్ వేసుకుని వెళ్తే తప్పు అని కానిస్టిట్యూషన్‌లో రూల్‌ ఉందా? తన డ్రెసింగ్ తనకు నచ్చిన విధంగా ఉండటంలో తప్పేముంది? ఓ మొబైల్ చేతిలో పట్టుకుని పదాలను టైప్ చేస్తూ.. ఆమె సంపాదించిన ఖ్యాతిలో వన్ పర్సెంట్ కూడా సంపాదించని వారే.. ఆమె డ్రెసింగ్, నిలబడటం, కూర్చోవడం అంటూ తప్పులు వెతికే పనిలో నిమగ్నమైపోతారు.

ఇక ఓ ఫొటో షూట్ కోసం ప్రియాంక బ్లౌజ్‌లెస్ శారీ వేసుకుంటే దానికి వారం రోజుల పాటు ట్రోల్స్. ఇన్‌స్టైల్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ప్రపంచాన్ని కొంచెమైనా మార్చేందుకు ప్రయత్నిస్తా’ అని చెప్పింది. దీనికే ఇదేదో పెద్ద తప్పని దారుణంగా కామెంట్స్ చేశారు. ‘హాఫ్ న్యూడ్‌గా కనిపిస్తూ కొంచెం ప్రపంచాన్ని చేంజ్ చేసిన ప్రియాంక.. ఫుల్ న్యూడ్‌గా కనిపిస్తే ప్రపంచం మొత్తాన్ని మారుస్తుందేమో’ అంటూ సెటైర్లు వేశారు. అది సాంప్రదాయానికి విరుద్ధమంటూ మరికొందరు నీతులు వల్లించారు. ఏ.. గిరిజన జాతుల్లో ఇలాంటి సంస్కృతి లేదా?

మహిళా నాయకులు చీరలే ధరించాలా?

బెంగాలీ యాక్ట్రెస్, సింగర్ అయిన మిమీ చక్రవర్తి లోక్‌సభకు ఎంపికైంది. 2016, 2020లో కోల్‌కతా మోస్ట్ డిజైరబుల్ ఉమన్‌గా నిలిచిన ఆమె.. జీన్స్, టీ షర్టు ధరించి పార్లమెంట్ సమావేశాలకు హాజరైంది. దీంతో ట్రోలర్స్ తమ పని మొదలుపెట్టారు. పార్లమెంట్ సాక్షిగా ఇండియా పరువు తీస్తో్ందంటూ తిట్టిపోశారు. మహిళా నాయకురాలై ఉండి, ఇంత మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె.. ఇలాంటి డ్రెస్‌లతో పరువు తీస్తోందని మండిపడ్డారు. ఇంకొందరైతే పోర్న్ స్టార్‌కు పార్లమెంట్ కరెక్ట్ కాదంటూ కామెంట్ చేశారు. అంటే ఒక పాపులర్ యాక్ట్రెస్ రాజకీయ నాయకురాలిగా మారడం, మారకపోవడం దుస్తులు నిర్ణయిస్తాయా? లేక తాము సూచించిన దుస్తులే ధరించాలని కొందరు పురుషులు వితండవాదం చేస్తున్నారా?

https://image.scoopwhoop.com/w620/s3.scoopwhoop.com/anj2/60f93d968a373a4c8e90d3f6/8585b854-6a4d-40bf-aee5-3a288beff72a.jpg.webp

ఇక ఫిన్‌లాండ్ ప్రైమ్ మినిస్టర్ సనా మారిన్ ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం లో-కట్ జాకెట్ వేసుకున్నందుకు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు. ఒక పొలిటీషియన్ అయి ఉండి, హీరోయిన్‌లా అంత ట్రెండీగా డ్రెస్ ధరిస్తుందా? అసలు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటుంది? అని ట్రోల్ చేశారు.

సన్నగా ఉంటే బికినీ వేసుకోవద్దా?

బొద్దుగా ఉంటే ‘జీరో సైజ్’ సూపర్ అంటారు. మరో సైజ్‌కు చేంజ్ అయితే సన్నగా శవంలా ఉందని కామెంట్ చేస్తారు. జీరో సైజ్‌ ఉన్నవారు బికినీ వేసుకుంటే ఇక కామెంట్లకు హద్దే ఉండదు. ఇలాంటి కామెంట్స్ ఎదుర్కొన్న లిస్ట్‌లో హీరోయిన్ సోనమ్ కపూర్, టెలివిజన్ యాక్ట్రెస్ అనెరి వజని ఉన్నారు. సోనమ్ అమ్మాయి కాదు అబ్బాయి అని.. అందుకే భర్త ఆనంద్ ఆహుజా సోనమ్ చుట్టూ తిరగకుండా బాస్కెట్ బాల్ కోర్టుల చుట్టూ తిరుగుతుంటాడని ట్రోల్ చేశారు.

సెలబ్రిటీల ప్రెగ్నెన్సీ డ్రెసింగ్‌పై కూడా ట్రోల్స్

కరీనా కపూర్ ఖాన్, సమీరా రెడ్డి, సానియా మీర్జా లాంటి సెలబ్రిటీలు ప్రెగ్నెన్సీ టైమ్‌లో కంఫర్ట్‌గా ఉంటూ.. ఎలాంటి ఆలోచన లేకుండా హ్యాపీగా ఉండాలని మెసేజ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో కరీనా ఓ పెయిడ్ పార్టనర్‌షిప్ యాడ్ కోసం స్పోర్ట్స్ డ్రెస్, బ్రా ధరించి ప్రచారం చేసింది. దీనికి కూడా మహిళలు, కులం, మతం అనే రంగులు పులుముతూ ఇష్టారీతిన మాట్లాడారు. ఇక సానియా మీర్జా టెన్నిస్ కోర్టులో షార్ట్ వేసుకుంటే అతిపెద్ద తప్పని సీన్ చేసిన వారు.. ఆమె ప్రెగ్నెన్సీ టైమ్‌లో లాంగ్ డ్రెస్ వేసుకుంటే బెలూన్‌లా కనిపిస్తోందని కామెంట్ చేశారు.

ఇండియన్ ఉమన్ అలా వేసుకుంటారా?

క్రికెటర్ మిథాలీ రాజ్ భారతీయ మహిళా క్రికెట్ టీమ్‌ను ముందుండి నడిపించింది. తన విజయాలతో భారత్‌కు గొప్పపేరు తీసుకొచ్చింది. అలాంటి ఆమె ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేసే సమయంలో ట్యాంక్ టాప్ వేసుకున్నందుకు.. భారత స్త్రీ అయి ఉండి అలాంటి డ్రెస్ ఎలా వేసుకుంటుంది.. మన పరువు తీస్తోందని ట్రోల్ చేశారు.

Next Story

Most Viewed