దిశ కథాస్రవంతి.. నిశ్శబ్దం

by  |
దిశ కథాస్రవంతి.. నిశ్శబ్దం
X

దిశ, కథా స్రవంతి : ‘సార్ రెండు రూపాయలుంటే ఇప్పించరా, ఆకలిగా వుంది నిన్నట్నుంచి ఏమి తినలేదు సార్, మీకు పుణ్యముంటుంది’ ఐదు నిమిషాల నుంచి అడుగుతున్నాడు ఆ పిల్లాడు. కానీ, ఆ మనిషికి ప్రియురాలితో సరస సంభాషణలు తప్ప పిల్లాడి మాటలు వినిపించడం లేదు. పది మంది చూస్తున్నారన్న పట్టింపు కూడా లేదు. ఆకలితో నీరసమొస్తుందేమో పిల్లాడు కుళాయి దగ్గరికెళ్తున్నాడు, అప్రయత్నంగానే నా చేయి పర్సులోకి దూరింది. ఏవో కాగితాలు, పది రూపాయల నోటు, నాలుగు రూపాయల చిల్లర చేతికి తగిలాయి. ఉన్నవి కూడా అవే. నా మీద నాకే జాలేసింది. ఆకలితో వున్న కుర్రాడికి రుపాయి కూడా ఇవ్వలేని పరిస్థితి. నా దగ్గరున్నవాటితో కూరగాయలు కూడా కొనలేను. ఇంతలో ఫ్లాట్ ఫాం మీదకి ఒకటో నంబరు బస్సొచ్చి ఆగింది. వెళ్లి బస్సులో కూర్చున్నాను. దూరంగా పిల్లాడు మళ్లీ ఆకలి వేటలో పడిపోయాడు.

ఇంట్లోకి వెళ్తూనే ‘అమ్మా రాధా, ఎక్కడికెళ్లావమ్మా, బయట అసలే ఎండలు మండిపోతున్నాయ్, ఇవిగో నీళ్లుతాగు’ అంటూ ఎదురొచ్చాడు నాన్న. చల్లగా ఉన్న కుళాయి నీళ్లు దాహాన్నీ, ఆకలిని కూడా తీర్చాయి. ‘సికింద్రాబాద్‌లో ఇంటర్వ్యూ కెళ్లాను నాన్నా’ అని చెప్పి, కాళ్లు కడుక్కొని, స్టౌ మీద కుక్కర్ పెట్టి అమ్మ దగ్గరికెళ్లాను. మంచం మీద నిద్రపోతోంది. రెండేళ్ల కింద అమ్మ పక్షవాతంతో మంచం పట్టింది. తాను డిగ్రీ సెంకడియర్లో ఉండగానే అక్కయ్య పెళ్లి కరీంనగర్‌లోని బావతో జరిగింది. ఉన్న ఒక్క అన్నయ్య చదువు ముగించి ఫ్రెండ్స్‌తో కలిసి తిరగడమే పనిగా చేసుకున్నాడు. నాన్న పోస్టల్ శాఖలో పనిచేసి ఈ మధ్యనే రిటైరయ్యారు. అదే పనిగా కుక్కర్ ఇస్తున్న విజిల్స్ విని స్టౌ దగ్గరికెళ్లాను. కూరలు తరముతున్నానేగానీ, ఆలోచనలు మొత్తం బస్టాండ్‌లో కనపడ్డ పిల్లాడి చుట్టే తిరుగుతున్నాయి.

ఆకలి.. ఎంత బలముంది దానికి. ఆగమన్నా ఆగదు కదా. గుడిసెల్లో బతికే పేదోడికి తెలుసు. తుఫాన్‌ను మించిన వేగం ఆకలికుందని. ‘ఏమైందమ్మా’ అన్న నాన్న పిలుపు విని ఆలోచనల్లోంచి తేరుకొని కూర గిన్నెను స్టౌమీద పెట్టాను, ‘అదే నువ్వెళ్లిన ఉద్యోగం సంగతి’ అన్నాడు నాన్న. ‘ఇంకా తెలీదు, తర్వాత చెప్తామన్నారు’ అని కూరవండటంలో నిమగ్నమయ్యాను. ఓ నిట్టూర్పు విడిచి మందులు తీసుకురావడానికి బయటికెళ్లాడు. పాపం నాన్నని చూస్తుంటే జాలేస్తుంది. ఇంటిని నెట్టుకు రావడానికి అప్పులు కూడా చేస్తున్నట్టున్నాడీమధ్య, అన్నయ్యని ఇవ్వన్నీ పట్టించుకున్నట్టు కనిపించడంలేదు. ఈ మధ్య రోజూ ఇంటికి రావడం కూడా మానేశాడు. ఏ రెండ్రోజులకొకసారో, అర్ధరాత్రి వస్తున్నాడు. సరిగా తినడం కూడాలేదు. నాన్న ఒక్కోసారి కోపానికొస్తున్నాడు. అమ్మకూడా బాధపడుతోంది. నేను కూడా ఒకసారి విపరీతమైన కోపంతో తిట్టాను.

వాడు బాధనంతా నాతో పంచుకున్నాడు. ‘రోజూ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్లు నొప్పెడుతున్నాయ్‌. చదివిన చదువుకి తగ్గ పనిలేదు, చిన్న ఉద్యోగమైనా సర్దుకుపోదామంటే, అవమానాలు భరించినా, ఆకలి మిగులుతుంది తప్ప ఉద్యోగం కాదు, సంపాదించి నాన్నను సుఖపెట్టాల్సిన సమయంలో ఆయన కష్టంపైన బతకడానికి సిగ్గనిపించింది. ఇంటికి రావాలంటేనే తల తీసేసినట్టు అనిపిస్తుంది’ అంటూ బావురుమన్నాడు. ‘నువ్వు తప్పకుండా సాధిస్తావని’ ఊరడించాను. ఒక్కో సమస్యకి బీభత్సపు తుఫానంత బలముంది. మౌన సంద్రంలాగానే భరించే మనసుండాలి. బయట నుంచి వస్తున్న నాన్న చేతిలో మందులతోపాటు లెటర్‌లాంటిది ఉంది. ఎదురెల్లి మందులు తీసుకున్నాను. ‘ఇదిగోనమ్మా, మీ తాతయ్య దగ్గర నుంచి లెటరొచ్చింది. ఏం రాసారో చదవమ్మా’ అంటూ కుర్చీలో జారగిలపడి కళ్లుమూసుకున్నాడు. ‘ఈ శివరాత్రికి అమ్మతో దేవునికి అభిషేకం చేయిస్తానని అమ్మమ్మ మెక్కుకుందిట. అమ్మనీ, నన్నూ బయల్దేరిరమ్మని రాసుంది నాన్నా’ అన్నాను.

మరునాడు జూబ్లీ బస్‌స్టేషన్‌లో బస్సు కోసం ఎదురుచూస్తుండగా అన్నయ్యొచ్చాడు. జేబులోంచి మూడువందలు తీసిచ్చాడు. ఇంతలో ఆవునూర్‌ బస్సొచ్చి ప్లాట్‌ఫాంపై ఆగింది. అమ్మను తీసుకెళ్ళి బస్సులో కూర్చోబెట్టి జాగ్రత్త చెప్పి ఇద్దరూ వెళ్లిపోయారు. ఊరుచేరేసరికి రాత్రయింది. స్నానం చేసి వసారాలో వచ్చి కూర్చున్నాను చల్లగాలికి మనసుకూడా తేలికయ్యింది. మరునాడు అమ్మని జాగ్రత్తగా పట్టుకొని గుడి మెట్లు ఎక్కుతున్నాను. చేతిలోపూలు కిందపడబోతుంటే, వాటిని అందుకునే ప్రయత్నంలో అప్రయత్నంగా అమ్మని వదిలిపెట్టాను. తుళ్లి పడబోతున్న అమ్మని వెనుక నుండి ఒడిసిపట్టుకున్నాడు సుధీర్‌. ‘థాంక్స్‌ సుధీర్‌ ఎలా ఉన్నావ్‌’ అని పలకరించాను. ‘బాగున్నాను ఎప్పుడొచ్చారు, అమ్మ ఆరోగ్యం కుదుటపడిందా’ అంటూ మెట్లెక్కడానికి సాయపడ్డాడు. సుధీర్ చిన్నప్పుడు నాతోనే చదివాడు.

పది రోజులు అమ్మకు మెడిసిన్ దగ్గర నుండి నాకు కావాల్సిన చిన్న చిన్న పనులన్నీ మామయ్య కంటే ఎక్కువగా సుధీరే చూశాడు. ‘రేపు ఉదయాన్నే వెళ్లిపోతున్నాము’ అన్నాను. మౌనంగా నిలబడ్డాడు. వీధి మలుపు తిరుగుతుండగా ‘నువ్వంటే నాకిష్టం, నువ్వొప్పుకుంటే పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. ఇరవై రోజులలో హైదరాబాదు వస్తాను. ఆలోచించి నిర్ణయం చెప్పు’ అంటూ వెళ్లిపోయాడు. అక్కయ్యకి ఆస్తమా పెరిగి కోమాలోకి వెళ్లిందనే సమాచారం రావడంతో అన్నయ్యతో కలిసి నాన్న కరీంనగర్ వెళ్లారు. అక్కయ్య చనిపోయిందనే విషయం తెలియడంతో అమ్మని తీసుకుని నూనూ వెళ్లాను. ఏంటీ బాధలు అన్ని అనుభవించే వారికేనా. తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణమవుతుంటే నాన్నవాళ్ల చెల్లెలొచ్చి అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యం జరపడం మంచిదని మొదలుపెట్టింది. ‘రాధని వీడికిచ్చి పెళ్లి జరిపిస్తే బాగుంటుందని’ బాంబు పేల్చింది. ‘బావ మంచివాడు. నువ్వు అయితే అక్క కొడుకుని జాగ్రత్తగా చూసుకోగలవు’ అంటున్నారు. నాలో సంఘర్షణ పెరిగిపోతుంది.

సుధీర్‌ గుర్తొచ్చాడు ఆ కళ్లలో ఆర్తి నన్నింకా వీడిపోవటం లేదు. ‘కూరగాయలు తీసుకురామ్మా’ నాన్న చెబితే సంచి చేతిలోకి తీసుకుని బయలుదేరాను, రోడ్డుపై నడుస్తున్న మాటే కానీ కనిపించేది మాత్రం శూన్యం. పరధ్యానంలో ఎటు వెళ్తున్నానో తెలియదు. వేగంగా వస్తున్న టిప్పర్‌ రెప్పపాటులో నాపైనుంచి వెళ్లిపోయింది, ఎక్కడున్నానో అర్థం కావడంలేదు. బలవంతంగా కళ్లు తెరుస్తుంటే ఒక్కొక్కరు మసకతెరలు తీసినట్టుగా కనిపిస్తున్నారు. చూపుతో పాటు మనసు కూడా ఆగిపోయింది. క్షణం గడిస్తే మనసులో దృశ్యం మారుతుందనుకుందో ఏమో, కాలం కూడా ప్రాణంతో కలిసి అక్కడే ఆగిపోయింది.

గంగాడి సుధీర్
93944 86053


Next Story

Most Viewed