కరోనా లెక్కల్లో పారదర్శకత లేదు

by  |
కరోనా లెక్కల్లో పారదర్శకత లేదు
X

– సరైన లెక్కలతోనే విపత్తును నివారించొచ్చు
– కేంద్ర బృందానికి డాక్టర్ల విజ్ఞాపనపత్రం

దిశ, న్యూస్ బ్యూరో: వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం ఆశించిన ఫలితాలు ఇవ్వాలంటే.. కరోనా పాజిటివ్ పేషెంట్ల లెక్కల్లో ప్రభుత్వాలు వాస్తవాలను వెల్లడించాలని, పారదర్శకత పాటించాలని కేంద్ర బృందానికి డాక్టర్ల ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం వెల్లడిస్తోన్న లెక్కలుగానీ, వివరాలుగానీ అనుమానాలకు తావిచ్చే విధంగా ఉంటున్నాయే తప్ప ఎక్కడా పారదర్శకత లేదని ‘డాక్టర్స్ ఫర్ సేవ’ పేరుతో ఏర్పడిన వైద్యుల బృందం లిఖితపూర్వకంగా కేంద్ర బృందానికి వివరించింది. ఇందులో ప్రధానంగా నాలుగు అంశాలను ప్రస్తావించింది. ‘తక్కువ టెస్టులు చేస్తూ పాజిటివ్ పేషెంట్ల సంఖ్యను తక్కువగా చూపిస్తోంది, సరైన గణాంకాలు ఇవ్వకుండా వాస్తవాలను తొక్కిపెడుతోంది, బహిర్గతం చేస్తున్న లెక్కలకంటే పాజిటివ్ పేషెంట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, లాక్‌డౌన్ ఎత్తివేసే నాటికి పాజిటివ్ పేషెంట్లను గుర్తించకపోతే ఆ తర్వాత విస్తృతంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది..’ లాంటి అంశాలను ఆధారాలతో సహా వివరించింది.

కరోనా వైరస్‌పై యుద్ధం చేయడమంటే.. కేవలం లాక్‌డౌన్‌ను పాటించడం ఒక్కటే కాదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినట్లుగా టెస్ట్, ట్రేస్, ఐసొలేట్, ట్రీట్ అనే విధానాలను పాటించాల్సి ఉందని ఈ బృందం పేర్కొంది. ఇప్పటికైనా వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించి ఐసొలేట్ చేయడం ద్వారానే ఈ వైరస్ ఇతరులకు సోకకుండా ఉంటుందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడం తమ ఉద్దేశం కాదని, అయితే ప్రజల ఆరోగ్య భద్రతను, వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ లేఖ రాయాల్సి వచ్చిందని వివరించారు.

ఐసొలేషన్ వార్డుల కొరత

రాష్ట్రంలో కరోనా వైరస్‌తో పోరాడే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంవైపు నుంచి చాలా అంతరాలు, లోపాలు ఉన్నాయి. ఒక పాజిటివ్ కేసుతో ప్రైమరీ కాంటాక్టులో ఉన్న అనుమానితులను డార్మెటరీలు, జనరల్ వార్డుల్లో ప్రభుత్వం ఉంచుతోంది. వైద్య సిబ్బంది వాడే మరుగుదొడ్లనే వాడటం వల్ల ఇన్‌ఫెక్షన్‌కు గురవడమే కాకుండా ఆ వార్డుల్లోని సాధారణ రోగులకు కూడా వైరస్ సోకే అవకాశం ఉంది.

తక్కువ టెస్టులు..

దేశంలో మరే రాష్ట్రంతో పోల్చుకున్నా తెలంగాణలోనే తక్కువ టెస్టులు జరుగుతున్నాయి. అందుకే చాలా తక్కువ కేసులు నమోదైనట్లుగా లెక్కలు కనిపిస్తున్నాయి. ఎలాంటి లక్షణాలు లేకుండా కూడా పాజిటివ్ నిర్ధారణ అవుతున్నందువల్ల భారీ సంఖ్యలో టెస్టులు జరగాల్సిన అవసరం ఉంది. టెస్టులు మరింత ఎక్కువగా చేస్తేనే చాలా పాజిటివ్ కేసులు బయటకు వస్తాయి. లేదంటే అవి లెక్కల్లోకి రాకుండా పోతాయి. ఫలితంగా లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత విస్తృత స్థాయిలో ప్రజా సమూహంలోకి వ్యాపించే ప్రమాదం ఉంది. అనుమానితులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలంటే ఉన్నతాధికారుల నుంచి అనుమతి రావాలంటూ వైద్యులు చెబుతున్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ఐసీయూ వార్డుల్లో ఉన్న పేషెంట్లకు తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉంది. కానీ తెలంగాణలో అలా జరగడంలేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇలాంటి పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కానీ ఇతర వ్యాధులకు సంబంధించి సీటీ స్కాన్, ఎక్స్‌రే చేస్తున్న సందర్భంలో రేడియాలజిస్టులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. సూర్యాపేట జిల్లాలో స్థానికంగా ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకి తక్కువ వ్యవధిలో 83 పాజిటివ్ కేసులు వెలుగు చూసినా.. ఈ నెల 23వ తేదీ నుంచి ఎలాంటి టెస్టులూ జరగడంలేదు. దీంతో కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడంలేదు.

కంటైన్‌మెంట్ జోన్లలో గర్భిణులకు టెస్టులు జరగడంలేదు..

ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్న గర్భిణులకు లక్షణాలు లేకున్నా కరోనా పరీక్షలు నిర్వహించాలి. రోగ నిరోధక శక్తిని దృష్టిలో పెట్టుకుని ఐసీఎంఆర్ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ కంటైన్‌మెంట్ జోన్ల నుంచి సుల్తాన్ బజార్‌లోని ప్రభుత్వాస్పత్రి, పేట్లబురుజు, నీలోఫర్ ఆస్పత్రులకు వస్తున్న గర్భిణులకు కరోనా పరీక్షలు జరగడంలేదు. దీంతో సాధారణ వార్డుల్లోని మహిళలతో కలిసి ఉండటం ద్వారా కరోనా ఉన్నట్లయితే వ్యాపించే ప్రమాదం ఉంది. కనీసం కంటైన్‌మెంట్ జోన్ల నుంచి వచ్చే గర్భిణులకు ప్రత్యేకంగా ఔట్ పేషెంట్ విభాగం ఏర్పాటు చేయడం ద్వారా ఇతర మహిళలతో కలిసే అవకాశం ఉండదు.

కరోనా మృతుల్లో లోపాలు..

కరోనా కారణంగా చనిపోతున్నవారి వివరాలను ప్రభుత్వం పారదర్శకంగా వెల్లడించడంలేదు. గాంధీ ఆస్పత్రిలో 80 ఏళ్ళ వృద్ధుడొకరు ఏప్రిల్ 26న మృతి చెందాడు. కానీ ఆ రోజు ప్రభుత్వ బులెటిన్‌లో ఇతని పేరు లేదు. మృతుడికి ఇచ్చిన డెత్ సర్టిఫికెట్‌లో మాత్రం కరోనా పేషెంట్ అని వైద్యులు పేర్కొన్నారు. పైగా గాంధీ ఆస్పత్రి కేవలం కరోనా పేషెంట్ల కోసమే ఉన్నందున ఏడో వార్డులో ఉన్నవారంతా పాజిటివ్ పేషెంట్లే. అయితే ఆ వార్డులో మృతి చెందిన ఈ వృద్ధుడి పేరు మాత్రం కరోనా మృతుల జాబితాలో చేర్చలేదు. ఇలాంటివి అనేకం చోటుచేసుకుంటున్నాయి. ఇతర వ్యాధుల కారణంగా చనిపోయినా కరోనా నిర్ధారణ కోసం మరణం తర్వాత శాంపిల్ తీసుకోరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఈ ఉత్తర్వులకు సంబంధించి ఎక్కడా ఏ మార్గదర్శకాలు లేవు.

పారదర్శకతలో లోపం..

ఇతర రాష్ట్రాలు విడుదల చేస్తున్న బులెటిన్లలో ఒక పాజిటివ్ పేషెంట్‌కు సంబంధించిన ట్రావెల్ హిస్టరీ, ప్రైమరీ కాంటాక్టుల వివరాలన్నీ ఉంటున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వ బులెటిన్లలోగానీ, వెబ్‌సైట్‌లోగానీ అవి లేవు. ఇప్పటిదాకా ఎన్ని టెస్టులు జరిగాయో స్పష్టత లేదు. ఏప్రిల్ 30వ తేదీనాటికి ప్రభుత్వం 19,278 టెస్టులు నిర్వహించగా 1016 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రతీ పది లక్షల మందికి కేవలం 551 టెస్టులు మాత్రమే జరుగుతున్నాయి. ఏప్రిల్ చివరి వారంలో తక్కువ పరీక్షలు జరిగినందువల్ల సగటున రోజుకు 15 కంటే ఎక్కువ కేసులు ఉన్నట్లు నమోదు కావడంలేదు.

Tags: Telangana, Corona, Under-Reported, Under-Tested, Positive, Transparency, Central Team

Next Story

Most Viewed