ప్రపంచాన్ని న్యూడ్‌గా చుట్టేస్తున్న జంట!

by  |
ప్రపంచాన్ని న్యూడ్‌గా చుట్టేస్తున్న జంట!
X

దిశ, వెబ్‌డెస్క్ : బట్టలు కట్టుకోకుండా అడవుల్లో బతికిన రోజుల నుంచి అందంగా ముస్తాబవుతూ, నిండైన వస్త్రధారణకు అలవాటుపడే వరకు మానవ పరిణామక్రమంలో ఎన్నో దశలున్నాయి. అయితే, ‘పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి’ అన్నట్టుగా.. ఇటీవలి కాలంలో కొందరు ‘నేచరిస్ట్’(న్యూడిస్ట్)గా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. విదేశాల్లో ఈ పోకడ విపరీతంగా పెరిగిపోగా.. నేచరిస్ట్‌ల కోసం ప్రత్యేకంగా నేక్డ్ బీచ్‌లు, పార్కులు, రెస్టారెంట్లు.. వంటి నగ్న ప్రదేశాలు ఉండటం విశేషం. ఈ క్రమంలోనే ఒక అడుగు ముందుకేసిన ఓ జంట.. ప్రపంచాన్ని నగ్నంగా చుట్టేస్తున్నారు. ఇంతకీ వాళ్లెవరు? ఏంటి వారి కథ?

ప్రకృతిలో మమేకం కావాలంటే.. నగ్నంగా ఉండాలని అంటున్నారు బెల్జియానికి చెందిన నిక్, లిన్స్ జంట. బెల్జియంలోని ‘గెంట్’ సిటీకి చెందిన వీళ్లు 12 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. 30 ఏళ్ల వయసు గల ఈ ఇద్దరు ప్రపంచాన్ని నగ్నంగా చుట్టేయడమే పనిగా పెట్టుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరూ కలిసి ఓ బ్లాగ్ స్టార్ట్ చేశారు. ‘నేచరిజం’పై జనాల్లో ఉండే అపోహలను తొలగించడమే దాని ఉద్దేశం. ‘సెక్స్ విషయంలో మాత్రమే న్యూడిటీ ఉంటుందని అందరూ అపోహ పడుతుంటారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. ప్రకృతిని ఆస్వాదించాలన్నా, అందులో భాగం కావాలన్నా న్యూడిటీ అవసరం’ అనేది ఈ జంట అభిప్రాయం.

నిక్, లిన్స్‌లు ఇప్పటికే బోలెడన్ని ప్రదేశాలు తిరిగారు. ప్రయాణంలో దుస్తులు వేసుకునే ఈ జంట.. దర్శనీయ ప్రదేశంలో మాత్రం ఒంటి మీదున్న బట్టలకు బైబై చెప్పేస్తారు. పర్వతాలు, కొండ కోనలు, అడవులు, జలపాతాలు, రిసార్టులు, పార్కులు, సాగర తీరాల్లో న్యూడ్‌గా ఫొటోలు దిగి తమ వెబ్‌సైట్, ఇన్‌స్టా (నేక్డ్ వాండరింగ్స్)లో పోస్ట్ చేస్తుంటారు. వారి ఫన్ అడ్వెంచర్ విషయాలను, నేచరిస్ట్ లైఫ్‌స్టైల్‌ను తమ ఫాలోవర్లకు అందిస్తారు. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూడ్ ఫ్రెండ్లీ రిసార్ట్స్ వివరాలను తమ ట్రావెలింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో అందిస్తారు. ఈ న్యూడ్ కపుల్ ట్రావెలింగ్ ఇన్ఫోకు, ఫొటోలకు ఎంతోమంది అభిమానులున్నారు. రోజురోజుకూ వీరి క్రేజ్ పెరుగుతుండటంతో ఫాలోవర్ల సంఖ్యతో పాటు, అదనపు ఆదాయం కూడా వస్తుండటంతో వీరి ట్రావెలింగ్ ఖర్చులకు ఢోకా లేకుండా పోయింది. దాంతో వారు దీన్నే తమ వృత్తిగా స్వీకరించి ‘న్యూడ్ ట్రావెలింగ్’ చేస్తున్నారు. ఇప్పటి వరకు వారు తిరిగిన బీచ్‌లలో కొలంబియాలోని ‘టేరోనా నేషనల్ పార్క్’ అత్యంత సుందరమైందని ఆ జంట అభిప్రాయపడింది. ఈ ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మైండ్‌సెట్ ఉన్న నేచరిస్ట్‌లను కలవడం, వారితో స్పెండ్ చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయమని వారంటున్నారు. న్యూడిటీతో పాపులర్ అయిన ఈ జంట జాబ్ కోసం వెళ్తే, దాన్ని సాకుగా చెబుతూ.. పలు సంస్థలు జాబ్ ఇవ్వడానికి నిరాకరించాయని నిక్, లిన్స్‌లు చెబుతున్నారు. దాంతో.. వీరే స్వయంగా నేచరిస్ట్‌ల కోసం ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు.

నేచరిస్ట్‌లుగా ఎలా మారారంటే?

బెల్జియంలో ఓ స్పా ఉంది. దాని ప్రత్యేకత ఏంటంటే.. అందులో స్పా చేయించుకోవాలంటే నేక్డ్‌గా వెళ్లాల్సిందే. నిక్, లిన్స్‌లు అక్కడికి తరచుగా వెళ్లేవారు. ఈ క్రమంలోనే వారికి నేచరిజం మీద ఆసక్తి పెరిగింది. దాంతో వాళ్లు నేచరిస్ట్ క్లబ్స్, క్యాంప్ గ్రౌండ్స్, యాక్టివిటీస్, ఈవెంట్స్ ఇలా అన్నింటి గురించి తెలుసుకున్నారు. అలా నేచరిస్టులుగా మారిపోయారు.


Next Story

Most Viewed