ఆర్టీసీ కార్మికులకు జీతాల్లేవ్​

by  |
ఆర్టీసీ కార్మికులకు జీతాల్లేవ్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో రెండో ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు పైసల్లేవ్. ఫలితంగా ఈ నెలలో ఇవ్వాల్సిన జనవరి నెల వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల వేతనాల కోసం నెలకు దాదాపు రూ.130 కోట్లు కావాలి. కానీ ఈ వేతనాలు ఇచ్చేందుకు డబ్బులు లేక పోవడంతో ఇంకా సర్కారు సాయం కోసం చూడాల్సి వస్తోంది.

ఐదు నెలలుగా అంతే

గడిచిన ఐదు నెలల నుంచి ఆర్టీసీ కార్మికులు జీతాలు ఎప్పుడు జమ అవుతాయని ఆశతో చూస్తున్నారు. ప్రతినెలా 13 నుంచి 16వ తేదీ వరకు వేతనాలు వేస్తున్నారు. గత నెలలో మరీ అధ్వాన్నంగా మారింది. ఉన్న సొమ్ములో కొంతమందికి జీతాలు వేశారు. మరికొంతమందికి సర్కారు సాయం అందిన తర్వాత జమ చేశారు. దీంతో ఎప్పుడు ఎవరి ఖాతాల్లో వేతనం జమ అవుతుందనేది తెలియని పరిస్థితి నెలకొంది. గత నెలలో 12న కొంతమందికి వేయగా… ఆ తర్వాత మరికొంతమందికి వేతనాలిచ్చారు. ఈ నెల కూడా రెండు వారాలు గడిచినా వేతనాలు రాలేదు. వేతనాల అడ్జెస్ట్​మెంట్​లో భాగంగా ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యం చేతిలో రూ. 22 కోట్లు ఉన్నట్లు చెప్పుతున్నారు. ఇంకా కావాల్సిన రూ.110 కోట్లు ఆర్థిక శాఖ నుంచే అందాలి. జీతాల కోసం ఆర్టీసీకి బడ్జెట్​లో కేటాయించిన పద్దులో నుంచి కొంత కొంత ప్రభుత్వం ఇస్తున్న విషయం తెలిసిందే.

సీఎం అనుమతి కావాలి కదా…!

ప్రస్తుతం ఆర్థిక శాఖ నుంచి రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే సీఎం నుంచి అనుమతి వస్తేనే ఎలాంటి వినియోగానికైనా నిధులు విడుదల చేస్తున్నారు. సీఎం అనుమతి లేకుంటే చిల్లిగవ్వ కూడా ఖజానా దాటి బయటకు రావడం లేదు. దీంతో ఆర్థిక శాఖ దగ్గర ఆర్టీసీ ఫైల్​ పెండింగ్​ పడింది. సీఎం కేసీఆర్​ దీనిపై దృష్టి పెడితేనే వేతనాలు వచ్చే పరిస్థితి ఉంది. కానీ సీఎం కేసీఆర్​ దగ్గరకు ఎవరు తీసుకెళ్లాలనేది అయోమయంగా మారింది. రవాణా శాఖ మంత్రి నుంచి సీఎం దగ్గరకు ఫైల్​ వెళ్లడం కష్టమనే ప్రచారం జరుగుతోంది. ఆర్టీసీ కార్మికులకు వేతనాలు ఇంకా అందలేదనే సమాచారం సీఎంకు చేరితేనే రూ. 110 కోట్లు ఖజానా నుంచి ఆర్టీసీకి వస్తాయి.

ఆక్యుపెన్సీ పెరిగింది

కరోనా పరిస్థితుల నుంచి అన్ని రంగాలు కోలుకుంటున్నాయి. ఆర్టీసీ కూడా రవాణా వ్యవస్థను మెరుగుపర్చింది. బస్సులను పెంచింది. దీంతో ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేషియో కొంత మెరుగుపడింది. రోజు వారీ ఆదాయం రూ.12 కోట్లకు చేరింది. రోజువారీ టికెట్‌ ఆదాయం, కార్గో ఆదాయం పెరిగింది. వీటికి తోడుగా డీజిల్​ ధరలు పెరుగడంతో నిర్వహణ కూడా పెరుగుతోంది. ఇప్పుడు ఆర్టీసీ చేతిలో జీతాల కోసం రూ. 22 కోట్లు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెప్పుతున్నారు. కానీ ఇంకా వేతనాల కోసం రూ. 110 కోట్ల వరకు కావాల్సి ఉండటంతో… జీతాలను పెండింగ్​ పెట్టింది. అయితే వాస్తవంగా ఈ రెండు వారాల వ్యవధిలో ఆర్టీసీకి రూ. 115 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పుతున్నారు. కానీ వేతనాల కోసం మాత్రం వెయింటింగ్​లో ఉండాల్సి వస్తోంది.

ఉద్యమానికి సిద్ధం

ఆర్టీసీలో వేతన సవరణ అంశం ఇప్పుడు కీలకంగా మారింది. 2017 నుంచి దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు అతీగతీ లేదు. వేతన సవరణ చేస్తారా అనేది కూడా సందేహంగానే మారింది. ఇప్పుడున్న మేరకే జీతాలను ఇవ్వలేక చేతులెత్తేస్తుండగా… పెరిగితే ఎలా అనేది ఆందోళనకరమైన అంశమే. ఈ నేపథ్యంలో ఆర్టీసీలోని యూనియన్లు కూడా ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించాయి. టీఎంయూ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అదేవిధంగా ఈ నెల 22న ఎంప్లాయిస్​ యూనియన్​ ఆధ్వర్యంలో కార్మిక శాఖ కమిషనర్​ కార్యాలయాన్ని ముట్టడించనున్నారు. తెలంగాణ జాతీయ మజ్డూరు యూనియన్​ ఈ నెల 26న చలో బస్​భవన్​కు పిలుపిచ్చింది. అంతకుముందు ఆర్టీసీ స్టాప్​ అండ్​ వర్కర్స్​ ఫెడరేషన్​ కూడా సదస్సు నిర్వహిస్తోంది. ఇప్పటికే యూనియన్లు లేవంటూ సీఎం ప్రకటించారు. కొంతకాలంగా యూనియన్ల కార్యకలాపాలు కూడా తగ్గాయి. కానీ ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరుగుతుండటంతో మళ్లీ యూనియన్లు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి.

వేతనాల కోసం ఇంత ఘోరమా : అశ్వత్థామరెడ్డి, టీఎంయూ ప్రధాన కార్యదర్శి

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, జీవో ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు. ఉద్యోగులుగా గుర్తిస్తే నెలనెలా ఒకటో తారీఖునాడే జీతం వచ్చేది. కానీ ఇప్పుడు రెండు వారాలు గడుస్తున్నా జీతాలు వేయడం లేదు. మూడు నెలల నుంచి మరీ అధ్వాన్నం చేస్తున్నారు. వేతనాల కోసం తిప్పలు పెడుతున్నారు. కార్మికుల సంక్షేమం కోసం టీఎంయూ వరుసగా ఆందోళనకు సిద్ధమవుతోంది. వేతనాలు, వేతన సవరణపై పోరాటం చేస్తాం.


Next Story

Most Viewed