ఎమ్మెల్యేలకు టెన్షన్.. రాజకీయ దుమారం రేపుతున్న రేవంత్, సీతక్క కామెంట్స్

by  |
ఎమ్మెల్యేలకు టెన్షన్.. రాజకీయ దుమారం రేపుతున్న రేవంత్, సీతక్క కామెంట్స్
X

దిశ, పరకాల: ప్రతిపక్షాలు లేకపోతే పాలకపక్షాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాయి. అందుకే సమాజం ఎప్పుడు ప్రశ్నను కోరుకుంటుంది. ప్రశ్నను ఇష్టపడుతుంది. ప్రశ్నను ఆదరిస్తుంది. ప్రశ్నను కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తుంది. ఎందుకంటే ప్రశ్నతోనే సమాజం ఉన్నతంగా తీర్చిదిద్దిబడుతోంది. ఇది ఎంత సత్యమో ఇప్పుడు పరకాల భూపాలపల్లి ప్రాంత ప్రజల్లో జరుగుతున్న చర్చను పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది. పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల వ్యాప్తంగా ఏ నోట విన్నా సెప్టెంబర్ 30వ తేదీన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభ గురించే ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఆ వేదికగా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్కల ఉపన్యాస శైలి సామాన్య ప్రజల్లో రాజకీయ దుమారం రేపుతున్నాయి.

ఒకరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దునుమాడితే, మరొకరు జిల్లా రాజకీయ నేతల భరతం పట్టారు. 1200 మంది త్యాగాలతో నిర్మించుకున్న తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే ఉపాధి పొంది రాష్ట్రాన్ని దుర్భేద్యంగా మారుస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శిస్తే, గుట్టలను అక్రమంగా పట్టాలు చేసుకొని చుట్టూ ఉన్న అసైన్డ్ భూములను అప్పనంగా కాజేస్తున్న కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలను సీతక్క టార్గెట్ చేసింది. తాము బతకడం కోసం ఎకరమో, అరెకరమో పోడు చేసుకున్న గిరిజనుల్ని మాత్రం అమానవీయంగా హింసించడం పట్ల సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. ఇరువురి రాజకీయ ప్రసంగం గ్రామీణ ప్రాంతంలోని సామాన్య ప్రజల్ని కూడా ఆలోచింపజేసే విధంగా ఉండడంతో ఈ విషయం క్షేత్రస్థాయి ప్రజల్లో రాజకీయ గందరగోళాన్ని సృష్టించాయి. ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి, ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యేలకి ఈ రాజకీయ దుమారం పెను ముప్పుగా మారే అవకాశం ఉందని పలు రాజకీయ విశ్లేషణలు తెలుపుతున్నాయి. ఏది ఏమైనా తమకోసం ప్రశ్నించే వారిని ప్రజలు ఆదరిస్తారని ఈ చర్చలు తెలియజేస్తున్నాయి.



Next Story

Most Viewed