అసలే కరోనా కష్టాలు.. ఆపై అగ్నికి ఆహుతైన ఇల్లు

by  |
అసలే కరోనా కష్టాలు.. ఆపై అగ్నికి ఆహుతైన ఇల్లు
X

దిశ, నల్లగొండ: అది నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామం. అక్కడ గురువారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు అంటుకుని ఓ ఇళ్లు పూర్తిగా కాలిపోయింది. అది ఏపూరి రోమన్ ఇళ్లు. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం అతడిది. అసలే కరోనా మహమ్మారి నేపథ్యంలో నెల రోజులుగా ఏ పనీ లేక తిండి తినేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో ఇంటిలో సర్వం అగ్నికి ఆహుతయ్యాయి. కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కాలిపోయిన ఇంటి ఫొటోలతోపాటు అతడి దీనావస్థను గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు. అంతే ఆ మెసేజ్ చదివిన గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి స్పందించాడు. హైదరాబాద్‌లో విద్యుత్ శాఖలో పనిచేసే అంజయ్య ఆ మెసెజ్ చదవగానే తనవంతుగా నిత్యావసర సరుకులు, కొంత నగదు ఇస్తానని ప్రకటించారు. వెంటనే అదే గ్రూపులో ఉన్న గ్రామపెద్దలు స్పందించారు. మేమున్నామంటూ ముందుకొచ్చి తలా కొంచెం సాయం ప్రకటించారు. ఎంపీపీ లింగారావు, సర్పంచ్ మార్తం శ్రీదేవి, మాజీ సర్పంచ్ పేరం వెంకన్న, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్ రావు, విద్యుత్ శాఖ ఉద్యోగి అంజయ్య తదితరులంతా కలిసి కొంత నగదుతో పాటు వంట సామాగ్రిని బాధితుడికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దాంతోపాటుగా ఇల్లు పూర్తిగా కాలిపోయిన అతడికి 15 రోజుల్లో కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చేందుకు చేతులు కలిపారు. ఇంతటి కరోనా కష్టకాలంలోనూ తమకు ఉన్నదాంట్లోనే సాయం చేయడం గొప్ప విషయమంటూ పలువురు అభినందిస్తున్నారు. ఓ వాట్సాప్ గ్రూప్‌లో చేసిన చిన్న పోస్ట్ గ్రామస్తులందరూ ఏకతాటిపైకి రావడంతో పాటు ఓ కుటుంబం రోడ్డున పడకుండా కాపాడింది.

Tags: Nalgonda, house burned down, India, Helping, WhatsApp, Post


Next Story

Most Viewed