జడ్పీ చైర్మన్ పదవిని దళితులకు కేటాయించాలి

by  |
DBSU Secretary
X

దిశ, ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ పదవిని దళితులకు కేటాయించాలని దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.చిట్టిబాబు డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం కోణంలో జిల్లా వైస్ చైర్మన్ పదవి దళితులకు కేటాయించాలన్నారు. విజయనగరం జిల్లా ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు అంటే సుమారు 45ఏళ్లుగా జిల్లా పరిషత్ చైర్మన్ గానీ, కనీసం వైస్ చైర్మన్ పదవి దళితులకు దక్కక పోవడం సామాజిక న్యాయానికే విఘాతం కలుగుతుందని అన్నారు.

జిల్లా మొత్తం జనాభాలో 11% ఎస్సీ జనాభా ఉన్నా గత 45 సంవత్సరాలు జిల్లా దళితులు దగా పడుతూనే ఉన్నారని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత సాధికారతకు రాష్ట్రస్థాయిలో అనేక చర్యలు చేపడుతున్నా, జిల్లాలో ఉన్న మంత్రి బొత్స, వారి పార్టీ నేతలు ముఖ్యమంత్రి ఆశయాలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. జిల్లాకు చెందిన రాజకీయ ప్రముఖులు తమ కులానికి చెందినవారికి, వారి అనుచరులకు వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టాలి అని చూస్తున్నారే తప్ప దళితులకు కేటాయించేందుకు నిరాసక్తి చూపుతున్నారని ధ్వజమెత్తారు. ఓటేసి గెలిపించిన దళితుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కనీసం వైస్ చైర్మన్ పదవి దళితులకు దక్కేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారుు.

జిల్లాలో దళితులకు జరుగుతున్న “దగా” ను ముఖ్యమంత్రి దృష్టికి, ప్రభుత్వ సామాజిక న్యాయ విభాగానికి కూడా ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు నగర వరప్రసాద్, జిల్లా జాయింట్ సెక్రటరీ జె.చిన్నారావు, దళిత ఎంపవర్మెంట్ కన్వీనర్ కాలిబాబు తదితరులు పాల్గొన్నారు


Next Story

Most Viewed