ఎగ్‌దోశకు తల్లి డబ్బులు ఇవ్వలేదని..

by  |
young man suicide
X

దిశ, ఏపీ బ్యూరో: ఇటీవల కాలంలో యువత చిన్న చిన్న కారణాలకు అలిగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. సెల్‌ఫోన్ ఇవ్వలేదని ఒకరు.. కొత్త ఫోన్ కొనివ్వలేదని మరొకరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఎగ్‌ దోశకు డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం తలారివారిపల్లికి చెందిన సాయికిరణ్(21) బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి ఎంతో గారాబంగా పెంచింది. అయితే బుధవారం ఉదయం సాయికిరణ్ ఎగ్‌దోశ తినేందుకు డబ్బులు కావాలని కుటుంబ సభ్యులను కోరాడు. అందుకు వారు నిరాకరించడంతో మనస్థాపం చెందాడు. కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. అనంతరం సెల్‌ఫోన్‌ను ఇంట్లోనే వదిలి గ్రామ సమీపంలోని గుర్రప్పకుంటలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అక్కడ పొలం పనులు చేస్తున్న కూలీలు యువకుడిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే యువకుడు మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్న విషయానికే చేతికొచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో సాయికిరణ్ తల్లి కన్నీరుమున్నీరైంది. కేవలం ఎగ్ దోస వద్దన్నందుకు ఇంత పని చేస్తావా అంటూ ఆ తల్లి రోదించిన తీరు గ్రామస్తులను కన్నీరు పెట్టించింది.

Next Story

Most Viewed